చట్టంతో కొట్టండి | Acts Foe Woman And Their Sollutions | Sakshi
Sakshi News home page

చట్టంతో కొట్టండి

Published Mon, Jun 4 2018 1:17 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Acts Foe Woman And Their Sollutions - Sakshi

రేపల్లె ప్రాంతంలోని ఎనిమిదో తరగతి బాలిక రోజూ ఇంటి సమీపంలోని వరుసకు బాబాయి అయిన వ్యక్తి వద్ద సాయంత్రం కబుర్లు చెపుతూ కూర్చొంటుంది. కొద్ది రోజుల తర్వాత కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళితే గర్భిణిగా నిర్ధారించారు. బాలికను అడిగితే బాబాయి అనే మానవ మృగం చేసిన పని కారణంగానే గర్భిణి అయినట్లు తేలింది. బయటకు తెలిస్తే పరువుపోతుందని తల్లిదండ్రులు బాలికకు గర్భస్రావం చేయించారు. పాఠశాలలోఅవగాహన కార్యక్రమానికి వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు బాలిక    చెప్పిన అమానుషం ఇది.

ఇటీవల తెనాలిలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న మృగాడు ఆమె కూతురుపై కన్నేశాడు. మహిళకు నిద్రమాత్రలు వేసి.. బాలికపై మానవ మృగం లా వ్యవహరించాడు. కడుపు నొప్పితో బాధ పడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయిస్తే గర్భిణిగా తేలింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికకు అవగాహనలేని కారణంగా ఏం జరుగుతుందనే విషయం కూడా తెలుసుకోలేకపోయింది.

గుంటూరు: మన ఇంటికి వచ్చే బంధువులు, సన్నిహితుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. లేకుంటే అభం శుభం తెలియని పసిమొగ్గలను చిదిమేసి వారి భవిష్యత్‌పై మాయనిమచ్చ వేసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో బాధిత బాలికలు మగవారిపై చిన్న వయసులోనే సదభిప్రాయాన్ని కోల్పోతారని మానసిక వైద్యులు చెబుతున్నారు. 

స్పర్శ ద్వారా గ్రహించేలా అవగాహన కల్పించాలి
ఇటీవల కాలంలో మైనర్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం పాఠ్యాంశాలతో సరిపెట్టకుండా టీనేజీ బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి అర్థమయ్యేలా వివరించాలని వైద్యులు చెబుతున్నారు. బాలికలపై తాకకూడని ప్రదేశాల్లో ఎవరైనా చేతులు వేస్తే సమీపంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంగానీ, పెద్దగా కేకలు వేయడంగానీ చేయాలి. 

తల్లిదండ్రుల పాత్ర కీలకం...
నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమయ్యాయి. తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ కారణంగా పిల్లలపై ప్రత్యేక దృష్టి నిలపలేకపోతున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. మంచిచెడుల గురించి చెప్పాలి. పిల్లలతో కలసి ఒకే గదిలో నిద్రించే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.  మహిళలు వేధింపులకు గురైతే రక్షణ పొందేందుకు చట్టాలు ఉన్నాయి.  

చట్టంలోని సెక్షన్లు ఇలా...
పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసులు నమోదైతే కనీసం ఏడేళ్ల జైలు, –  జరిమానా విధించే అవకాశం ఉంది.
సెక్షన్‌–100 ప్రకారం ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే తప్పు లేదు.
సెక్షన్‌ 294 ప్రకారం అసభ్యకరంగా ప్రవర్తిస్తే కనీసం మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.
సెక్షన్‌ 354(బీ) ప్రకారం మహిళల దుస్తులను బలవంతంగా తొలగిస్తే మూడు నుంచి ఐదేళ్ల శిక్ష పడుతుంది.
సెక్షన్‌(సీ) ప్రకారం మహిళలు, విద్యార్థినుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే మూడేళ్ల శిక్ష పడుతుంది.
సెక్షన్‌ 354(డీ) ప్రకారం ఉద్దేశపూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, పని చేసే ప్రాంతంలో యజమాని వేధింపులకు గురి చేసినా మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
సెక్షన్‌ 494 ప్రకారం భార్య ఉండగా మరొకరిని వివాహం చేసుకుంటే జైలు శిక్షపడుతుంది.
సెక్షన్‌ 498(ఏ) ప్రకారం వివాహితను హింసిస్తే కనీసం మూడేళ్లు శిక్షతోపాటు జరిమానా ఉంటుంది.  
సెక్షన్‌ 499 ప్రకారం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఇంటర్‌నెట్‌లో పెడితే శిక్ష విధిస్తారు.
సెక్షన్‌ 509 ప్రకారం మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా జైలు శిక్ష ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement