బస్సెనక బస్సు ఢీ
సినీఫక్కీలో ప్రమాదం ఒకనికి తీవ్రగాయాలు
ట్రాఫిక్‌కు అంతరాయం
కశింకోట: జాతీయ రహదారిపై కశింకోట కూడలిలో గురువారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. సినీ ఫక్కీలో వరుసగా ఐదు వాహనాలు ఒక దాని వెంట ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతోపాటు మరికొందరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న ట్రైలర్ లారీ ముందు వెళుతున్న నర్సీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ నాన్-స్టాప్ బస్సును ఢీకొంది. దీంతో ఆ బస్సు ముందు ఉన్న క్వాలిస్‌ను, ఆ కారు ముందున్న పాయకరావుపేట నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సును, ఆ ఆర్టీసీ బస్సు దాని ముందు ఆగి ఉన్న అచ్యుతాపురం ఎస్‌ఈజడ్ పరిశ్రమకు చెందిన ఓ ప్రైవేటు బస్సును వరుసగా ఢీకొన్నాయి. దీంతో అమలాపురం నుంచి విశాఖపట్నం వెళుతున్న కారులో ఉన్న విశాఖకు చెందిన వీసంశెట్టి వెంకటేశ్వర్లు గాయపడ్డారు. మరో ముగ్గురు పెళ్లి బృందం సభ్యులు, కారు డ్రైవర్ సిహెచ్.శ్రీను స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు.
కారు ముందు, వెనుక భాగాలు బస్సుల మధ్య ఇరుక్కుపోవడంతో దెబ్బతిన్నాయి. నాన్-స్టాప్ బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్వర్లును అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు సుమారు గంటసేపు నిలిచిపోయాయి. సీఐ ప్రసాద్, ఎస్‌ఐ స్వామినాయుడులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు ఆర్టీసీ బస్సులను, కారును ముందుగా పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం ట్రైలర్‌ను క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ మేరకు ప్రమాదానికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ స్వామినాయుడు తెలిపారు.