
సజీవదహనం కేసు నిందితుడి అరెస్ట్
తెనాలి : తనతో సహజీవనం చేస్తున్న మహిళను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడిని హత్య చేసి ఇంటికి నిప్పు పెట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుడు హత్యకు పాల్పడిన వైనాన్ని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ సౌజన్య వివరించారు.
తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన గండికోట మణికంఠకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. గతంలో గ్రామంలోని ఓ మహిళ మెడలోని గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఆమె ప్రతిఘటించడంతో హత్య చేయబోయిన కేసులో మణికంఠ నిందితుడిగా ఉన్నాడు. భర్త ప్రవర్తన నచ్చని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కాకుమాను మండలం లింగాయపాలెంలో బేలుదారుపనికి వెళ్తున్న మణికంఠకు, అక్కడ పనిచేసే దేవనపల్లి లక్ష్మి అనే వివాహితతో చనువు ఏర్పడింది.
ఈ నెల మొదటి వారంలో ఆమెను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడు కాశీని నందివెలుగులోని తన ఇంటికి తీసుకువచ్చి వాళ్లతో కలసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 12వ తేదీ రాత్రి ఇరువురికి ఘర్షణ జరుగగా, అప్పటికే మద్యం సేవించి ఉన్న మణికంఠ.. లక్ష్మిపై , ఆమె కుమారుడిపై కిరోసిన్‌పోసి నిప్పటించాడు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో లక్ష్మి, ఆమె కుమారు అక్కడే సజీవదహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం నిందితుడు తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాడన్న సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు.