శంషాబాద్, న్యూస్‌లైన్: ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలు నిత్యకృత్యం అవుతూ ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏడాది కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆరు నెలల క్రితం ఇటుక లారీ బోల్తా పడిన ప్రమాదంలో ఐదురుగు మృతిచెందిన విషయం తెలిసిందే. అనంతరం కొద్దిరోజులకే ఆగిన లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్ కాలి బూడిదయ్యాడు. ఆ తర్వాత కూడా ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శనివారం రాత్రి టాటా సఫారీ కారు కిషన్ గూడ వద్ద బోల్తాపడడంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. దీంతో వాహనదారులు ఔటర్ అంటేనే అమ్మో.. అనే విధంగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. ఔటర్‌పై వెళ్లే వాహనాలు గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని మించి వెళ్తున్నాయి. దీంతో వాహనదారులు వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల బారినపడుతున్నారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి మధ్యన ఉన్న ఔటర్ రోడ్డుపై ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన కూడళ్ల వద్దనైనా అధికారులు లైటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది. సినీ నటుడు కోట శ్రీనివాస్‌రావు కుమారుడు, క్రికెటర్, ఎంపీ అజహారుద్దీన్ కుమారుడితో పాటు పలువురు ఔటర్ ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.
రెండేళ్ల క్రితం జీవీకే సంస్థకు చెందిన విదేశీ కారు ఔటర్‌పై బోల్తాపడడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేవలం ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఔటర్‌పై ఇప్పటికే కనీసం 30 మందికిపైగా మృత్యువాత పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజేంద్రనగర్, నార్సింగి, రాయదుర్గం, పహడీషరీఫ్ ఠాణాల పరిధిలోని ఔటర్ రింగురోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
పర్యవేక్షణ కరువు
ఔటర్ రింగు రోడ్డుపై ఇటు శంషాబాద్ అటు నార్సింగి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాహనదారులు టోల్ ఫీజు చెల్లించి ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుకొనే సౌకర్యాన్ని కల్పించారు అధికారులు. ఔటర్ మీదికి చేరుకున్న వాహనాల వేగ నియంత్రణతో పాటు ప్రమాదాలు తగ్గించేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఔటర్ రింగురోడ్డు మధ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటే అంబులెన్స్, ఫైరింజన్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రాణాలు కాస్త గాల్లో కలుస్తున్నాయి. పోలీసుల గస్తీ పెంచి డేంజర్ జోన్లలో వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే సమాచారాన్ని చేరవేయడానికి ఎస్‌ఓఎస్ ఫోన్‌ల సౌకర్యం ఉంది. అలాంటి ఏర్పాట్లు చేస్తే కొంత పరిస్థితి మెరుగుపడొచ్చు. కొత్వాల్‌గూడ చెన్నమ్మ హోటల్ సమీపంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వాహనదారుల తికమక
శంషాబాద్ కిషన్‌గూడ వద్ద ఔటర్‌పైకి చేరుకునే వాహనదారులు నిత్యం వందల సంఖ్యలో తికమక పడుతున్నారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు గచ్చిబౌలి వైపు రోడ్డును ఎక్కుతుంటారు.
ఒకవైపు వెళ్లాల్సిన వాహనాలు ఇంకోవైపు వెళ్లడం తిరిగి మళ్లీ వెనక్కి వస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వాహనాలు ఈ దారి గుండా నడిపించే వారికి తప్ప కొత్తవారికి ఈ చిక్కులు సర్వసాధారణంగా మారుతున్నాయి. ఔటర్‌పై పోలీసులు పూర్తి స్థాయి పర్యవేక్షణ పెంచడంతో పాటు ప్రమాద ప్రాంతాల వద్ద వేగ నియంత్రణ బోర్డులు, సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాల తీవ్రతను తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు.