Power charge
-
ఇక కరెంటు ఛార్జీలు పెంచం
♦ వీలైతే ఉన్న ఛార్జీలనూ తగ్గిస్తాం ♦ రాష్ట్రంలో 2.75 లక్షల కోట్లతో పరిశ్రమలు ♦ 813 పరిశ్రమలతో 6.17 లక్షల మందికి ఉపాధి ♦ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా తిరుపతి ♦ ఐవోటీ, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు ♦ నెల్లూరు, తిరుపతి, చెన్నైల మధ్య ‘ట్రై ఇండస్ట్రీ సిటీ’ ♦ తిరుపతి ‘సెల్కాన్’ ప్లాంట్ ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, వీలైతే ఉన్న ఛార్జీలను కూడా తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా గణనీయమైన అభివృద్ధికి నాంది పలికింది తానేనని, ఐటీ, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్, జీఐసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలను తెచ్చి పరిశ్రమల అభివృద్ధికి ఇపుడెంతో కృషి చేస్తున్నానని చెప్పారు. త్వరలో క్లౌడ్, ఐవోటీ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామని చెప్పారాయన. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు ఎదురుగా రూ.150 కోట్ల పెట్టుబడితో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్కాన్ మొబైల్ ఫోన్ల ప్లాంట్‌ను చంద్రబాబు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనిట్ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ఎంవోయూలు చేసుకున్న 813 కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవన్నీ ఏర్పాటయితే రూ.2,75,650 కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, వీటితో పాటు 6,17,691 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. చాలా పరిశ్రమలు ఫౌండేషన్, అప్రూవల్, సివిల్ వర్క్‌ల దశల్లో ఉన్నాయన్నారు. రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా రానున్న రోజుల్లో లక్ష మందికి ఉపాధి లభించే అవకాశాలు మెరుగయ్యాయన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్, ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి పరుస్తామన్నారు. 400 మిలియన్ యూఎస్ డాలర్ల విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయనీ, ఏర్పేడు కేంద్రంగా స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్ అభివృద్ధి జరుగుతుందని సీఎం అన్నారు. ట్రై ఇండస్ట్రియల్ సిటీ... నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల మధ్య ట్రై ఇండస్ట్రీస్ సిటీని అభివృద్ధి పరుస్తామన్నారు. శ్రీసిటీకి దగ్గరలోనే సిరామిక్ పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటికే కజారియా, ప్లోయిరా వంటి పరిశ్రమలు ముందుకొచ్చాయని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో హార్డ్‌వేర్ అంటే తిరుపతి గుర్తు రావాలన్నారు. ఇక్కడి ప్రాంతాన్ని స్పెషల్ ఎంప్లాయిమెంట్ జోన్‌గా అభివృద్ధి పరిచేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. ఈ ఏడాది హంద్రీనీవా నీటిని చిత్తూరు, కుప్పం వరకూ తెస్తామని పునరుద్ఘాటించారు. సొంత జిల్లాలో రూ.150 కోట్లతో సెల్కాన్ కంపెనీని నెలకొల్పి వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న సెల్కాన్ అధినేత వై. గురుస్వామినాయుడు, రేతినేని మురళిలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కంపెనీలో తయారైన తొలి సెల్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. రేణిగుంట ఈఎంసీలో లక్ష ఉద్యోగాలు... 2019 లోగా రేణిగుంట ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పరిధిలో లక్ష మందికి ఉద్యోగాలొస్తాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 2015 నవంబరులో తిరుపతి సెల్కాన్ యూనిట్‌కు శంకుస్థాపన జరిగిందనీ, ప్రభుత్వ సహకారం, సీఎం ప్రత్యేక చొరవ కారణంగా యూనిట్‌ను త్వరగా ఏర్పాటు చేయగలిగామని సెల్కాన్ ఛైర్మన్ వై. గురు చెప్పారు. ప్రస్తుతం నెలకు 5 లక్షల సెల్ఫోన్లు తయారవుతున్నాయనీ, భవిష్యత్తులో 20 లక్షల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రేణిగుంట సభ ముగిశాక సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్‌లో తొట్టంబేడు మండలం తాటిపర్తి వెళ్లి అక్కడ నూతనంగా ఏర్పాటు చేయనున్న కజారియా, ప్లోయినా, సుధా సిరామిక్ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుగుణమ్మ, ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్రూ పాల్గొన్నారు. -
లేదు లేదంటూనే బాదుడు!
-
లేదు లేదంటూనే బాదుడు!
విద్యుత్ వినియోగదారులకు డిస్కంల ‘కమర్షియల్’షాక్ చార్జీల పెంపు లేదంటూనే కనెక్షన్ల కేటగిరీల్లో భారీ మార్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు లేదు లేదంటూనే విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వినియోగదారులకు ‘కమర్షియల్’షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2016–17లో అమలైన విద్యుత్ చార్జీలనే ఈ ఏడాదీ(2017–18) కొనసాగించాలని తాజాగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి ప్రతిపాదించిన డిస్కంలు.. తెరచాటుగా మాత్రం టారిఫ్‌లోని కమర్షియల్, ఇండస్ట్రియల్, టెంపరరీ విద్యుత్ కనెక్షన్ల కేటగిరీల్లో మార్పులకు అనుమతి కోరడం ద్వారా దొంగదెబ్బకు రెడీ అయ్యాయి. ఇప్పటికే భారీ విద్యుత్ చార్జీల మోతను భరిస్తున్న కమర్షియల్ కేటగిరీలోకి కొత్తగా 12 రకాల కనెక్షన్లను డిస్కంలు ప్రతిపాదించాయి. దీంతో ఈ వినియోగదారుల విద్యుత్ బిల్లులు రెట్టింపు కానున్నాయి. అయితే, డొమెస్టిక్ కనెక్షన్ల కేటగిరీలో ఎలాంటి మార్పులు లేకుండా పాత విధానాన్ని ప్రతిపాదించడం గృహ వినియోగదారులకు ఊరట కలిగించనుంది. ఈఆర్సీ ఆమోదించిన తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి రానున్నాయి. టారిఫ్ కేటగిరీల్లో డిస్కంలు సూచించిన మార్పులను తాజాగా ఈఆర్సీ బహిర్గతం చేసింది. ఇక అంతా కమర్షియలే..! ప్రస్తుతం అమల్లో ఉన్న టారీఫ్ ప్రకారం.. కమర్షియల్ కేటగిరీలో విద్యుత్ వినియోగం ఆధారంగా యూనిట్‌కు రూ.6 నుంచి రూ10 వరకు భారీగా చార్జీలు విధిస్తున్నారు. యూనిట్‌కు రూ.5.65 నుంచి రూ.6.65 వరకు చార్జీల పరిధిలోకి వచ్చే హెచ్‌టీ–1(ఏ) ఇండస్ట్రియల్ కేటగిరీలోని అన్ని రకాల సర్వీసింగ్ స్టేషన్లు మరియు రిపేరింగ్ సెంటర్లు, బస్ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్ యూనిట్లు, గ్యాస్/ఆయిల్ స్టోరేజీ/ట్రాన్స్ఫర్ స్టేషన్లు, గోదాములు/స్టోరేజీ యూనిట్లను కమర్షియల్ పరిధిలో చేర్చాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే యూనిట్‌కి రూ.6.70 చార్జీలు వర్తించే ఎల్టీ పరిశ్రమల కేటగిరీ పరిధిలోని ఐటీ పరిశ్రమల యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించే కెఫెటేరియాలు, హోటళ్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆడిటోరియంలు, ఇతర సదుపాయాలను కమర్షియల్ కేటగిరీలోకి బదలాయించాలని కోరాయి. దీంతో ఈ కనెక్షన్లు యూనిట్‌కి రూ.6 నుంచి రూ.10 వరకు వర్తించే కమర్షియల్ కేటగిరీలోకి మారడం ద్వారా ఒక్కసారిగా వీటి విద్యుత్ బిల్లులు రెట్టింపు కానున్నాయి. ఐటీ పరిశ్రమల పరిధిలోని ఐటీ యేతర అవసరాలకు వినియోగించే విద్యుత్ కోసం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసుకోకుంటే మొత్తం ఐటీ పరిశ్రమల విద్యుత్ వినియోగానికి హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీ కింద విద్యుత్ బిల్లులను జారీ చేస్తామని డిస్కంలు తెలిపాయి. హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీలో కనెక్షన్ల సామర్థ్యం ఆధారంగా యూనిట్‌కు రూ.6.80 నుంచి రూ.7.80 వరకు చార్జీలు చెల్లించాల్సి రానుంది. హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీలో కొత్తగా.. గృహేతర, వాణిజ్య సముదాయాల్లోని పలు రకాల కనెక్షన్లను కొత్తగా హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీలోకి చేర్చాలని డిస్కంలు కోరాయి. ఈ కేటగిరీ కింద కనెక్షన్ల సామర్థ్యం ఆధారంగా యూనిట్‌కు రూ.6.80 నుంచి రూ.7.80 వరకు చార్జీలు అమల్లో ఉన్నాయి. షాపులు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, పబ్లిక్ భవనాలు, ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, థియేటర్లు, సినిమా హాళ్లు, టింబర్ డిపోలు, ఫొటో స్టూడియోలు, ప్రింటింగ్ ప్రెస్‌లు, అన్ని సర్వీసింగ్, రిపేరింగ్ సెంటర్లు, బస్ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్ యూనిట్లు, గ్యాస్/ఆయిల్ స్టోరేజీ/ట్రాన్స్ఫర్ స్టేషన్లు, గోదాములకు దీపాలు, ఫ్యాన్లు, హీటింగ్, ఎయిర్ కండిషనింగ్, ఇతర విద్యుత్ ఉపకరణాలకు విద్యుత్ సరఫరాను కొత్తగా హెచ్‌టీ–(2) కేటగిరీలోకి చేర్చాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే వ్యక్తులు, ఎన్జీవోలు, ప్రైవేటు ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు, వాటి హాస్టళ్లను ఈ కేటగిరీలోనే చేర్చాలని కోరాయి. ఏడాది వరకు తాత్కాలిక కనెక్షన్లు.. తాత్కాలిక కనెక్షన్ల కాలపరిమితిని ఆర్నెల్ల నుంచి ఏడాదికి పొడిగించాలని డిస్కంలు కోరాయి. అన్ని రకాల నిర్మాణ పనులు, నిర్మాణంలోని భవనాలు, ఎగ్జిబిషన్లు, సర్కస్‌లు, ఔట్‌డోర్ సినిమా షూటింగ్‌లు, టూరింగ్ టాకీస్‌లకు తాత్కాలిక కనెక్షన్ల కింద మాత్రమే విద్యుత్ సరఫరాను ప్రతిపాదించాయి. తాత్కాలిక కేటగిరీలో ప్రస్తుతం యూనిట్‌కు రూ.11 చొప్పున చార్జీలు విధిస్తున్నారు. -
మోత.. కోత..!
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు కరెంట్ చార్జీల పెంపు, మరోవైపు విద్యుత్‌కోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరెంట్ ఎంతవాడితే అంత మేర చార్జీల భారం పెరగనుంది. దీంతో ప్రతినెలా వినియోగదారుల మీద దాదాపు రూ.15 కోట్లకు పైగా భారం పడనుంది. ఇదిలా ఉంటే వేసవికి ముందే అప్రకటిత కోతలతో విద్యుత్ సంస్థలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా అవసరాల కోసం 19మిలియన్ యూనిట్లు విద్యుత్ కావాల్సి ఉండగా... కేవ లం 14మిలియన్ యూనిట్లే సరఫరా అవుతోంది. అంతేకాదు రోజురోజుకు విద్యుత్ డి మాండ్ పెరుగుతుండడంతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. ఈసారి అరకొరగా సాగుచేసిన పంటలకు సై తం కరెంట్ కోతలతో నీరందించలేక రైతులు సతమతమవుతున్నారు. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాల్లో తా గునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వడ్డన... ఇప్పటికే విద్యుత్ చార్జీలు తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో మరోసారి పిడుగు పడనుంది. పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేర కు ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించాయి. దీం తో మధ్యతరగతి ప్రజల మొదలుకొని ప్రతీ ఒక్కరిపై భారం పడనుంది. కరెంట్ వాడేకొద్దీ చార్జీల మోత మోగనుంది. వంద యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఇందులో మినహా యింపు లభించింది. వందకన్నా ఒక్క యూనిట్ పెరిగినా అదనంగా 48 పైసలు వసూలు చేయనున్నారు. దీని ప్రకారం 200 యూ నిట్లు వాడితే రూ. 645తో పాటు సర్వీస్ చార్జీలను అ దనంగా వడ్డిస్తారు. తర్వాత ఒక్క యూనిట్ పెరిగినా రూ.871.25 వసూలు చేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ చార్జీల కంటే రూ.226కుపైగా వినియోగదారులపై భారం పడనుంది. దీని ప్రకారం క్యాట గిరీ-1లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,31,417 గృహ సంబంధిత స ర్వీస్‌లకు 4.72శాతంతో నెలకు రూ.40లక్షల వరకు భారం పడనుంది. క్యాట గిరీ-2లో 67 వేలకుపైగా ఉ న్న కమర్షియల్ సర్వీస్‌లకు 5.72 శాతంతో రూ.38లక్షలు, 8 వేలకుపైగా ఉన్న పరిశ్రమల సర్వీస్‌లకు 5.76 శాతంతో రూ.35లక్షల వరకు పెరగగా వీధిదీపాలకు 5.6శాతంతో రూ.30 లక్షల వరకు పెరగనున్నాయి. కోతల మోత...! కరెంట్ చార్జీలతో పోటీ పడుతూ అప్రకటి త కోతలు కూడా పెరుగుతున్నాయి. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ప్రతిరోజు అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లా అవసరాలు తీరాలంటే మొత్తం 19.50 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రతిరోజూ కేవలం 13.50 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో డిమాండ్ సరఫరాకు భారీ వ్యత్యాసం ఉండడంతో లోటును పూడ్చుకోవడం కోసం ఎడాపె డా అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. లోడ్ రిలీఫ్ కోసం జిల్లా కేంద్రం, పట్టణాలు, మున్సిపాలిటీలలో ఆరుగంటల పాటు కోత విధించాలని సూచన ప్రా యంగా నిర్ణయించారు. వీటిని రెండు విడతలుగా అమలు చేయాలని విద్యుత్ సంస్థ నిర్ణయించింది. అదేవిధంగా మండల కేంద్రాల్లో ఎనిమిది గంటల పాటు, గ్రామాల్లో 12గంటల పాటు విద్యుత్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక వ్యవసాయానికి అందజేస్తున్న ఆరు గంటల విద్యుత్‌కు కూడా తూట్లు పొడుస్తున్నారు. జిల్లాలోని మొత్తం ఫీడర్లను గ్రూప్-ఎ, గ్రూప్-బిలుగా విభజించి కరెంట్ సరఫరా చేస్తున్నా... ఎక్కడా నాలుగు గంటలకు మించి సరఫరా కావడం లేదని విద్యుత్ అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పుడే కోతలు ఈ విధంగా ఉంటే తమ ప రిస్థితి ఏంటని వ్యాపారులు, చిన్న పరిశ్రమలు వాపోతున్నాయి. వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తిచేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. -
అదే మోసం.. అదే వంచన
ఒకవైపు విద్యుత్ చార్జీల మోత.. మరో వైపు వ్యాట్ వడ్డనకు ప్రభుత్వం సన్నద్ధం కావడం ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. అమలు చేయలేని హామీలతో ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రజలను పిండడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు అవగతమవుతోంది. ప్రభుత్వ బొక్కసాన్ని నింపేందుకు బక్క ప్రాణులను సైతం బలిపీఠం ఎక్కించడం ఏలికలకే చెల్లినట్టుంది. ఏరు దాటాక తెప్ప తగలేసే నైజాన్ని చంద్రబాబు మరో సారి రుజువు చేసుకున్నారని నిరూపితమవుతోంది. రాజధాని పేరిట సారవంతమైన భూములు లాక్కోవడం, గృహ వినియోగదారుడు మొదలు పరిశ్రమల వరకు భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారం వేయనుండడం ప్రజాకంటక పాలనను జ్ఞప్తికి తేకమానదు. రుణ మాఫీలో విఫలమై బ్యాంకులకు వడ్డీలు కట్టించిన ముఖ్యమంత్రి ఈ సారి విద్యుత్ బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తేటతెల్లమవుతోంది. చార్జీల పెంపు అన్యాయమనీ, అన్ని రంగాలను దెబ్బ తీయనుందనీ, పొరుగు రాష్ట్రాలలో సబ్సిడీపై సౌర విద్యుత్ అందిస్తుంటే మన రాష్ట్రంలో ప్రజల నడ్డి విరుస్తున్నారనీ, భారం మోపనని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారని చంద్రబాబుపై ప్రజలు మండిపడుతున్నారు. -
టెక్స్టైల్స్ బంద్ విజయవంతం
భివండీ, న్యూస్‌లైన్ : పెరిగిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహారాష్ట్రలోని వస్త్రపరిశ్రమ వ్యాపారులు సోమవారం ఒక్కరోజు బంద్ పాటించారు. ఈ బంద్‌లో మాలేగావ్, ధులే, షోలాపూర్, యేవ్లా, వీటా, ఇచ్చల్కరంజీ, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన అనేక పవర్లూమ్ అసోసియేషన్లు, భివండీకి చెందిన పవర్లూమ్ పరిశ్రమల యజమానులు, వివిధ పవర్లూమ్ సంస్థల పదాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యధికంగా పవర్లూమ్ పరిశ్రమలతో భారీ స్థాయిలో వస్త్రాలను ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. పవర్లూమ్ పరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే విద్యుత్ చార్జీలను పెంచి మరింత భారం మోపిందని వారు ఆరోపించారు. విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఆందోళనకారులు విద్యుత్ బిల్లుల హోలి (విద్యుత్ బిల్లులను తగులబెట్టడం) నిర్వహించారు. వస్త్రపరిశ్రమల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్లేందుకు ఆయా ప్రాంతాల్లో సంబంధిత అధికారులకు వినతి పత్రాలను అందించారు. భివండీలో...: పట్టణంలోని పద్మనగర్, బండారి కంపౌండ్, నారాయణ్ కంపౌండ్, ఈద్గా రోడ్, శాంతీనగర్, మీట్ పాట, తదితర ప్రాంతాలలో పవర్లూమ్ పరిశ్రమలు సోమవారం బంద్ పాటించాయి. మహారాష్ట్ర పవర్లూమ్ బున్కర్ సంఘటన అధ్యక్షులు ఫైజాన్ ఆజ్మీ నేతృత్వంలో విద్యుత్ బిల్లుల హోలి నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫైజాన్ ఆజ్మీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలను కొనసాగించి పవర్లూమ్ పరిశ్రమలకు జీవం పోయాలని డిమాండ్ చేశారు. ప్లేన్ పవర్లూమ్ యంత్రాలను ఆధునీకరించేందుకు ఇస్తున్న రుణాన్ని రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిలకడగాలేని నూలు ధరలను అదుపు చేయాలని కోరారు. నూలు కార్టన్లపై ఎమ్.ఆర్.పి, రేట్లు ముద్రించాలని, పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజ్ వసతులు, కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.భివండీ పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్స్ అధ్యక్షులు వంగ పురుషోత్తం న్యూస్‌లైన్ తో పాట్లాడుతూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల పవర్లూమ్ యంత్రాలు ఆగిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ బిల్లుల షాక్
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : మూడేళ్లుగా విద్యుత్ చార్జీల బాదుడుకు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. ఇబ్బడి ముబ్బడిగా చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల పేరిట వసూళ్లతో సామాన్యులు అవస్థలు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన పాలకులు అన్ని వర్గాల ప్రజలను ఎడాపెడా బాదేశారు. గడిచిన మూడేళ్లలో పెరిగిన విద్యుత్, సర్దుబాటు చార్జీల పేర జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై రూ.300 కోట్లకు పైగా భారం మోపారు. కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రెండేళ్లలోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇప్పుడు ఈఆర్సీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లా ప్రజలపై మరో రూ.100 కోట్ల మేర అదనపు భారం పడనుంది. విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చార్జీల పెంపు ప్రతిపాదనలను తయారు చేసింది. రాష్ట్ర ప్రజలపై మొత్తం రూ.3,500 కోట్లు భారం పడేలా విద్యుత్ చార్జీలను పెంచనుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను కొత్తగా చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 8న రాష్ట్రంలో ఏర్పడనున్న నూతన ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈఆర్సీ ప్రతిపాదించిన కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. తాజా పెంపులో గృహ వినియోగదారులపై పెనుభారం పడనుంది. 50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుం ది. ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పు న పెంపుదల ఉండగా.. పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కో డ్, ఆ తరువాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో చార్జీల పెంపులో జాప్యం జరిగింది. 200 యూనిట్లు దాటితే.. కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే పెరగనున్న చార్జీల మేరకు మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51 నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101 నుంచి 150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151 నుంచి 200 వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున మొత్తం 908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు 5.56 చొప్పున రూ.1112తో పాటు అ తర్వాత ప్రతి యూనిట్‌కు రూ.6.69 కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ.210.19 అదనంగా చెల్లించాలి. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం. జిల్లాపై రూ.100కోట్లు అదనపు భారం గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలతో పాటు సర్దుబాటు చార్జీలను కూడా సామాన్యులపై మోపి కోలుకోని స్థితికి చేర్చింది. ప్రజలపై అధిక భారం మోపిన రాష్ట్ర సర్కార్ విద్యుత్ శాఖ ద్వారా మరో షాక్ తగిలింది. జిల్లాలోని గృహ, వాణిజ్య రంగాల విద్యుత్ వినియోగదారులపై ఈ ఏడాది రూ.100 కోట్లు మోపనున్నారు. జిల్లాలో 11.26 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ కనెక్షన్లు 8.84 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 1.3లక్షలు, వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లు 71వేలు, ఇతరత్రా కనెక్షన్లు 41వేలు ఉన్నాయి. విద్యుత్ వాడకంలో లబ్ధిపొందే చిరు వ్యాపారులు రెండింతలు వచ్చిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక వ్యాపారాలను మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయలేక పోగా ఎడాపెడా చార్జీల భారం మోపడంపై మండిపడుతున్నారు. -
భారం...దూరమయ్యేనా?
పాలమూరు, న్యూస్‌లైన: మూడేళ్లుగా విద్యుత్ చార్జీల బాదుడుకు జిల్లా జనం అల్లాడిపోయారు. ఇబ్బడిముబ్బడిగా చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల పేరిట వసూలు చేస్తూ.. వినియోగంకంటే రెండింతలు బిల్లులు వసూలు చేస్తుండటంతో సామాన్యులు అవస్థలు పడ్డారు. ఆ కష్టాలను తలచుకుంటూనే తెలంగాణ రాష్ట్ర కొత్త సర్కారుపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. అదనపు విద్యుత్ భారం కొత్తప్రభుత్వమైనా.. తగ్గిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అమలుపర్చారు. అన్ని రంగాలకూ ప్రయోజనం కల్పించాలన్న సంకల్పంతో విద్యుత్ రాయితీని అధికమొత్తంలో ప్రభుత్వమే భరించింది. ఆయన మరణానంతరం ఈ ఆశయం నీరుగారిపోయింది. గడిచిన మూడేళ్లలో పెరిగిన విద్యుత్, సర్దుబాటు చార్జీల పేర జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై రూ.300 కోట్లకు పైగా భారం మోపారు. కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రెండేళ్లలోనే రూ.80 కోట్లు వసూలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపితే విద్యుత్తు చార్జీల భారం ప్రజలకు కొంతమేరకైనా తగ్గుతుందని భావిస్తున్నారు. బాదుడు ఇలా.. గత ప్రభుత్వం పెంచిన విద్యుత్‌చార్జీలతో పాటు సర్దుబాటు చార్జీలను కూడా సామాన్యులపై మోపి కోలుకోలేని స్థితికి చేర్చింది. ప్రజలపై అధికభారం మోపిన రాష్ట్ర సర్కారు.. విద్యుత్ శాఖ ద్వారా మరో షాక్ తగిలించింది. జిల్లాలోని గృహ, వాణిజ్య రంగాల విద్యుత్ వినియోగదారులపై ఈ ఏడాదిలో రూ.40 మోపారు. జిల్లావ్యాప్తంగా 6.65 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ కనెక్షన్లు 4.25 లక్షలు, 1.90 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 55వేల వరకు వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇతరత్రా కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ సర్దుబాటు చార్జీలపేర జనంపై ఎక్కడలేని భారం మోపడంతో ప్రభుత్వ విధానాలపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యుత్ వాడకంతో లబ్ధిపొందే చిరువ్యాపారులు రెండింతలుగా వచ్చిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక, తమ వ్యాపారాలను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయకపోగా, ఎడాపెడా చార్జీల భారం మోపడంపై మండిపడుతున్నారు. సర్‌చార్జీ వసూలు అద్దె ఇళ్లల్లో సమస్యలకు దారి తీస్తోంది. ఎవరో వాడుకున్న విద్యుత్‌కు మేం ఇంధన చార్జీలు చెల్లించడమేమిటని పలువురు గొడవలు పడిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి కొత్త ప్రభుత్వం తమను బయటపడేయాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు. -
భారం రూ.161 కోట్లు
ప్రజల నెత్తిన మరో కరెంటు పిడుగు పడబోతోంది. ఇప్పటికే భరించలేని విద్యుత్ చార్జీలతో వినియోగదారులు బెంబేలెత్తుతుండగా మరోసారి భారం మోపేందుకు ఈఆర్సీ సిద్ధమవుతోంది. జిల్లా వినియోగదారులపై ఏకంగా రూ.161 కోట్ల భారం వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పేదలు, మధ్య తరగతి, వాణిజ్యం తేడా లేకుండా అందరిపైనా భారం మోపేందుకు నిర్ణయించారు. స్లాబ్‌ల మేర కాకుండా వినియోగించుకున్న విద్యుత్ మొత్తానికి ఒకే రేట్ వర్తింపజేయనుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడనుంది. సాక్షి, కరీంనగర్ : విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యుత్ చార్జీల రూపంలో జిల్లాలో ఏటా రూ.685 కోట్లు వసూలవుతుండగా... మరో 22 శాతం అధిక ఆదా యం సాధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన రూ.846 కోట్ల ఆదాయంగా టార్గెట్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ఈ సారి మధ్య తరగతి ప్రజలనే టార్గెట్‌గా ఎంచుకున్నారు. 200 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే ఈ విభాగం వారికి ఇప్పటివరకు వివిధ స్లాబ్‌ల ప్రకారం చార్జీలను లెక్కించగా ఇప్పటినుంచి మొదటి యూనిట్ నుంచే రూ.6.32 చార్జీ వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఫలితంగా 200 యూనిట్ల వినియోగదారులు రెట్టింపు చార్జీలు కట్టాల్సిన పరిస్థితి రానుంది. ఇప్పుడున్న పద్ధతి ద్వారా 200 యూనిట్లకు రూ.664 బిల్లు వస్తుంటే కొత్త ప్రతిపాదన ప్రకారం వీరు రూ.1,264 చెల్లించా ల్సి ఉంటుంది. జిల్లాలో 2 లక్షల 84 వేల గృహ విద్యుత్ వినియోగ కనెక్షన్లు ఉండగా లక్షా 70 వేల కనెక్షన్లు 200, అంతకన్నా తక్కువ యూని ట్ల వినియోగం ఉన్నవే. వీరి మీద వచ్చే ఏడాది ఏకంగా రూ.31 కోట్ల అదనపు భారం పడనుంది. నిరుపేదలను కూడా పెంపు నుం చి మినహాయించలేదు. 50 యూనిట్లలోపు వి ద్యుత్ వినియోగించే వారి మీద కూడా భారం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ స్లాబ్‌లో యూనిట్ ధర రూ.1.45 నుంచి రూ.3.10 పెంచుతూ ప్రతిపాదన చేశారు. 50 యూనిట్లు వినియోగించే పేదలు రూ.72కు బదులు రూ.155 చెల్లించాల్సి వస్తుంది. వాణిజ్యానికీ తగలనున్న షాక్ గృహ విద్యుత్ వినియోగదారులపై భారం మోపేందుకు ప్రతిపాదించిన ఈఆర్సీ వాణి జ్య వినియోగదారులనూ వదలలేదు. వాణి జ్య కనెక్షన్ల చార్జీలను కూడా పెంచాలని ప్రతి పాదించారు. అన్ని స్లాబ్‌ల్లో యూనిట్ ధరను రూపాయి చొప్పన పెంచాలని నిర్ణయించారు. మధ్యతరహా పరిశ్రమల మీద యూనిట్‌కు అదనంగా రూ.3 వసూలు చేయాలని ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వీధి దీపాలు, తాగునీటి సరఫరాను కూడా అధికారులు వదిలిపెట్టలేదు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉచిత వి ద్యుత్ వర్తించని వ్యవసాయ కనెక్షన్లను మాత్ర మే చార్జీలపెంపు నుంచి మినహాయించారు. నేడు ప్రజాభిప్రాయ సేకరణ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. గురువారం కరీంనగర్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల నుంచి బహిరంగ అభిప్రాయ సేకరణ జరుపనున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వినియోగదారులు, ప్రజాప్రతినిధు లు హాజరవుతారు. ఉదయం 10.30 నుం చి 5 వరకు అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు అశోకాచారి, రాజశేఖర్‌రెడ్డి, కార్యదర్శి మనోహర్‌చారి ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా పాల్గొంటారు. -
పల్లెకు షాక్
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: మైనర్, మేజర్ పంచాయతీలలో తాగునీటి ఫథకాలకు, వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ చార్జిలను ప్రభుత్వమే నేరుగా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో చెల్లిస్తూ ఉండటంతో పల్లెలు విద్యుత్ భారం నుంచి తప్పించుకునేవి. ఇప్పుడు పల్లెల్లోని ప్రతి వీధిలో ఉండే స్తంభానికి లై టు ఏర్పాటు చేయాలన్నా చిన్న పంచాయతీలు ఆలోచించాల్సిందే. కారణం ఇప్పటి వరకు పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ(రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధుల నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించాలని, ఇక మీదట పంచాయతీలే విద్యుత్ చార్జిలను ఎప్పటికప్పుడు చెల్లించాలని మెమో నెం.8181/సీపీఆర్,ఆర్ఈ/ యాక్ట్స్.ఐ(2) 2013 ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థలకు నిధులు లేకుండా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చార్జిలను మళ్లీ పాత పద్ధతిలో పంచాయతీలే చెల్లించాలని పేర్కొనడంతో నిధుల కొరతతో గ్రామాల్లో చీకటి వీధులు దర్శనమివ్వడం ఖాయమని పరిశీకులు పేర్కొంటున్నారు. 2009 నుంచి ప్రభుత్వమే చెల్లిస్తుంది 2008 సంవత్సరం వరకు విద్యుత్ బిల్లులను ఆ పంచాయతే చెల్లించుకునేది. ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు సరిగి నిధులు ఇవ్వకపోవడంతో ఒక స్థితిలో అనేక పంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోతే పల్లెలకు విద్యుత్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు లెటర్లు పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకొని 2009లో ఏకమొత్తంగా హైదరాబాద్ స్థాయిలోనే బకాయిలలో ఎక్కువ మేరకు చెల్లించింది. మళ్లీ 2011లో కూడా ఏక మొత్తంగా ప్రభుత్వమే చెల్లించింది. జిల్లాలో విద్యుత్ శాఖకు బకాయి రూ.21 కోట్లు జిల్లాలో మొత్తం 940 పంచాయతీలున్నాయి. వీటిలో 36 మేజర్ కాగా మిగిలిన 904 మైనర్ పంచాయతీలు. ఇప్పటి వరకు జిల్లాలో పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు సుమారు రూ.21 కోట్లు బకాయిలున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో ఈ పాతబకాయిలు చెల్లించడంతో పాటు ఇక నుంచి ప్రతినెలా విద్యుత్ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఉదయగిరి, మర్రిపాడు, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, కొండాపురం, రాపూరు తదితర మెట్ట ప్రాంత మండలాల్లోని గ్రామాలకు ఆదాయమార్గాలు శూన్యం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న పంచాయతీల అభివృద్ధికి కొంతమేరకు గండిపడినట్టే. ఇది ప్రభుత్వ నిర్ణయం: జితేంద్ర, జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో విద్యుత్ బకాయిలతోపాటు ఇక నుంచి ప్రతి నెలా బిల్లులు పంచాయతీలే చెల్లించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందులో తమ పాత్రేమి ఉండదు. కాబట్టి పంచాయతీలు ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతకాలి. ఆస్తిపన్ను సక్రమంగా వసూలు చేయాలి. విద్యుత్ పొదుపు పాటించాలి. -
తాగునీటి పథకాలకు ‘షాక్’
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు గ్రామీణ తాగునీటి పథకాలకు గుదిబండగా మారనున్నాయా? సత్యసాయి, శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి వంటి తాగునీటి పథకాల నిర్వహణ సవాల్‌గా మారనుందా? విద్యుత్ చార్జీల పెంపు తాగునీటి పథకాలకు శాపంగా మారనుందా?... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. దేశంలోని దుర్భిక్ష ప్రాంతాల్లో జైసల్మీర్ తర్వాతి స్థానం మన జిల్లాదే. ఏడాదికి సగటున 552 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం కురవాల్సి ఉండగా... 400 మి.మీ కూడా కురవడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యల్లనూరు, పుట్లూరు, అమడగూరు, నల్లమాడ మండలాల్లో 92 గ్రామాలకు అన్ని కాలాల్లో ట్యాంకర్ల తో నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి నదీ జలాలను మళ్లించడం ఒక్కటే మార్గం. ఈ క్రమంలోనే సత్యసాయి, శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి వంటి తాగునీటి పథకాలను చేపట్టారు. జిల్లాలోని 1001 పంచాయతీల పరిధిలో 3,339 గ్రామాలున్నాయి. ఇందులో శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి, సత్యసాయి పథకాల ద్వారా 1,167 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి పథకాల విస్తరణతో పాటు ప్రస్తుతం చేపట్టిన పథకాల ద్వారా వచ్చే ఏడాది నుంచి మరో 1048 గ్రామాలకు తాగునీటిని అందించనున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. 2013 ఫిబ్రవరి వరకు గ్రామీణ తాగునీటి పథకాలకు యూనిట్ విద్యుత్‌ను 45 పైసలతో ప్రభుత్వం సరఫరా చేసేది. పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగా కేటాయించే బడ్జెట్లో సింహభాగం విద్యుత్ చార్జీల చెల్లింపునకే సరిపోయేది. ఏడాది క్రితం వరకు జిల్లాలోని గ్రామీణ తాగునీటి పథకాలకు విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదికి రూ.16 కోట్ల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ చెల్లించేది. ఇదిలావుండగా... పది నెలల క్రితం విద్యుత్ చార్జీలను భారీగా పెంచి సర్కారు ఖజానాను సుసంపన్నం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భావించారు. చార్జీలను పెంచడానికి అనుమతించాలని ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ మండలి)కి ప్రతిపాదనలు చేశారు. వీటిపై ఈఆర్సీ ఆమోదముద్ర వేయడంతో 2013 మార్చి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో గ్రామీణ తాగునీటి పథకాలకు 45 పైసల చొప్పున సరఫరా చేసే యూనిట్ విద్యుత్ ధరను ఏకంగా రూ.4కు పెంచారు. అయితే...ఆ మేరకు పథకాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ ఏడాది తాగునీటి పథకాలకు విద్యుత్ చార్జీల రూపంలో రూ.75 కోట్లను చెల్లించాలని సీపీడీసీఎల్ అధికారులు ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌కు నోటీసులు జారీ చేశారు. ఇందులో కిందా మీద పడి రూ.64 కోట్లను చెల్లించారు. మిగిలిన రూ.11 కోట్లను చెల్లించాలంటూ సీపీడీసీఎల్ ఎప్పటికప్పుడు అల్టిమేటం జారీ చేస్తూనే ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు నిధులు కేటాయించాలని పదే పదే ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రస్తుతం పనిచేస్తోన్న పథకాలకు తోడు వచ్చే ఏడాది మరో 1,048 గ్రామాలకు నీటిని సరఫరా చేసే పథకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతమున్న చార్జీలనే కొనసాగిస్తే ఏడాదికి రూ.125 కోట్ల మేర విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటాయించని పక్షంలో పథకాలు మూలనపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.