నెల్లూరు (దర్గామిట్ట) : రైతుల సంక్షేమమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుజేసిన ఉచిత విద్యుత్ పథకం ఆయన మరణానంతరం రైతులకు అందని ద్రాక్షలా మారింది. వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు తక్షణం మంజూరు చేయాలని సాక్షాత్తు ఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ మోటార్లకు సరఫరాకు సరిపడ విద్యుత్ లోడ్ లేదంటూ దాటవేస్తున్న సంబంధిత అధికారులు ముడుపులు చెల్లిస్తే క్షణాల్లో కనెక్షన్ మంజూరు చేస్తుండడం విశేషం. దీంతో జిల్లాలో 13, 107 దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11,15,166 విద్యుత్ కనెక్షన్లు ఉండగా వాటిలో వ్యవసాయానికి 1,41,581 సర్వీసులు ఉన్నాయి.
అందులో 1.35 లక్షల కనెక్షన్లు ఉచిత సర్వీసులే. మిగిలినవి వాణిజ్య అవసరాల కింద తీసుకున్న కనెక్షన్లు. రైతులు రబీ, ఖరీఫ్ సీజన్లోవరి, చెరకు, కూరగాయలు, పొగాకు తదితర పంటలు సాగుచేస్తారు. ఈ పంటలు ఎక్కువగా బోర్లు, బావులపై ఆధారపడి చేస్తుంటారు. జిల్లాకు రోజుకు 87 లక్షల యూనిట్ల విద్యుత్ కోటా ఉండగా, 90 లక్షల యూనిట్లకు పైగానే వినియోగం జరుగుతున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అందులో 30 శాతం విద్యుత్ వ్యవసాయానికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఉచిత విద్యుత్‌కు కేవలం సర్వీస్ చార్జీగా నెలకు రూ. 20 రైతులు చెల్లిస్తే వినియోగ భారమంతా ప్రభుత్వం భరించాలి. దీంతో ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారని, అందులో భాగంగానే కొత్త కనెక్షన్లు మంజూరు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తుంది. ఇది సరిపోవడం లేదని, రైతులు అదనంగా హార్స్ పవర్, విద్యుత్ స్తంభాలకు చెల్లించాల్సిన నగదు చెల్లించడం లేదని, ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌కు సరిపడ లోడ్‌కు అవసరమైన స్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయలేకనే కొత్త కనెక్షన్లు మంజూరు చేయడం లేదని అధికారులు అంటున్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 13,107 దరఖాస్తుల్లో 4,179 మంది రైతులు నిబంధనల మేరకు పూర్తిగా డబ్బులు చెల్లించగా, 8,928 మంది దరఖాస్తు చేసుకుని అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే డబ్బు చెల్లించడానికి ఎదురుచూస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5,818 కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటికే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశీలిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్పడం విశేషం.
త్వరలో కనెక్షన్లు ఇస్తాం
- నాగశయనరావు, ఎస్‌ఈ
వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వీలైనంత త్వరగా సర్వీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ఆయా డివిజన్లల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. ట్రాన్స్‌ఫార్మర్లలో లోడ్ లేని చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కనెక్షన్ల కోసం డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలి.
ముడుపులిస్తేనే..
Published Mon, Sep 8 2014 2:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement