
'వంద నోటీసులు ఇచ్చినా పట్టించుకోం'
హైదరాబాద్లో తాము పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
హైదరాబాద్: హైదరాబాద్లో తాము పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. హైదరాబాద్లో 45 బెటాలియన్లను ఏపీ పోలీసులను ఉంచామని, తమ పోలీసులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం చేస్తూ, తమపైనే తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తమ పోలీసులును తామే ఉపయోగించుకుంటామని, హైదరాబాద్ తమ పరిపాలనను తామే సాగిస్తామని చెప్పారు. హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో ఒకటి కాదు వంద నోటీసులు ఇచ్చినా పట్టించుకోమని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను టాపింగ్ చేయించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఫోన్ టాపింగ్ చేయించకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లిఖిల పూర్వకంగా వివరణ ఇవ్వాలన్ని తన చాలెంజ్ను స్వీకరించలేదని అన్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయకుముందు ఈసీకి తెలియజేశామని తెలంగాణ ఏసీబీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే ఈసీకి తెలియజేసిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అప్రతిష్టపాలుజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని చెప్పారు.