సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు గ్రామీణ తాగునీటి పథకాలకు గుదిబండగా మారనున్నాయా? సత్యసాయి, శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి వంటి తాగునీటి పథకాల నిర్వహణ సవాల్‌గా మారనుందా? విద్యుత్ చార్జీల పెంపు తాగునీటి పథకాలకు శాపంగా మారనుందా?... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. దేశంలోని దుర్భిక్ష ప్రాంతాల్లో జైసల్మీర్ తర్వాతి స్థానం మన జిల్లాదే. ఏడాదికి సగటున 552 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం కురవాల్సి ఉండగా... 400 మి.మీ కూడా కురవడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యల్లనూరు, పుట్లూరు, అమడగూరు, నల్లమాడ మండలాల్లో 92 గ్రామాలకు అన్ని కాలాల్లో ట్యాంకర్ల తో నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి నదీ జలాలను మళ్లించడం ఒక్కటే మార్గం. ఈ క్రమంలోనే సత్యసాయి, శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి వంటి తాగునీటి పథకాలను చేపట్టారు. జిల్లాలోని 1001 పంచాయతీల పరిధిలో 3,339 గ్రామాలున్నాయి. ఇందులో శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి, సత్యసాయి పథకాల ద్వారా 1,167 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి పథకాల విస్తరణతో పాటు ప్రస్తుతం చేపట్టిన పథకాల ద్వారా వచ్చే ఏడాది నుంచి మరో 1048 గ్రామాలకు తాగునీటిని అందించనున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. 2013 ఫిబ్రవరి వరకు గ్రామీణ తాగునీటి పథకాలకు యూనిట్ విద్యుత్‌ను 45 పైసలతో ప్రభుత్వం సరఫరా చేసేది.
పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగా కేటాయించే బడ్జెట్లో సింహభాగం విద్యుత్ చార్జీల చెల్లింపునకే సరిపోయేది. ఏడాది క్రితం వరకు జిల్లాలోని గ్రామీణ తాగునీటి పథకాలకు విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదికి రూ.16 కోట్ల చొప్పున ఆర్‌డబ్ల్యూఎస్ చెల్లించేది. ఇదిలావుండగా... పది నెలల క్రితం విద్యుత్ చార్జీలను భారీగా పెంచి సర్కారు ఖజానాను సుసంపన్నం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భావించారు. చార్జీలను పెంచడానికి అనుమతించాలని ఈఆర్‌సీ(విద్యుత్ నియంత్రణ మండలి)కి ప్రతిపాదనలు చేశారు. వీటిపై ఈఆర్‌సీ ఆమోదముద్ర వేయడంతో 2013 మార్చి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో గ్రామీణ తాగునీటి పథకాలకు 45 పైసల చొప్పున సరఫరా చేసే యూనిట్ విద్యుత్ ధరను ఏకంగా రూ.4కు పెంచారు.
అయితే...ఆ మేరకు పథకాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ ఏడాది తాగునీటి పథకాలకు విద్యుత్ చార్జీల రూపంలో రూ.75 కోట్లను చెల్లించాలని సీపీడీసీఎల్ అధికారులు ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌కు నోటీసులు జారీ చేశారు. ఇందులో కిందా మీద పడి రూ.64 కోట్లను చెల్లించారు. మిగిలిన రూ.11 కోట్లను చెల్లించాలంటూ సీపీడీసీఎల్ ఎప్పటికప్పుడు అల్టిమేటం జారీ చేస్తూనే ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు నిధులు కేటాయించాలని పదే పదే ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
ప్రస్తుతం పనిచేస్తోన్న పథకాలకు తోడు వచ్చే ఏడాది మరో 1,048 గ్రామాలకు నీటిని సరఫరా చేసే పథకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతమున్న చార్జీలనే కొనసాగిస్తే ఏడాదికి రూ.125 కోట్ల మేర విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటాయించని పక్షంలో పథకాలు మూలనపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి పథకాలకు ‘షాక్’
Published Mon, Dec 16 2013 2:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement