పోలీస్ కస్టడీకి నీతూ అగర్వాల్
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): ఎర్రచందనం అక్రమ రవాణా లావాదేవీల కేసులో నిందితురాలిగా ఉన్న సినీ హీరోయిన్ నీతూ అగర్వాల్‌ను రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలో 46 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎర్రచందనం వ్యాపారి బాలునాయక్ బ్యాంకు ఖాతాకు నీతూ అగర్వాల్ నుంచి రూ. 1.05 లక్షలు బదలాయింపు జరిగినట్లు విచారణలో తేలడంతో ఆమెను పదో నిందితురాలిగా చేర్చారు.
ఈ మేరకు ఈ నెల 26వ తేదీన ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి, ఆళ్లగడ్డ ఇంచార్జ్ జడ్జి సోమశేఖర్ ముందు హాజరు పరుచగా వచ్చే నెల 7వ వరకు రిమాండ్‌కు ఆదేశించడంతో నంద్యాల సబ్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రుద్రవరం పోలీసులు నీతూ అగర్వాల్‌ను పోలీస్‌కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టుకు అప్పీలు చేశారు. దీంతో ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ జడ్జి సోమశేఖర్ ఆమెను మంగళవారం నుంచి రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించినట్లు కోవెలకుంట్ల పోలీసులు పేర్కొన్నారు.