అదనపు రాజకీయం | Additional political | Sakshi
Sakshi News home page

అదనపు రాజకీయం

Published Sat, Jul 19 2014 2:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

అదనపు రాజకీయం - Sakshi

అదనపు రాజకీయం

అనంతపురం ఎడ్యుకేషన్ : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా.. పోకిరీ సినిమాలో ఓ రేంజ్‌లో పేలిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఒంటబట్టించుకున్నట్లున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా పగ్గాలు చేపట్టడంతో అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతున్నారు. ఉన్నన్నాళ్లూ ఎంతో కొంత వెనకేసుకోవడానికి తహతహలాడుతున్నారు.
 
 ఇప్పటికే ఆదర్శ రైతులు, డీలర్లను తొలగించి తమ వారికి ‘ఉపాధి’ కల్పించిన నేతలు.. సర్వశిక్ష అభియాన్‌లో నిధులు పుష్కలంగా ఉన్నా స్వలాభం కోసం అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..  జిల్లా వ్యాప్తంగా 395 స్కూళ్లలో 531 గదులు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి ఏ క్షణాన కూలిపోతాయో తెలీని పరిస్థితి నెలకొనడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు దినదినగండంగా గడుపుతున్నారు. 15 మునిసిపల్ స్కూళ్లలో 42 గదులు, ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 30 గదులు, 326 మండల పరిషత్ పాఠశాలల్లో 341 గదులు, 47 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 118 గదులు శిథిలావస్థకు చేరాయి. వీటి స్థానాల్లో కొత్తవాటిని ప్రభుత్వం మంజూరు చేసింది. శిథిలావాస్థ గదులను కూల్చేసి కొత్త గదులను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఇందుకోసం సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక్కో గదికి రూరల్ ప్రాంతంలో రూ. 6.5 లక్షలు, అర్బన్ ప్రాంతంలో రూ.7.3 లక్షలు మంజూరు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా అధికారులపై ఒత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పనులు ప్రారంభానికి అధికారులే ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతుండడం విశేషం.  
 
 718 గదులకు గాను 58 ప్రారంభం
 జిల్లాకు 2014-15 విద్యా సంవత్సరానికి 718 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. వీటిలో 464 శిథిలావస్థకు చేరిన గదుల స్థానాల్లో కొత్తగా నిర్మించేందుకు, 245 అదనపు తరగతి గదులు, 9 అప్‌గ్రేడేషన్ పాఠశాలల్లో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. శిథిలావస్థకు చేరిన వాటిని కూల్చేసి అక్కడ నిర్మించడం అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
 జిల్లాలో కూడా గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా పనులు సాగడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో మంజూరైన 718 గదుల్లో ఇప్పటిదాకా కేవలం 58 నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అందులోనూ రాష్ర్ట ప్రభుత్వం ఏర్పడకముందే ప్రారంభమైన పనులే అధికం. రాయదుర్గం, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల మినహా ఇతర నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఒక్కపనీ ప్రారంభం కాలేదు.
 
 మేం చెప్పేదాకా పనులు ప్రారంభించొద్దు
 స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఆమోదం మేరకే నిర్మాణ పనులు అప్పగించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఎస్‌ఎంసీల పాత్ర నామమాత్రంగా తయారైంది. చాలా పాఠశాలల ఎస్‌ఎంసీల్లో తాము సభ్యులుగా ఉన్నామన్న సంగతి కూడా వారికి తెలీదు. స్థానికంగా ఉన్న చోటా నాయకులు సూచించిన వారి పేర్లను రాసేసి ఎస్‌ఎంసీతో ఆమోదముద్ర వేయిస్తారు. ఈ రకంగా దాదాపు ఏ ఒక్క పాఠశాలలోనూ ఎస్‌ఎంసీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అధికార పార్టీ నేతలు సూచించిన వారికే పనులు దక్కుతున్నాయి. అయితే పర్సెంటీజీలు కుదరక నాయకులు ఆమోదం తెలపడం లేదు. ప్రభుత్వ పరంగా వస్తున్న ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని కొందరు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా...‘మేం చెప్పేదాకా పనులు ప్రారంభించొద్దు. మీకేం అంత తొందర’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని ఉరవకొండ, కదిరిలోనూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అధికారులపై హల్‌చల్ చేస్తున్నారు. తాము చెప్పినవారికి కాకుండా వేరెవరికైనా పనులు అప్పగించారో.. మీ ఇష్టం అంటూ ఆయా నియోజకవర్గాల నేతలు అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు.  
 
 పిల్లల ప్రాణాలతో చెలగాటం
 అధికార పార్టీ నేతలు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి రాజకీయాల కోసం పిల్లలను బలిచేస్తారేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 2011 డిసెంబరు 13న పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లి ప్రాథమిక పాఠశాలలో గది పైకప్పు కూలి లోకేష్ అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు.
 
 2013 జూన్ 28న కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి పాఠశాల గది పైకప్పు పెచ్చులూడి సుమారు 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈనెల 11న అర్ధరాత్రి కంబదూరు మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల గది పైకప్పు కూలింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే వెంటనే శిథిలావస్థకు చేరుకున్న గదులను కూల్చేసి వాటి స్థానాల్లో నూతన గదులను నిర్మించాల్సి ఉందని అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.   
 
 నెలాఖరులోగా ప్రారంభిస్తాం
 చాలా స్కూళ్లలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. వాటిని కూలదోసి కొత్త గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే డీఈలతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో నెలాఖరులోగా అన్ని పనులూ ప్రారంభిస్తాం.
 - వెంకటస్వామి, ఎస్‌ఎస్‌ఏ ఈఈ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement