► కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈ
► పెండింగ్‌బిల్లు చెల్లించేందుకు రూ. 20వేలు లంచం డిమాండ్
► వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలాభాను, సిబ్బంది.
కురుపాం: కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యుత్‌శాఖ ఏఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్న సంఘటన కురుపాంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలా భాను స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం మాదలింగికి చెందిన లైసెన్స్‌డ్ కాంట్రాక్టర్ ఎస్.సురేష్ కొన్ని నెలలుగా కురుపాం మండలంలో విద్యుత్‌శాఖకు చెందిన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వాటికి సంబంధించిన బిల్లులు బకాయి ఉన్నాయి.
ఆ బిల్లులు చల్లించేందుకు ట్రాన్స్‌కో ఏఈ టి.వేణు రూ. 20,000లు లంచం డిమాండ్ చేయగా ఆ కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ. 10,000లు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీకి సమాచారం అందివ్వగా శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌కో ఏఈకి రూ. 10,000లు లంచం ఇస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలాబాను, సీఐలు ఎస్.లక్ష్మోజీ, డి.రమేష్ వలపన్ని పట్టుకున్నారు.
విసిగెత్తిపోయా...
కొన్నాళ్లుగా విద్యుత్ శాఖకు చెందిన పనులు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చేసిన పనులకు నాకు లక్ష రూపాయల వరకు విద్యుత్‌శాఖ ద్వారా రావాల్సి ఉంది. బిల్లు కోసం ఎన్నిమార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదు. చివరకు ఏఈ లంచం అడగటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.
– ఎస్.సురేష్, కాంట్రాక్టర్, మాదలింగి గ్రామం