ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ, ఏలూరులోని అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు వ్యూహరచన చేస్తుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ శాఖ డీజీగా సీతారామాంజనేయులు నియామకం జరిగిన రెండురోజుల్లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తొలి దాడి జిల్లాలో ప్రారంభం కావడం విశేషం. అటవీ శాఖలో పనిచేస్తూ భారీగా ఆస్తులు కూడగట్టిన కోనా రామకృష్ణపై సోమవారం ఏకకాలంలో ఏడుచోట్ల సోదాలు నిర్వహించారు. గత ఐదేళ్లలో భారీగా కూడబెట్టిన అధికారులను గుర్తించి వారికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడింది ఏసీబీ.
ఆయనో అవినీతి తిమింగలం : ఏపీ అటవీ అభివృద్ధి శాఖలో మొలిచిన అవినీతి మొక్కను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏకంగా మూడు రాష్ట్రాల పరిధిలో అవినీతి అధికారి ఇళ్లల్లో పక్కా స్కెచ్‌తో దాడులు చేపట్టారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ కోనా రామకృష్ణ ప్రస్తుతం వివిధ ఆరోపణలపై సస్పెన్షన్‌లో ఉండగానే అతని ఇళ్లపై ఏసీబీ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, తమిళనాడులోని చెన్నై, ఏలూరు నగరంలోని కట్టా సుబ్బారావు తోట ప్రాంతంలోని డివిజినల్ మేనేజర్ రామకృష్ణఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కామవరపుకోట మండలం తడికలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లాకర్‌లో అరకిలోకు పైగా బంగారు ఆభరణాలు, సుమారు రెండు కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మరో రూ.16లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, వివిధ భూములకు సంబంధించిన ఆస్తుల పత్రాలు, కొన్ని చెక్కులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు కట్టాసుబ్బారావు తోట ప్రాంతంలోని రామకృష్ణ ఇంటిలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారుల బృందం రూ.8.67లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఇంకా ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకుల్లోని లాకర్లను పరిశీలిస్తున్నారు.
తొలి నుంచి ఆరోపణలే
అటవీ సంపదను పరిరక్షించటం.. అభివృద్ధి చేయటం ఆ అధికారుల బాధ్యత.. కానీ తాము మాత్రమే అభివృద్ధి చెందేలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ దొరికిపోయారు. అటవీ అభివృద్ధి సంస్థలో అక్రమాలకు పాల్పడుతున్న వైనం విచారణలో వెల్లడి కావటంతో డివిజినల్ మేనేజర్ కోనా రామకృష్ణ, డీపీఎం ఆర్.కృష్ణవేణిని గతంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చింతలపూడి మండలం, యర్రగుంటపల్లి అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన బీట్ నుంచి అక్రమంగా జామాయిల్ కలపను రవాణా చేస్తున్న లారీని గ్రామస్తులు అడ్డుకుని అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో యర్రగుంటపల్లి అటవీ ప్రాంతం నుంచి 22 టన్నుల జామాయిల్ కలపతో వెళ్తున్న లారీని యర్రగుంటపల్లికి చెందిన కొంత మంది యువకులు అడ్డుకున్నారు. లారీ డ్రైవర్‌ను పర్మిట్ గురించి ఆరాతీయగా పర్మిట్ వెనుక బండిలో వస్తుందని, బీపీసీఎల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నట్లు చెప్పాడు. గంట తరువాత అటవీ సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి అప్పటి కప్పుడు పర్మిట్ రాయించి తీసుకువచ్చి డ్రైవర్‌కు ఇవ్వడంతో స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పర్మిట్‌పై కొమ్ముగూడెం 4వ బీట్ నుంచి కలప నరికి ఎగుమతి చేస్తున్నట్లు ఉండగా, వాస్తవానికి యర్రగుంటపల్లిలో 2008లో వేసిన 1వ బీట్ నుంచి లారీలో కలప లోడ్ చేశారని గ్రామస్తులు ఉన్నతాధికారులకు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో సెప్టెంబర్ 22న గుంటూరు విజిలెన్స్ డీఎం రామలింగారెడ్డి చింతలపూడి మండలం యర్రగుంటపల్లి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అడవిలో ఉన్న జామాయిల్ కలపను తనిఖీ చేశారు. విచారణలో కలప రవాణాలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. గతంలో కూడా చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలోనూ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి అధికారుల చిట్టాతో దాడులే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిరహిత పాలనే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడంతో అవినీతి అధికారులు, సిబ్బంది భరతం పట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటంతో జిల్లాలోనూ అవినీతి ఉద్యోగులపై ఆరా తీస్తున్నాం. 2019లో జిల్లాలో 10 కేసులు నమోదు చేశాం. రెవెన్యూ శాఖలో 5, పంచాయతీ రాజ్ 1, ఏపీఈపీడీసీఎల్ 2, మిగిలిన శాఖలో మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. అక్రమార్కులపై బాధితులు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం. – మేకా సుధాకర్, ఏసీబీ డీఎస్పీ, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment