హీరోయిన్ నీతూ అగర్వాల్ కు రిమాండ్
- రుద్రవరం ఎర్ర చందనం పట్టుబడిన కేసులో నిందితురాలు
- కోవెలకుంట్ల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
కోవెలకుంట్ల: ప్రేమ ప్రయాణం సినిమా హీరోయిన్ నీతూ అగర్వాల్‌కు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి, ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ జడ్జి సోమశేఖర్ తీర్పునిచ్చారని సీఐ నాగరాజుయాదవ్ తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలోని వాగులో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన 46 టన్నుల ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా ఏస్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో బాలునాయక్, శంకర్‌నాయక్, తిరుపాల్‌నాయక్, నరసింహనాయక్‌తో సహా పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాలునాయక్‌కు ఖాతానుంచి సినీ హిరోయిన్ నీతూ అగర్వాల్ ఖాతాకు రూ. 1.20 లక్షలు జమ అయినట్లు తేలడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆమెను నిందితురాలును చేస్తూ ఆదివారం కర్నూలు శివారులో అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ న్యాయమూర్తి సోమశేఖర్ ముందు హాజరు పరుచగా వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. కాగా సినీ హీరోయిన్ కోవెలకుంట్ల కోర్టుకు వస్తున్నట్లు తెలియడంతో పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. సీఐతోపాటు కోవెలకుంట్ల, సంజామల ఎస్‌ఐలు మంజునాథ్, మధుసూదన్, విజయభాస్కర్, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.