ఠమధిర, న్యూస్‌లైన్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిప్రేమ ఒకరిది... ఆరేళ్లపాటు ఆలనాపాలనాచూసి పెంచిన ప్రేమ మరొకరిది. ఇరువురు తల్లులు ఆబిడ్డ తమకే కావాలంటూ వివాదానికి దిగి పోలీసులను ఆశ్రయించారు. మధిరలో శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.... మధిర పట్టణానికి చెందిన పరిగంజి నాగరాజు, అమ్మణ్ణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, మూడోసారి కుమారుడు పుడతాడనే ఆశతో ఉండగా ఆకాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. పెంచే స్తోమతలేక 20రోజుల పసికందుగా ఉన్న మూడో అమ్మాయిని తమ బంధువులైన మడుపల్లి గ్రామానికిచెందిన ఏసుపోగు బాబు, దానమ్మ దంపతులకు 2007, డిసెంబర్ 7న గ్రామస్తుల సమక్షం లో అనధికారికంగా దత్తత ఇచ్చారు.
ఈ సంతోషంలో బాబు దంపతులు నాగరాజు దంపతులకు రూ.5వేలు బహుమతిగా అందజేశారు. ఆరు సంవత్సరాలనుంచి ఎటువంటి వివాదం లేకుండా ఇరుకుటుంబాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పెంచిన తల్లిదండ్రులు పాప పేరుతో రూ.20వేలు బ్యాంకులో డిపాజిట్‌చేశారు. ఆ పాపకు యశోద అని పేరు పెట్టుకుని గత ఆరుసంవత్సరాలుగా ఆలనాపాలనాచూస్తూ ప్రేమానురాగాలు పెంచుకున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా కన్న తల్లిదండ్రులు శనివారం ఆ గ్రామానికి వె ళ్లి తమకుమార్తెను తమకే ఇవ్వాలని బలవంతంగా తీసుకుని వెళ్లారు. ఇన్ని సంవత్సరాలు యశోదను పెంచిన బాబుదంపతులు ఈ పరిణామంతో కలతచెంది స్థానిక పెద్దలను ఆశ్రయించారు. అయితే పెద్ద మనుషులు సైతం ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో వారు టౌన్‌పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ ఎస్. మల్లారెడ్డి ఇరుకుటుంబాల వాదనను విని దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు ఉండాలన్నారు. అవి లేనందున కన్న తల్లిదండ్రులకే యశోదను అప్పగించాలని పెంచిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ద్వారా చెప్పి ఆపాపను ఇప్పించారు. ఈ క్రమంలో కన్నతల్లిదండ్రులు ఆపాపను తీసుకువెళుతుండటంతో బాబుదంపతులు బోరున విలపించారు. పాప సైతం కన్నతల్లిదండ్రుల వద్దనుంచి విడిపించుకుని, పెనుగులాడుతూ పెంచిన తల్లివద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి రోదించిన తీరు పలువురి హృదయాలను ద్రవింపచేసింది. అమ్మా... అమ్మా...అంటూ ఆ చిన్నారి విలపిస్తుండటం తో సమీపంలో ఉన్న పోలీసులు, పట్టణ ప్రజలు సైతం కంటతడి పెట్టారు.
యశోద... ఇద్దరు తల్లులు!
Published Sun, Dec 15 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement