కైకలూరు (పశ్చిమ గోదావరి) : కొల్లేరు సమస్యలపై 15 రోజుల్లో అధ్యయనం చేసి పూర్తి వివరాలు అవగాహన చేసుకుంటానని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి శుక్రవారం ఆయన హెలికాప్టర్‌లో కొల్లేరులో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో సభావేదికపై జవదేకర్ మాట్లాడుతూ.. కొల్లేరు అంశం సుప్రీంకోర్టు ఎంపవర్ట్ కమిటీ అధీనంలో ఉందన్నారు. మరో 15 రోజుల్లో కొల్లేరులో ప్రజలు, పక్షులు అనే రెండు కోణాలను పరిశీలిస్తానన్నారు. బీజేపీకి 12 ఏళ్లుగా గొంతుకగా పనిచేశానని, కొల్లేరు ప్రజల తరఫున సుప్రీంకోర్టులో అదే విధంగా పనిచేస్తానన్నారు. విదేశాల నుంచి పక్షుల వలసలు వస్తాయి కానీ, ఇక్కడి ప్రజలు అక్కడికి వలసలు పోలేరన్నారు.
మరో మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కొల్లేరు అంశం చట్టపరిధి దాటి సుప్రీం కోర్టు పరిధిలోకి చేరిందన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అయ్యే పనికాదన్నారు. న్యాయపరంగా, శాస్త్రీయంగా అధ్యయనం అవసరమన్నారు. భూసేకరణను అడ్డుకోవడమంటే దేశాభివృద్ధిని అడ్డుకోవడమేనన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య స్పందించారు. కాంగ్రెస్ పాలనలో భూసేకరణ విధానాన్ని మార్పు చేయాలని ప్రధానిని పలు రాష్ట్రాలు కోరాయన్నారు. దీంతో 2014 జూన్ 27న మొత్తం 32 రాష్ట్ర ప్రతినిధులు హాజరు కాగా వారిలో 28 మంది మార్పు చేయాలని కోరారన్నారు. భూసేకరణ చట్టంలో 9 సవరణలు చేసి కమిటీ ముందు నిర్ణయం కాకముందే అంగుళం భూమి తీసుకోనివ్వం అనడం తగదన్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో కొల్లేరుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. చేపల ఉత్పత్తులలో కొల్లేరు ప్రాంతం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొల్లేరు పై ఏరియల్ సర్వే చేసిన కేంద్ర మంత్రులు
Published Fri, Jul 17 2015 8:19 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement