అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంత నీళ్లలో పడిన కారు, ఆటో, బైక్.
శంషాబాద్ రూరల్: రహదారిపై అదుపు తప్పిన కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. గుంతలోని నీళ్లలో మునిగి ఊపిరాడక తల్లీ, కొడుకు మృతి చెందిన దుర్ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌లోని శ్రీరాంనగర్ కాలనీ వాసి మెరువ ఆదిశేషరెడ్డి(57) బాబా ఆటోమిక్ రీసెర్స్ సెంటర్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
సంక్రాంతి సందర్భంగా సొంత ఊరైన ఏపీ నంద్యాల సమీపంలోని జిల్లెల గ్రామానికి తన తల్లి ఎం.రాములమ్మ(88)ను తీసుకుని ఈసీఐఎల్ నుంచి కారులో శనివారం బయలుదేరాడు. మార్గ మధ్యలో మండలంలోని ఘాంసిమిగూడ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటో, బైక్‌ను ఢీకొడుతూ.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది.
నీళ్లలో మునిగి మృత్యువాత..
కారు ఢీకొనడంతో బైక్‌తో పాటు ఆటో కూడా గుంత నీళ్లలో పడిపోయాయి. కారులో ఉన్న ఆదిశేషరెడ్డి, రాములమ్మ అందులోని నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఆటోలో ఉన్న ముగ్గురిలో డ్రైవర్ రాయన్నగూడ సిద్దయ్యకు గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న గొల్ల ఆంజనేయులు(25)కు కాలు విరగగా బాలికకు గాయాలయ్యాయి.
వీరందరనీ స్థానికులు గుంతలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment