Neetu Agarwal
-
నాకెలాంటి సంబంధం లేదు: నటి నీతూ అగర్వాల్
కర్నూలు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి నీతూ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె గురువారం కర్నూలులో మీడియాతో మాట్లాడారు. మస్తాన్ వలీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాడోపేడో తేల్చుకుంటానని నీతూ అగర్వాల్ అన్నారు. మస్తాన్ వలీ ఓ రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ఆమె తెలిపారు. అంతకు మించి అతడి గురించి తనకేమీ తెలియదన్నారు. ఇద్దరం కలసి ప్రేమ ప్రయాణం చిత్రంలో కలిసి నటించామని... ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకున్నామని వెల్లడించారు. అయితే అతడి ఎక్కడి నుంచి వచ్చాడు... సినీ రంగానికి ఎలా వచ్చాడు... అనే అంశాలపై మస్తాన్ వలీని తాను ఏ రోజు ప్రశ్నించలేదన్నారు. ఏటీఎమ్ కార్డు కావాలని ఓ భర్తగా మస్తాన్ అడిగాడని.. భార్యగా తాను ఇచ్చానని ఆమె చెప్పారు. తన ఏటీఎం కార్డును మస్తాన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని... భవిష్యత్తులో తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయని నీతూ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నీతూ అగర్వాల్‌కు బెయిల్
కోవెలకుంట్ల (కర్నూలు జిల్లా): సినీ నటి నీతూ అగర్వాల్‌కు మంగళవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలనే షరతుతో జడ్జి బెయిల్ మంజూరు చేశారు. రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలోని వాగులో ఈ ఏడాది ఫిబ్రవరి 10న 46 టన్నుల ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా ఏసీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బాలునాయక్, శంకర్‌నాయక్, తిరుపాల్‌నాయక్, నరసింహనాయక్ సహా మరి కొందరిపై రుద్రవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ నటి నీతూ అగర్వాల్ బ్యాంకు ఖాతా నుంచి బాలునాయక్ బ్యాంకు ఖాతాకు రూ.1.05 లక్షలు జమ అయినట్లు తేలడంతో నీతూను ఈ కేసులో పదవ నిందితురాలిగా చేర్చారు. గత నెల 26న కర్నూలు శివారులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం నీతూ అగర్వాల్ కోర్టును ఆశ్రయించడంతో జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, నీతూ అగర్వాల్ ప్రస్తుతం నంద్యాల సబ్ జైలులో ఉంది. బెయిల్ మంజూరు ఉత్వర్వులను సాయంత్రం 5 గంటల్లోపు సబ్‌జైలులో అందజేయాల్సి ఉంది. అయితే, ఆ సమయం మించి పోవడంతో బుధవారం ఆమెను విడుదల చేయనున్నారు. -
పోలీస్ కస్టడీకి నీతూ అగర్వాల్
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): ఎర్రచందనం అక్రమ రవాణా లావాదేవీల కేసులో నిందితురాలిగా ఉన్న సినీ హీరోయిన్ నీతూ అగర్వాల్‌ను రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలో 46 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎర్రచందనం వ్యాపారి బాలునాయక్ బ్యాంకు ఖాతాకు నీతూ అగర్వాల్ నుంచి రూ. 1.05 లక్షలు బదలాయింపు జరిగినట్లు విచారణలో తేలడంతో ఆమెను పదో నిందితురాలిగా చేర్చారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి, ఆళ్లగడ్డ ఇంచార్జ్ జడ్జి సోమశేఖర్ ముందు హాజరు పరుచగా వచ్చే నెల 7వ వరకు రిమాండ్‌కు ఆదేశించడంతో నంద్యాల సబ్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రుద్రవరం పోలీసులు నీతూ అగర్వాల్‌ను పోలీస్‌కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టుకు అప్పీలు చేశారు. దీంతో ఆళ్లగడ్డ ఇన్చార్జ్ జడ్జి సోమశేఖర్ ఆమెను మంగళవారం నుంచి రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించినట్లు కోవెలకుంట్ల పోలీసులు పేర్కొన్నారు. -
హీరోయిన్ నీతూ అగర్వాల్ కు రిమాండ్
- రుద్రవరం ఎర్ర చందనం పట్టుబడిన కేసులో నిందితురాలు - కోవెలకుంట్ల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు కోవెలకుంట్ల: ప్రేమ ప్రయాణం సినిమా హీరోయిన్ నీతూ అగర్వాల్‌కు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి, ఆళ్లగడ్డ ఇన్చార్జ్ జడ్జి సోమశేఖర్ తీర్పునిచ్చారని సీఐ నాగరాజుయాదవ్ తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలోని వాగులో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన 46 టన్నుల ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా ఏస్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలునాయక్, శంకర్‌నాయక్, తిరుపాల్‌నాయక్, నరసింహనాయక్‌తో సహా పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాలునాయక్‌కు ఖాతానుంచి సినీ హిరోయిన్ నీతూ అగర్వాల్ ఖాతాకు రూ. 1.20 లక్షలు జమ అయినట్లు తేలడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆమెను నిందితురాలును చేస్తూ ఆదివారం కర్నూలు శివారులో అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ ఇన్చార్జ్ న్యాయమూర్తి సోమశేఖర్ ముందు హాజరు పరుచగా వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. కాగా సినీ హీరోయిన్ కోవెలకుంట్ల కోర్టుకు వస్తున్నట్లు తెలియడంతో పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. సీఐతోపాటు కోవెలకుంట్ల, సంజామల ఎస్ఐలు మంజునాథ్, మధుసూదన్, విజయభాస్కర్, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సినీ నటి అరెస్టు
కర్నూలు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తప్పించుకు తిరుగుతున్న సినీ నటి నీతూ అగర్వాల్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీతో నీతూ అగర్వాల్ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతూ అగర్వాల్ ఖాతాల నుంచి నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన సీసీఎస్ పోలీసులు ఆమెను కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రేపు కోర్టుకు హాజరు పరుస్తారని సమాచారం. కాగా అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
వర్ధమాన హీరోయిన్ కోసం పోలీసుల వేట
కర్నూలు: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో టాలీవుడ్ వర్ధమాన హీరోయిన్ నీతూ అగర్వాల్ పేరు నమోదైంది. నీతూ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. గతవారం నీతూ బాయ్‌ఫ్రెండ్ మస్తాన్ వలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో గురువారం నీతూపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ రవి కృష్ణ వెల్లడించారు. నీతూను అరెస్ట్ చేసేందుకు సీఐ శ్రీనివాసులు సారథ్యంలోని పోలీసులు బృందం గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. పోలీసుల నీతూ నివాసానికి వెళ్లగా ఇంటికి తాళం వేసిఉంది. పోలీసులు నీతూ కోసం గాలిస్తున్నారు. నీతూ 'ప్రేమ ప్రయాణం' అనే సినిమాలో నటించింది. -
శీనుగాడి మనసులో శిరీష
మనోజ్ నందం కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రేమప్రయాణం’. ‘శీనుగాడి మనసులో శిరీష’ అనేది ఉపశీర్షిక. నీతూ అగర్వాల్ కథానాయిక. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు. కె.మస్తాన్‌వలి నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ఈ నెల 6న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ హైలైట్‌గా నిలుస్తుంది. ఎలేందర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది’’ అని తెలిపారు. అమ్మాయి ప్రేమలో పడి కన్నతల్లికి, సొంత ఊరుకి దూరమైన ఓ బీటెక్ కుర్రాడి కథ ఇదని, చివరకు తన తల్లిని ఏలా చేరుకున్నాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు చెప్పారు.