
విజయవాడ: విజయవాడ ముస్సిపల్ టౌన్ ప్లానింగ్ ఏఓ నల్లూరి వెంకట శివప్రసాద్‌కు చెందిన గన్నవరంలోని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘుకు ఆయన సమీప బంధువు అయిన వెంకట శివప్రసాద్, ఆయన భార్య గాయత్రి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో గాయత్రి టౌన్ ప్లానింగ్‌లో టెక్నికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఇటీవల ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీదనే మొత్తం ఆస్తుల డాక్యుమెంట్లు ఉన్నాయి. గన్నవరంలోని ఇంట్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, రూ.50 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్లు, పేరు లేని ఎంవిఆర్ జ్యూవెల్లరీ బిల్లులు కనుగొన్నారు.
అలాగే గన్నవరంలో 1.40 ఎకరాల్లో కళ్యాణ మండపం నిర్మించారు. గన్నవరంలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ లో 16 ఫ్లాట్‌లు, కృష్ణా జిల్లా వేల్పూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు కనుగొన్నారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీమ్ డీఎస్పీ రమాదేవిల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కాగా, రఘుకు షిర్డీలో కూడా ఓ లాడ్జ్ ఉందని, గన్నవరంలోని ఓ రియల్ ఎస్టేట్‌లో శివప్రసాద్ పేరు మీద 300 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది.