
మళ్లీ బిల్లుల షాక్
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : మూడేళ్లుగా విద్యుత్ చార్జీల బాదుడుకు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. ఇబ్బడి ముబ్బడిగా చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల పేరిట వసూళ్లతో సామాన్యులు అవస్థలు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన పాలకులు అన్ని వర్గాల ప్రజలను ఎడాపెడా బాదేశారు. గడిచిన మూడేళ్లలో పెరిగిన విద్యుత్, సర్దుబాటు చార్జీల పేర జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై రూ.300 కోట్లకు పైగా భారం మోపారు. కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రెండేళ్లలోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇప్పుడు ఈఆర్‌సీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లా ప్రజలపై మరో రూ.100 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చార్జీల పెంపు ప్రతిపాదనలను తయారు చేసింది. రాష్ట్ర ప్రజలపై మొత్తం రూ.3,500 కోట్లు భారం పడేలా విద్యుత్ చార్జీలను పెంచనుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను కొత్తగా చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 8న రాష్ట్రంలో ఏర్పడనున్న నూతన ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈఆర్‌సీ ప్రతిపాదించిన కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. తాజా పెంపులో గృహ వినియోగదారులపై పెనుభారం పడనుంది.
50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుం ది. ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పు న పెంపుదల ఉండగా.. పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కో డ్, ఆ తరువాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో చార్జీల పెంపులో జాప్యం జరిగింది.
200 యూనిట్లు దాటితే..
కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు.
ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే పెరగనున్న చార్జీల మేరకు మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51 నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101 నుంచి 150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151 నుంచి 200 వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున మొత్తం 908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు 5.56 చొప్పున రూ.1112తో పాటు అ తర్వాత ప్రతి యూనిట్‌కు రూ.6.69 కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ.210.19 అదనంగా చెల్లించాలి. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం.
జిల్లాపై రూ.100కోట్లు
అదనపు భారం
గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలతో పాటు సర్దుబాటు చార్జీలను కూడా సామాన్యులపై మోపి కోలుకోని స్థితికి చేర్చింది. ప్రజలపై అధిక భారం మోపిన రాష్ట్ర సర్కార్ విద్యుత్ శాఖ ద్వారా మరో షాక్ తగిలింది. జిల్లాలోని గృహ, వాణిజ్య రంగాల విద్యుత్ వినియోగదారులపై ఈ ఏడాది రూ.100 కోట్లు మోపనున్నారు. జిల్లాలో 11.26 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ కనెక్షన్లు 8.84 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 1.3లక్షలు, వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లు 71వేలు, ఇతరత్రా కనెక్షన్లు 41వేలు ఉన్నాయి. విద్యుత్ వాడకంలో లబ్ధిపొందే చిరు వ్యాపారులు రెండింతలు వచ్చిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక వ్యాపారాలను మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయలేక పోగా ఎడాపెడా చార్జీల భారం మోపడంపై మండిపడుతున్నారు.