రుణమాఫీ ప్రకటన వెలువడిన నాటి నుంచి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజుకో ప్రకటన, పూటకో నిబంధనతో విసిగి వేశారుపోతున్నారు.
రుణమాఫీ ప్రకటన వెలువడిన నాటి నుంచి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజుకో ప్రకటన, పూటకో నిబంధనతో విసిగి వేశారుపోతున్నారు. నిబంధనల ప్రమాదాలను గట్టెక్కి, ఆన్‌లైన్‌లో రుణమాఫీ రైతుల జాబితాను పొందుపరిచిన తరువాత కూడా ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. మొదట రూ.50 వేలు రుణమాఫీ అయిన వారికి ఒకే విడతలో జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు రూ.50 వేలు ఉన్నా, రూ.1.50లక్షలు మాఫీ అయినా విడతల వారీగా చెల్లిస్తామని చెబుతోంది. బకాయి మొత్తంలో మొదటి విడత ఖాతాలో పడాలంటే, రైతు అఫిడవిట్ సమర్పించాలని కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: ‘‘రుణమాఫీ సొమ్ములో తొలివిడత మొత్తం మీ ఖాతాల్లో జమ కావాలా? అయితే మీరు 14 కాలమ్‌లతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించాలి, మిగతా మూడు వాయిదాల సొమ్ము ఒక వేళ ప్రభుత్వం చెల్లించకపోతే మేమే చెల్లిస్తామని సంతకాలు చేయాలి. లేకుంటే తొలివిడత వచ్చిన తృణమో, పణమో మీ ఖాతాలో వేసేది లేదు ’’ అంటూ బ్యాంకర్లు అన్నదాతలకు షరతులు విధిస్తున్నారు. దీంతో రైతన్న దిమ్మతిరిగిపోతోంది. కేవలం లక్షా 50 వేల రూపాయల రుణమాఫీ మాత్రమే నాలుగు విడతల్లో చెల్లిస్తామని, రూ.50వేల లోపున్న వారికి ఒకేసారి మాఫీ వర్తింపచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ... లక్షా 50వేల రుణాలతో పాటు 50 వేల మాఫీని కూడా విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించింది.
అయినా
అయితే ఇంతవరకూ ఒక్క పైసా కూడా రైతుఖాతాలో జమకాలేదు. సొమ్ము జమకావాలంటే... ప్రభుత్వం మిగతా బకాయిలు చెల్లించకపోతే తామే ఆ సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని రైతులు...బ్యాంకులకు అఫిడివిట్ అందజేయాలి. మొత్తం 14 కాలమ్‌లున్న అఫిడవిట్‌లపై బ్యాంకర్లు రైతులతో సంతకాలు చేయించుకుంటున్నారు. దీంతో అమ్మో ఇదేమి రుణమాఫీరా నాయనో అని రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. రుణమాఫీ అర్హత కోసం ప్రారంభంలో 34 కాలమ్‌లున్న దరఖాస్తులను తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా అఫిడవిట్లను సేకరిస్తోంది.
ఈ అఫిడవిట్‌లో బకాయి ఉన్న మొత్తం ఎంత? ఇందులో స్కేలాఫ్ ఫైనాన్స్ ప్రకారం మాఫీ అయిందెంత? అందులో మొదటి వాయిదాగా చెల్లించనున్నదెంత? అన్న వివరాలు రాయించుకుని మిగిలిన మొత్తాన్ని మేమే చెల్లిస్తామని రైతులతో సంతకాలు చేయించుకుంటున్నారు. దీంతో రైతులు విస్తపోతున్నారు. అసలు రుణం, దానికయ్యే వడ్డీతో కలిపి ఐదేళ్లలో తామే తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఇలా మిగతా మొత్తాన్ని రైతులతో చెల్లించేందుకు అఫిడవిట్లు రాయించుకోవడమేంటని అడుగుతున్నారు.
అఫిడవిట్లో సంతకాలు చేస్తేనే జమ చేస్తాం..
మా బ్యాంక్‌లో 11 వందల మందికి రుణ ఖాతాలున్నాయి. మా బ్యాంకుకు జమ అయిన మాఫీ మొత్తాలను రైతుల ఖాతాల్లో ఇంకా వేయలేదు. ప్రభుత్వం కొన్ని అఫిడవిట్లు ఇచ్చింది. 14 కాలమ్‌లున్న ఈ అఫిడవిట్లలో సంతకాలు చేస్తే అప్పుడు తొలి వాయిదా మొత్తాన్ని వేస్తాం. మాకు వచ్చిన నిబంధనల ప్రకారం చేస్తున్నాం.
- జయంత్‌కుమార్ దాస్,
సహాయ మేనేజర్, ఐఓబీ, డొంకినవలస