నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: మైనర్, మేజర్ పంచాయతీలలో తాగునీటి ఫథకాలకు, వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ చార్జిలను ప్రభుత్వమే నేరుగా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో చెల్లిస్తూ ఉండటంతో పల్లెలు విద్యుత్ భారం నుంచి తప్పించుకునేవి. ఇప్పుడు పల్లెల్లోని ప్రతి వీధిలో ఉండే స్తంభానికి లై టు ఏర్పాటు చేయాలన్నా చిన్న పంచాయతీలు ఆలోచించాల్సిందే. కారణం ఇప్పటి వరకు పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
13వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ(రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధుల నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించాలని, ఇక మీదట పంచాయతీలే విద్యుత్ చార్జిలను ఎప్పటికప్పుడు చెల్లించాలని మెమో నెం.8181/సీపీఆర్,ఆర్‌ఈ/ యాక్ట్స్.ఐ(2) 2013 ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థలకు నిధులు లేకుండా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చార్జిలను మళ్లీ పాత పద్ధతిలో పంచాయతీలే చెల్లించాలని పేర్కొనడంతో నిధుల కొరతతో గ్రామాల్లో చీకటి వీధులు దర్శనమివ్వడం ఖాయమని పరిశీకులు పేర్కొంటున్నారు.
2009 నుంచి ప్రభుత్వమే చెల్లిస్తుంది
2008 సంవత్సరం వరకు విద్యుత్ బిల్లులను ఆ పంచాయతే చెల్లించుకునేది. ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు సరిగి నిధులు ఇవ్వకపోవడంతో ఒక స్థితిలో అనేక పంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోతే పల్లెలకు విద్యుత్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు లెటర్లు పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకొని 2009లో ఏకమొత్తంగా హైదరాబాద్ స్థాయిలోనే బకాయిలలో ఎక్కువ మేరకు చెల్లించింది. మళ్లీ 2011లో కూడా ఏక మొత్తంగా ప్రభుత్వమే చెల్లించింది.
జిల్లాలో విద్యుత్ శాఖకు బకాయి రూ.21 కోట్లు
జిల్లాలో మొత్తం 940 పంచాయతీలున్నాయి. వీటిలో 36 మేజర్ కాగా మిగిలిన 904 మైనర్ పంచాయతీలు. ఇప్పటి వరకు జిల్లాలో పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు సుమారు రూ.21 కోట్లు బకాయిలున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో ఈ పాతబకాయిలు చెల్లించడంతో పాటు ఇక నుంచి ప్రతినెలా విద్యుత్ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఉదయగిరి, మర్రిపాడు, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, కొండాపురం, రాపూరు తదితర మెట్ట ప్రాంత మండలాల్లోని గ్రామాలకు ఆదాయమార్గాలు శూన్యం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న పంచాయతీల అభివృద్ధికి కొంతమేరకు గండిపడినట్టే.
ఇది ప్రభుత్వ నిర్ణయం: జితేంద్ర, జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో
విద్యుత్ బకాయిలతోపాటు ఇక నుంచి ప్రతి నెలా బిల్లులు పంచాయతీలే చెల్లించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందులో తమ పాత్రేమి ఉండదు. కాబట్టి పంచాయతీలు ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతకాలి. ఆస్తిపన్ను సక్రమంగా వసూలు చేయాలి. విద్యుత్ పొదుపు పాటించాలి.
పల్లెకు షాక్
Published Sat, Dec 21 2013 3:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement