హమ్మయ్యా..ఇదే ఫైనల్ లిస్ట్
- ఐదు విడతలుగా టీడీపీ అభ్యర్థుల ప్రకటన
- నామినేషన్ల ముందు రోజు వరకు కొనసాగిన వేట
- ఆరు చోట్ల కాంగ్రెస్ వలసనేతలకు, ఒకచోట బీజేపీకి అవకాశం
సాక్షి, తిరుపతి : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు శనివారం చివరి రోజు. కాగా, ముందురోజు శుక్రవారం వరకు టీడీపీ నాన్చినాన్చి ఐదు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల తొమ్మిదో తేదీ అధినేత చంద్రబాబు సహా నలుగురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల అయింది. మిగిలిన అభ్యర్థులను ప్రకటించేందుకు దాదాపు మరో పది రోజులు పట్టింది. మొత్తం ఐదు విడతలుగా జాబితాలను విడుదల చేసింది. శుక్రవారం విడుదల చేసిన జాబితాలో పీలేరు, సత్యవేడు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లకు కాబ్లీ ఇక్బాల్ అహ్మద్, తలారి ఆదిత్య, ఎం వెంకటరమణ పేర్లు ఉన్నాయి.
తొలి, తుది జాబితాలకు మధ్య పది రోజులు గడువు తీసుకున్నప్పటికీ ఆ పార్టీ కొత్తగా సాధించింది ఏమీలేదు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలు, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లను బీజేపీకి కేటాయించారు.
సగం స్థానాలకు వలస అభ్యర్థులే
జిల్లాలోని 14 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిశీలిస్తే సగం స్థానాలు టీడీపీయేతరులకు కట్టబెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత వారి రాజకీయ ప్రయోజనాల కోసం వలస వచ్చిన వారికి టీడీపీ పెద్దపీట వేసింది. ఆరు స్థానాలు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి కేటాయించగా, పొత్తుల్లో భాగంగా మదనపల్లె స్థానాన్ని బీజేపీకి వదిలిపెట్టారు.
దీన్నిబట్టి టీడీపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం మొత్తం ఒక ప్రహసనంగా సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉంటున్న చంద్రబాబు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, లలితా థామస్ పోటీచేసే స్థానాలు మినహాయిస్తే ఇతర నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను వెతుకులాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టమయ్యింది.
చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, తంబళ్లపల్లె, గంగాధరనెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ జంప్ జిలానీలకు టీడీపీ టికెట్లు ఇచ్చింది. మరో నాలుగు నియోజకవర్గాల నుంచి కొత్త అభ్యర్థులను బరిలోకి దింపింది. పీలేరు, చిత్తూరు, సత్యవేడు, పలమనేరు నుంచి ఇక్బాల్, సత్యప్రభ, ఆదిత్య, సుబాష్ చంద్రబోస్‌కు తొలిసారిగా శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించింది.
ఉత్కంఠ రేపిన తిరుపతి, సత్యవేడు
తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషం వరకు ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎం వెంకటరమణ, చదలవాడ కృష్ణమూర్తి టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎం వెంకటరమణను టికెట్ వరించింది. నాలుగైదు రోజుల కిందటనే ఈయనకు టికెట్టు ఖాయమైనా చివరి నిమిషం వరకు ప్రకటించలేదు. టికెట్టు తనకే వస్తుందని ధీమాతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందునుంచి పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న చదలవాడకు మొండిచెయ్యి చూపారు.
టికెట్టుపై ఆశతో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఊకా విజయకుమార్ తదితరులు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. వారి ఆశ కూడా నీరుగారింది. సత్యవేడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ పేరు కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చింది. నారా లోకేష్‌కు సన్నిహితుడైన రాజేష్‌కృష్ణ పేరు రెండు రోజులుగా వినిపించింది. మధ్యలో తిరుపతికి చెందిన ఒక డయూగ్నిస్టిక్ సెంటర్ అధినేత పేరు తెరపైకి వచ్చింది.
ఆయన గురువారం నామినేషన్ కూడా వేశారు. అయితే తుదివిడత అభ్యర్థుల జాబితాలో తలారి మనోహర్ కుమారుడు ఆదిత్య పేరు ఉండటంతో టీడీపీ వర్గాలు అవాక్కయ్యాయి. ఆదిత్య యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎమ్మెస్సీ, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్ పూర్తి చేశారు. 2009 ఎన్నికల్లో తండ్రి మనోహర్ చిత్తూరు లోక్‌సభ స్థానానికి ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పనిచేశారు. ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.