జవాబుదారీతనంగా జెడ్పీ | Accountability | Sakshi
Sakshi News home page

జవాబుదారీతనంగా జెడ్పీ

Published Sat, Dec 20 2014 1:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Accountability

సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ పాలనను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. తొలుత కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణపై దృష్టి సారించిన జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) బి. సుబ్బారావు సెక్షన్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఫైళ్ల నిర్వహణ సక్రమంగా లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
 ప్రతి ఫైలూ జవాబుదారీతనంగా ఉండాలని తేడా వస్తే ఉపేక్షించేది లేదని ఆదేశిస్తూ ఈ సందర్భంగా కొంత మంది సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫైళ్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు. మార్చి 31వ తేదీ లోపు పనులు అన్నీ పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
 
 జిల్లాలో మట్టి, గ్రావెల్, లింక్ రోడ్లకు సంబంధించి రూ. నాలుగు కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. తాగునీటికి సంబంధించి కోటి రూపాయల పనులు సాగుతున్నాయి.
 
 ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వెల్దుర్తి, దుర్గి, దాచేపల్లి మండలాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. బాపట్ల, తెనాలి, అమరావతి ప్రాంతాల్లో మంచి నీటి పథకాలకు ఫిల్టర్ బెడ్‌లు మార్చాల్చి ఉంది. ఈ పనులు సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సిబ్బందిని సీఈవో ఆదేశించారు.
 
 ఇంజనీరింగ్ విభాగం పై సమీక్ష..
 జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ విభాగంపై సీఈవో దృష్టి సారించారు. ఇప్పటికే ఓ సారి జిల్లాలో ఉన్న అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాల సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
 
 ఐదేళ్లుగా జిల్లాలో ఏ పనులు చేశారు. ఏ ఏ పద్దుల కింద వచ్చిన నిధులు ఎన్ని, వాటిని ఏ ఏ పనులకు వినియోగించారు. ఓ పద్ధతి ప్రకారం రికార్డులు తయారు చేసుకుకొని మళ్లీ సోమవారం జరిగే సమావేశానికి తీసుకురావాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.
 
 ఇదిలావుంటే, జెడ్పీలో నిధుల వినియోగం ఓ పద్ధతి ప్రకారం జరగకపోవడంతో సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటున్నారు. నిధుల వినియోగంలో తేడా వస్తే చర్యలు తప్పవని సీఈవో చేసిన హెచ్చరికలు ఏ పరిణామానికి దారితీస్తాయోనని సిబ్బంది ఆందోళనచెందుతున్నారు.
 
 జిల్లాకు 19 మండల రిసోర్స్ సెంటర్లు మంజూరయ్యాయని సీఈవో తెలిపారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు రూ. 10 లక్షలు కేటాయించామని, త్వరితగతిన వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశిం చారు. అలాగే జిల్లాలో ఉన్న ఎనిమిది అతిథి గృహాల మరమ్మతులు, భవనాల నిర్వహణ కోసం మరో రూ. 25 లక్షలు కేటాయించామన్నారు.
 
 ప్రత్యేక కసరత్తు ...
 జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. తొలుత ఇంజనీరింగ్ విభాగంపై దృష్టి సారించాం. ఐదేళ్ల కాలంలో జరిగిన పనుల వివరాలు తెలియజేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఇప్పటికే ఆదేశించాం. బడ్జెట్ రూప కల్పనపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాం. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
 - బి. సుబ్బారావు, జెడ్పీ సీఈవో
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement