భాగస్వామ్య సమ్మిళితం
అట్టహాసంగా ప్రారంభం
తరలివచ్చిన పాలనా యంత్రాంగం
తొలిరోజు 32 ఒప్పందాలు
వేదికపై ఆశీనులైన అతిథులు
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం సీఐఐతో కలిసి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఆదివారం సాయంత్రం హార్బర్ పార్కు వద్ద ఏపీఐఐసీ స్థలంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులను ఆహ్వానిస్తూ విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి తొలి భాగస్వామ్య సదస్సు ఇది. ఈ సదస్సులో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, పీయూష్ గోయ ల్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీ, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్, ఫోర్బ్స్ మార్షల్ డెరైక్టర్ నౌషద్ ఫోర్బ్స్, జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి, సీఐఐ ప్రెసిడెంట్, టీఐఎల్ లిమిటెడ్ ఎండీ సుమిత్ మజుందార్, కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ కార్యదర్శి అమితాబ్‌కాంత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 41 దేశాల నుంచి 350 మంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మరో 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అధికారులు ముందుగా చెప్పినట్టు తొలిరోజు సదస్సుకు విదేశీ మంత్రులు హాజరు కాలేదు. ఆధునిక టెంట్లతో నాలుగు హాళ్లను ఏర్పాటు చేశారు.
మూడు రోజుల్లో ఎనిమిది ప్లీనరీ సెషన్లు నిర్వహిస్తున్నారు. సదస్సు జరిగే ప్రాంతంలో తారురోడ్లు వేశారు. వేదిక ప్రవేశ మార్గంలో ప్రతినిధులను ఆకట్టుకునేందుకు సంక్రాంతి ముగ్గులు వేయించారు. సదస్సు ప్రారంభంలో వివిధ ప్రాంతాల సంస్కృతిని, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తెలియజేసే నృత్యాలను ప్రదర్శించారు. బీచ్‌రోడ్డులోనూ, వేదిక వద్దకు వెళ్లే రోడ్ల మార్గాల్లోనూ విద్యుత్ లైట్లతో అలంకరించారు. సదస్సు ప్రాంగణంలో జీసీసీ ఉత్పత్తులు, అరకు కాఫీ, హస్తకళలు, ఉప్పాడ జమదానీ తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సు ప్రారంభానికి ముందు అరకు కాఫీ స్టాల్ వద్దకు వెళ్లి కాఫీ రుచి చూశారు.
బాబు పొగడ్తలకే ప్రాధాన్యం
భాగస్వామ్య సదస్సులో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే వక్తలు ప్రాధాన్యమిచ్చారు. అనిల్ అంబానీ చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ మధ్యలో లోకేష్ ప్రస్తావన కూడా తెచ్చారు. రక్షణరంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావు మాట్లాడుతూ తన చదువు, కెరీర్ విశాఖలోనే ప్రారంభమైందన్నారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలున్నాయని, పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. వక్తల ప్రసంగం ముగిశాక వచ్చే ఏడాది కూడా ఇలాంటి సదస్సును విశాఖలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలుత అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి వేదికపైకి వెళుతూ.. అదుపుతప్పి కింద పడిపోబోయారు. అక్కడున్న వారు పట్టుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.