
కల్తీ పాలు, నెయ్యి క్యాన్లను సీజ్ చేసిన ఎంహెచ్‌ఓ వెంకటరమణ
నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఆహార పదార్థాల కల్తీపై మరోమారు కొరడా ఝుళిపించారు. నగరంలో కొంతకాలం క్రితం మున్సిపల్ శాఖ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు, చికెన్ స్టాల్స్, ఫ్రూట్ జ్యూస్ కేంద్రాలపై దాడులు చేశారు. నిల్వ మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న బయటపడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. తాజాగా మంగళవారం జరిగిన దాడుల్లో మరో కల్తీ వ్యవహారం బట్టబయలైంది. మనం రోజూ వినియోగించే నెయ్యి, పాలు సైతం కల్తీకి గురవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
కొన్నేళ్లుగా..
నగరంలోని నవాబుపేట మహాలక్ష్మి ఆలయం వీధిలో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా పాల ఉత్పత్తి కేంద్రం నిర్వహిస్తున్నాడు. అక్కడే నెయ్యి తయారీని కూడా చేస్తుంటాడు. రోజుకు సుమారు వెయ్యి లీటర్లకుపైగా పాలను నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాలను సేకరిస్తారు. వాటిలో నీళ్లు, పౌడర్ కలిపి కల్తీ చేసి నగర ప్రజలకు విక్రయాలు చేస్తున్నారు. అదేవిధంగా నెయ్యిని కూడా ఆ కేంద్రంలోనే తయారీ చేసి విక్రయిస్తున్నారు. పాలు, నెయ్యి కల్తీ వ్యవహారంపై నగరపాలకసంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణకు సమాచారం అందడంతో మంగళవారం తయారీ కేంద్రంపై దాడులు చేశారు. నెయ్యిలో ఓ కంపెనీకి చెందిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కలుపుతున్నారు. అధికారులు దాడులు చేయడంతో కేంద్రం నిర్వాహకుడు పరారయ్యాడు. దాడుల్లో సుమారు 200 లీటర్ల కల్తీ పాలు, పాల పౌడర్, 600 కేజీల నెయ్యి, సన్‌ఫ్లవర్ ఆయిల్, తయారీ వస్తువులను స్వాధీనం చేసుకుని కేంద్రాన్ని సీజ్ చేశారు. కల్తీ పాలు, నెయ్యిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా కల్తీ ఆహారంపై అవగాహన పెంచుకోవాలి. కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా.– వెంకటరమణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment