పసుపు–కుంకుమలో ‘పచ్చ’ కల్తీ | Adulteration In Pasupu Kumkuma Scheme | Sakshi
Sakshi News home page

పసుపు–కుంకుమలో ‘పచ్చ’ కల్తీ

Published Sun, Feb 24 2019 12:46 PM | Last Updated on Sun, Feb 24 2019 12:46 PM

Adulteration In Pasupu Kumkuma Scheme - Sakshi

డ్వాక్రా సంఘం సభ్యులు

రుణమాఫీ చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపడమే ఒక మోసం.. తర్వాత పుసుపు–కుంకుమ–1 పేరుతో పెట్టు్టబడి నిధి అంటూ రూ.10వేలు చొప్పున ఇస్తామని ఆశ చూపి.. పదివేల మందికి ఉత్తచెయ్యి చూపారు. నాలుగున్నరేళ్లకుపైగా ఇలా కాలక్షేపం చేసేశారు.. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పసుపు–కుంకుమ–2 పథకాన్ని తెరపైకి తెచ్చారు. మూడు చెక్కులు.. రూ.పదివేలు.. అంటూ హంగామా చేస్తూ సర్కారీ ఓట్ల కొనుగోలు ప«థకానికి బరితెగించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యని విమర్శలు వెల్లువెత్తుతుంటే.. వాటితో తమకేం పని అన్నట్లు టీడీపీ నేతలు పసుపు–కుంకుమ సొమ్మునూ నొక్కేయడానికి స్కెచ్‌ వేశారు. ఏకంగా సంఘాలు, సభ్యుల జాబితాలనే అనర్హులతో కల్తీ చేసేశారు. ఏనాడూ పొదుపు చేయని, సంఘాల్లో లేని టీడీపీ సభ్యులను తీసుకొచ్చి సంఘాల్లోని సభ్యుల సంఖ్య పెంచేశారు. అధికారులతో కుమ్మక్కై జిల్లావ్యాప్తంగా సుమారు 30వేల మంది అదనపు సభ్యులతో ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించేశారు. ఆ విధంగా సుమారు రూ.30 కోట్లు టీడీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిపోయేందుకు రంగం సిద్ధమైంది.

సాక్షి, విశాఖపట్నం: పసుపు కుంకుమ పేరిట లూటీ జరుగుతోం ది. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై దొంగ జాబితాలతో కోట్లు కొట్టేసేందుకు స్కెచ్‌ వేశారు. ఏనాడు పొదుపు చేయని, సం ఘాలతో సంబంధం లేని వారిని డ్వాక్రా సంఘాల జాబితాల్లో చేర్చేసి జిల్లా నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమాన్ని అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.

డ్వాక్రా మహిళలకు మొదటి నుంచీ మోసమే..
గద్దెనెక్కగానే డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న హామీని అటకెక్కించిన ప్రభుత్వం.. కంటితుడుపుగా పసుపు కుంకుమ రూపంలో ఒక్కొక్కరికి రూ.10 వేల పెట్టుబడి సాయం ప్రకటించింది. తొలివిడతలో జిల్లాలోని 45,724 సంఘాల్లోని 4,88,004 మందికి రూ.362.39 కోట్లు, వడ్డీ రూపంలో 36,239 సంఘాలకు రూ.66.73 కోట్లు జమ చేసింది. అయితే ఆ విడతలో దాదాపు పదివేల మందికి నేటికీ పైసా కూడా అందలేదు. తాజాగా ఎన్నికల కోడ్‌ కూసే వేళ డ్వాక్రా సంఘాలను ఏమార్చేందుకు పసుపు కుంకుమ–2 అంటూ పోస్టు డేటెడ్‌ చెక్కులతో హంగామా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులోనూ తొలివిడతలో వడపోతల పేరిట అర్హుల జాబితాను కుదించేశారు. ఆ విడతలో ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున రూ.290.33కోట్లు విడుదల చేశారు. ఇందులో సుమారు 80 శాతం మాత్రమే ఆయా సంఘాల ఖాతాలకు జమ చేశారు. ఆధార్‌ లింక్‌ కాలేదని, పొదుపు చేయడం లేదన్న సాకుతో మిగతా సంఘాలకు జమ చేయలేదు. కానీ రెండోవిడతకొచ్చేసరికి ఓట్ల రాజకీయం కోసం సంఘాల్లో ఉన్న సభ్యులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు 76,711 సంఘాల్లోని 8,12,938 మందికి రూ. 812.93 కోట్లు ప్రకటించారు. 

ఇక్కడే స్వాహాపర్వం  
రెండో విడతలో అందరికీ అవకాశం కల్పించడాన్నే టీడీపీ నేతలు అవకాశంగా తీసుకున్నారు. మరో విడత ప్రతిపాదనలు పంపిస్తున్నారు. అసలు సంఘాలతో సంబంధం లేని, ఏనాడు ఒక్క పైసా కూడా పొదుపు చేయని వారిని సంఘాల్లో ఉన్నట్టుగా రికార్డులు పుట్టించి మరీ పసుపు కుంకుమ పూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు సంఘాలతో సంబంధం లేని టీడీపీ కార్యకర్తలను సంఘాల్లో సభ్యులుగా చూపించి  అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. గ్రామీణ జిల్లాలో 15,328 సంఘాల్లో కొత్తగా 24,644 మందిని చేర్పించారు. జీవీఎంసీ పరిధిలో దాదాపు 9వేల సంఘాల పరిధిలో 10వేల మందిని, ఏజెన్సీలోని మూడువేల సంఘాల్లో ఐదువేల మందిని చేర్పించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

తీర్మానాలు లేకుండానే..
చనిపోయిన, వలస పోయినావారి స్థానంలో మరొకరు చేరాలంటే సంఘ తీర్మానం అవసరం. ఆ తీర్మానాన్ని బట్టి సంఘం బ్యాంకు ఖాతాలో వారి పేరు చేరుస్తారు. ఇలా కాకుండా నేరుగా కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నా  సంఘ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం అవసరం. అలా ప్రతి సంఘంలో గరిష్టంగా 20 మంది సభ్యులను చేర్చుకోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రతి సంఘంలోనూ 10 నుంచి 12 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో కూడా సరిగ్గా పొదుపు చేయక, సకాలంలో అప్పులు చెల్లించని కారణంగా మూడోవంతు సభ్యులను యాక్టివ్‌ జాబితా నుంచి తొలగించారు. అటువంటి వారికి పసుపు కుంకుమ–2 తొలివిడత సొమ్ము జమ కాలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 10వేల సంఘాల్లో 15వేల మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పుడు వీరితో పాటు సంఘాలతో ఎటువంటి సంబంధం లేని వారిని కూడా సభ్యులుగా చేర్చి డబ్బులు కొట్టేయాలన్నది టీడీపీ నేతల పన్నాగం. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. సభ్యులు కానీ ఈ అదనపు సభ్యుల పేరిట మరో రూ.30 కోట్ల వరకు మంజూరు కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement