
న్యూఢిల్లీ: భారత్‌కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు.