పూలు రోడ్డు మీద దొరుకుతాయి. కాని వాటిని స్విగ్గీలో తెప్పించుకునే కస్టమర్లు కూడా ఉంటారు అని గ్రహించారు యశోద, రియా కారుటూరి.ఈ ఇద్దరూ కలిసి ‘వూహూ ఫ్రెష్’ పేరుతోమొదలెట్టిన బ్రాండ్ ఇంతింతై ఇంతి ఇంతై అన్నట్టు సాగుతోంది. తాజాగా వీరు అగరు బత్తీల రంగంలో అడుగు పెట్టారు. బంతి, నిమ్మ, మందారం... వీరి అగర్‌బత్తీల పేర్లు.పూలతో 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరి ఆలోచనలు...
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా రావడమే సగం విజయం. మిగిలింది ఆచరణ మాత్రమే. ఐడియాలు అందరికీ ఎందుకు రావు? ఎవరో అన్నట్టు బుర్ర పారాచూట్ లాంటిది. తెరిచి పెడితే పని చేస్తుంది. లేదంటే ఏం ఉపయోగం. బెంగళూరులో నివాసం ఉండే ఇద్దరు అక్కచెల్లెళ్లు 2019లో తల్లి తరచూ చేసే ఫిర్యాదును వినేవారు. ‘బెంగళూరులో ఉన్నామన్న మాటేగాని పూజ చేద్దామంటే తాజా పూలే దొరకవు’ అని. ఆ అక్కచెల్లెళ్ల పేర్లు యశోద కారుటూరి, రియా కారుటూరి. యశోద వాషింగ్టన్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివితే రియా స్టాన్‌ఫోర్డ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివింది. అంటే వీళ్లకు టెక్నాలజీ తెలుసు. బిజినెస్ తెలుసు. ఐడియా వెలగకుండా ఉంటుందా?
పూలు తెలుసు
రియ, యశోదల తండ్రి వాళ్ల బాల్యంలో కెన్యా వెళ్లి గులాబీ పంట వేసి పండించేవాడు. ఒకప్పుడు కెన్యా గులాబీలకు పెద్ద మార్కెట్ ఉండేది. ఆ తర్వాత ΄ోయింది. చిన్నప్పడు ఆ తోటల్లో తిరిగిన రియ, యశోదలు అందరూ ఏవేవో వ్యాపారాలు చేస్తారు... మనం పూలతో ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆలోచన వస్తే వెంటనే పని మొదలెట్టాలి. 2019 పూలకు ప్రాధాన్యం ఉండే ప్రేమికుల దినోత్సవం నాడు ‘వూహూ ఫ్రెష్’ అనే ఆన్‌లైన్ రిటైల్ బ్రాండ్ మొదలెట్టారు. ‘వూహూ’ అంటే కన్నడలో పువ్వు. తాజాపూలను కస్టమర్లకు అందించడమే లక్ష్యం.
ఇంటికి చేరాలి
భారతీయలకు భక్తి జాస్తి. పూలతోనే దైవారాధన చేస్తారు. కాని గుడికి పూలు తీసుకెళ్లాలంటే గుడి చుట్టూ ఉన్న అంగళ్లలో కొనాలి. లేదా రోడ్డు మీద కొనాలి. అవి ఫ్రెష్‌గా ఉండొచ్చు... లేక΄ోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు శుభకార్యాలకు, అలంకరణలకు, స్త్రీలు జడల్లో ముడుచుకోవడానికి, సన్మానాలకు.. సంస్మరణలకు... ఇళ్లల్లో పెద్దల పటాలకు పూలే కావాలి. కాని ఆ పూలుపాల ΄్యాకెట్టు అందినట్టు న్యూస్‌పేపర్ అందినట్టు ఇంటికి ఎందుకు అందవు అనుకున్నారు అక్కచెల్లెళ్లు. అందేలా చేశారు. విజయం సాధించారు.
చందాదారులుగా...
న్యూస్‌పేపర్ చందాదారుల్లానే ‘వూహూ ఫ్రెష్’కు కూడా చందాదారులుగా చేరితే రోజంతా పూలు ఇంటికే వస్తాయి. మరి ఇవి ఫ్రెష్‌గా ఎలా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకమైన ΄్యాకింగ్ తయారు చేశారు. 3 రోజుల నుంచి 15 రోజుల వరకూ వాడకుండా ఉంటాయి. చేయి తగిలితే పూలు నలిగి΄ోతాయి కదా. అందుకే ‘జీరో టచ్’ ΄్యాకింగ్ కూడా ఉంది. డబ్బాల్లో పెట్టి పంపుతారు. స్విగ్గి, జొమాటో, అమేజాన్ ద్వారా కూడా అందే ఏర్పాటు చేశారు. పండగల్లో పబ్బాల్లో ఆ పండగలకు తగ్గ పూలు, హారాలు, పత్రి, దళాలు కలిపిన ప్రత్యేక బాక్సులు అమ్ముతారు. అవి హాట్‌కేకుల్లా అమ్ముడు΄ోతున్నాయి.
రైతులతో కలిసి
బెంగళూరులో కేంద్రస్థానంగా ఉంటూ ఇతర ముఖ్య నగరాల్లో విస్తరించుకుంటూ పూల సరఫరా చైన్లను రియా, యశోదలు స్థాపించారు. 500 మంది పూల రైతులతో ఒడంబడిక చేసుకుని కోసిన పూలను వీలైనంత త్వరగా ΄్యాకింగ్ కేంద్రానికి పంపే ఏర్పాటు చేశారు. ఆర్డర్లకు తగ్గ ΄్యాకింగ్ కోసం మహిళా ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం 300 ఆలయాలలో దేవుళ్లు రోజూ వీరు పంపే పూలతోనే పూజలు, హారతులు అందుకుంటున్నారు.
2023 షార్క్ ట్యాంక్ షోలో రియా, యశోదాల బిజినెస్ గురించి విని అందరూ ఆశ్చర్య΄ోయారు. సంవత్సరానికి దాదాపు 8 నుంచి 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీరి బ్రాండ్ విలువ 50 కోట్లకు చేరింది. వాడి΄ోయిన పూలతో అగర్ బత్తీలు తయారు చేస్తూ ఆ రంగంలోనూ విజయం సాధించారు ఈ బెంగళూరు స్టిస్టర్స్. ఐడియా వీరిని గెలిపిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment