నాకు ప్రాణహాని ఉంది.. | Accused Srinivasa Rao Shifting to Vizag KGH Hospital | Sakshi
Sakshi News home page

జగన్‌ ధరించిన చొక్కా కోసం కోర్టులో పిటిషన్‌ 

Published Wed, Oct 31 2018 2:29 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

Accused Srinivasa Rao Shifting to Vizag KGH Hospital - Sakshi

విశాఖ నుంచి సాక్షి ప్రతినిధులు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీనివాస్‌ తనకు ప్రాణహాని ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర కలకలం రేగుతోంది. విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు శ్రీనివాస్‌ను మూడు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్‌ అధికారులు మంగళవారం గుండెదడగా ఉందని, చెయ్యి నొప్పిగా ఉందని చెప్పటంతో ఓ ప్రైవేట్‌ వైద్యుడిని రప్పించి వైద్య పరీక్షలు చేయించారు.

‘నిందితుడి ఆరోగ్యం బాగుంది. అయినా ఒకసారి కేజీహెచ్‌కు తీసుకెళ్లండి’అని వైద్యుడు సూచించడంతో పరీక్షల నిమిత్తం తరలించిన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది సర్‌.. ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి...’అంటూ నిందితుడు శ్రీనివాస్‌ మొరపెట్టుకోవడం గమనార్హం. ‘నన్ను చంపి రాజకీయం చేసేందుకు చూస్తున్నారు. నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండి’అంటూ శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ఉలిక్కిపడ్డ పోలీసులు ముందుగా నిర్దేశించిన స్క్రిప్ట్‌ ప్రకారం నిందితుడితో ’నాలుగు వ్యాక్యాలు’పలికించేందుకు నానా పాట్లు పడ్డారు.  
బెడిసికొట్టిన పథకం... 
పోలీసులు ముందస్తు ప్రణాళిక ప్రకారం కేజీహెచ్‌కు తరలించిన సందర్భంగా నిందితుడు శ్రీనివాస్‌తో .. ‘నేను జగన్‌ అభిమానిని. ప్రజల కోసమే ఇదంతా చేశా’అని చెప్పించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తనకు ప్రాణహాని ఉందంటూ ఈ సందర్భంగా నిందితుడు కేకలు వేయడం కేసు విచారణలో తెర వెనుక కుట్రను బహిర్గతం చేసింది. పోలీసులు చెప్పిన ‘ఆ నాలుగు’వాక్యాలు కాకుండా నిందితుడు శ్రీనివాస్‌ ఆసుపత్రిలో వాహనం దిగిన వెంటనే.. ‘నాకు ప్రాణహాని ఉంది సర్‌..’అంటూ తన ఆందోళనతో ప్రారంభించడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి అలెర్ట్‌ అయ్యారు. 

తమ స్క్రిప్టుకు భిన్నంగా నిందితుడు మాట్లాడటంతో... వీల్‌చైర్‌లో వేగంగా కేజీహెచ్‌లోని క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. అక్కడ నిందితుడికి ఆరోగ్య పరీక్షల అనంతరం వైద్యం చేయాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు స్పష్టంగా చెప్పడంతో నిందితుడిని నయానో భయానో బుజ్జగించేందుకు కాస్త సమయం అవసరం కావడంతో.. ఆసుపత్రి ప్రాంగణంలో పలుమార్లు అటుఇటూ తిప్పారు. అవసరం లేకపోయినా స్కానింగ్‌కు తరలించారు. తమ స్క్రిప్టు మేరకు ‘నేను జగన్‌ అభిమానిని....’అంటూ ఆ నాలుగు వాక్యాలు చెప్పాలని నిందితుడిని హెచ్చరించారు. దాదాపు గంటన్నర తర్వాత నిందితుడిని ఆసుపత్రి నుంచి బయటకు తెచ్చి.. మీడియాతో ఆ నాలుగు వాక్యాలు చెప్పించే యత్నం చేశారు. అయితే నిందితుడు ఈసారి కూడా ఆ నాలుగు వాక్యాలతో పాటు తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.  
 
కడతేర్చి.. కేసు మూసివేసే ఎత్తు 
రాజకీయ పరిశీలకులు, వైఎస్సార్‌ సీపీ నేతలు, ప్రజలు అందరూ భావించినట్లుగానే కరుడుగట్టిన ప్రొఫెషనల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌ను అంతం చేసి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును నీరుగార్చడానికి ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు. నిందితుడు తనకు ప్రాణహాని ఉందని.. తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడానికి కారణమదేననే అభిప్రాయం పోలీసు వర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది.

శ్రీనివాస్‌ను చంపేస్తే.. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసులో తమ పాత్ర వెలుగులోకి రాదని సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవాలంటే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగింది. 

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు విచారణను నీరుగార్చడానికి ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నిందితుడు టీడీపీ కార్యకర్త శ్రీనివాస్‌ను వైఎస్సార్‌ సీపీ కార్యకర్తగా చిత్రీకరించడానికి పడరాని పాట్లు.. ‘ఫ్లెక్సీ’విన్యాసాలు చేశారు. అది చాలదన్నట్లు 11 పేజీల లేఖను తెరపైకి తెచ్చారు. సినీ నటుడు శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్‌ గరుడలో భాగంగా కేంద్రమే ఇదంతా చేసిందని.. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈ కుట్ర చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ల విధించిన పరిమితుల మేరకు.. పాత్రధారులకే విచారణను పరిమితం చేశారు. దీంతో ప్రతిపక్ష నేతను హత్య చేయడానికి పురిగొల్పిన సూత్రధారుల వైపు పోలీసులు దష్టి సారించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా మారినా తమ పాత్ర బయటపడకుండా ఉండాలంటే కేసును మూసివేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్‌ను మట్టుబెట్టడానికి పక్కా స్కెచ్‌ వేసినట్లుగా విశ్లేషిస్తున్నారు. నిందితుడ్ని భయపెట్టడం కోసం థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్లు సమాచారం. తొలుత తనకు రాచమర్యాదలు చేసిన పోలీసులే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో శ్రీనివాస్‌ హడలిపోయాడు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘నాకు ప్రాణహాని ఉంది.. నన్ను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారు’అంటూ తాజాగా అతడు ఆందోళన వ్యక్తం చేశారని చెబుతున్నారు. (ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు..)

అవే జవాబులు! 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడిని మూడు రోజులుగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు, నలుగురు డీఎస్పీలు విచారిస్తున్నా దర్యాప్తులో ఏమాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ‘సిట్‌’విచారణలో నిందితుడు అవే సమాధానాలు చెబుతుండటంతో కేసును నీరుగార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిజమేననే వాదనకు బలం చేకూరుతోంది. (ఆ రోజే ఎందుకు?)
 
నీరసమే.. ఆరోగ్య సమస్యలు లేవన్న వైద్యుడు 
జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌ కేంద్రంగా విచారణ కొనసాగిస్తోంది. ఆరు రోజుల కస్టడీ కోసం తీసుకున్న నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును విశాఖ సీపీ మహేష్‌ చంద్ర లడ్డా, సిట్‌ ప్రత్యేకాధికారి ఫకీరప్ప, డీసీపీ–2 నయీమ్, సిట్‌ అధికారి బీవీఎస్‌ నాగేశ్వరరావు వరుసగా మూడో రోజు కూడా విచారించారు. కోర్టు నిబంధనల మేరకు 48 గంటలకోసారి కస్టడీకి తీసుకున్న నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున తొలుత ప్రైవేట్‌ వైద్యుడు డాక్టర్‌ దేవుడుబాబును రప్పించి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.

బీపీ 120/74, పల్స్‌ రేట్‌ 82 ఉందని, కాస్త నీరసంగా ఉన్నాడే తప్ప ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని వైద్యుడు మీడియాకు తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు గుండెదడగా ఉందని చెప్పాడని, కేజీహెచ్‌కు తరలించడం మంచిదని సూచించానని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్యుడి సూచన మేరకు మధ్యాహ్నం 3.43 గంటల సమయంలో నిందితుడిని కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలనంతరం రాత్రి ఆరున్నర గంటల సమయంలో తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఘటన జరిగిన రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కాఫీ సర్వ్‌ చేసిన రమాదేవి, లేఖ రాసినట్టుగా చెబుతున్న స్నేహితుడు రేవతి ప్రసాద్, సోదరి విజయదుర్గలను కూడా స్టేషన్‌లోనే ఉంచి వివరాలు సేకరిస్తున్నారు.  (కుట్ర ప్రకారమే నాపై హత్యాయత్నం)
  
ఎయిర్‌పోర్టు అధికారులను విచారించిన సిట్‌ 
ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.ప్రకాష్‌రెడ్డి, సీఎస్‌వో వేణుగోపాల్‌ను సిట్‌ బృందం మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల పాటు విచారించింది. ప్రతి గురువారం జగన్‌ కోసం కాఫీ, టీలు బయట నుంచి వచ్చేవట కదా? ఎందుకు నిలిపివేశారు? లోపలకు పంపేందుకు అనుమతి ఉందా? ఒకవేళ లేకుంటే ఇన్నాళ్లు ఎందుకు అనుమతించారు? ఇప్పుడెందుకు అడ్డుకున్నారు? ఎవరి నుంచైనా ఒత్తిళ్లు వచ్చాయా? ఎవరైనా ఆపమన్నారా? హర్షవర్ధన్‌తో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? నిందితుడ్ని ఎప్పుడైనా చూశారా? మాట్లాడారా? విధుల్లో చేరిన కొత్తలోనే ఎయిర్‌పోర్టులోకి కత్తులు తీసుకెళ్లాడట కదా? మీ దృషికి ఎందుకు రాలేదు? ఇలా పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారని తెలిసింది. (అభిమానులు ప్రాణాలు తీస్తారా?)
 
హర్షవర్ధన్‌ కాల్‌డేటా విశ్లేషణ 
నిందితుడు శ్రీనివాసరావు, అతడి సహచర సిబ్బందితో పాటు ఫ్యూజన్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ అధినేత, టీడీపీ కీలక నేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి కాల్‌డేటాను కూడా సిట్‌ విశ్లేషిస్తోంది. హర్షవర్ధన్‌ ఆర్ధిక లావాదేవీలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే శ్రీనివాసరావుకు చెందిన మూడు బ్యాంకుఖాతాల వివరాలను పరిశీలించిన సిట్‌ అధికారులు, హర్షవర్ధన్‌ ఆర్థికలావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. 
 
పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు 
సిట్‌ దర్యాప్తు కోసం 8 బృందాలు పనిచేస్తున్నాయి. వీటిలో మూడు బృందాలు శ్రీనివాసరావు కాల్‌ డేటా ఆధారంగా విచారణ జరిపేందుకు గుంటూరు, హైదరాబాద్, మధ్యప్రదేశ్‌ వెళ్లినట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. నిందితుడి నుంచి నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సెల్‌ఫోన్లు గ్వాలియర్, గుంటూరులో ఉన్నట్టు తెలియడంతో రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. 
 
జగన్‌ ధరించిన చొక్కా కోసం కోర్టులో పిటిషన్‌ 
హత్యాయత్నం ఘటన జరిగిన సమయంలో వైఎస్‌ జగన్‌ ధరించిన చొక్కాను తమకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ‘సిట్‌’విశాఖ మూడో మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సెలవులో ఉన్నందున ఈ కేసును బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలకు సీఆర్‌పీసీ 160 ప్రకారం నోటీసులు జారీ చేసినప్పటికీ వాంగ్మూలం ఇవ్వలేదని, వారి నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు నిందితుడి జేబులో లభ్యమైందని చెబుతున్న 11 పేజీల లేఖను పరీక్షించేందుకు వీలుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ మరో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో న్యాయమూర్తి దీన్ని తిరస్కరించారు.
(వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement