
తిరుపతి సెల్‌కాన్ తయారీ యూనిట్ ఆవరణంలో జరిగిన సభలో సెల్‌కాన్ మొబైల్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
♦ వీలైతే ఉన్న ఛార్జీలనూ తగ్గిస్తాం
♦ రాష్ట్రంలో 2.75 లక్షల కోట్లతో పరిశ్రమలు
♦ 813 పరిశ్రమలతో 6.17 లక్షల మందికి ఉపాధి
♦ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా తిరుపతి
♦ ఐవోటీ, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు
♦ నెల్లూరు, తిరుపతి, చెన్నైల మధ్య ‘ట్రై ఇండస్ట్రీ సిటీ’
♦ తిరుపతి ‘సెల్‌కాన్’ ప్లాంట్ ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, వీలైతే ఉన్న ఛార్జీలను కూడా తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా గణనీయమైన అభివృద్ధికి నాంది పలికింది తానేనని, ఐటీ, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్, జీఐసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలను తెచ్చి పరిశ్రమల అభివృద్ధికి ఇపుడెంతో కృషి చేస్తున్నానని చెప్పారు. త్వరలో క్లౌడ్, ఐవోటీ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామని చెప్పారాయన. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు ఎదురుగా రూ.150 కోట్ల పెట్టుబడితో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్‌కాన్ మొబైల్ ఫోన్ల ప్లాంట్‌ను చంద్రబాబు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూనిట్ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ఎంవోయూలు చేసుకున్న 813 కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవన్నీ ఏర్పాటయితే రూ.2,75,650 కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, వీటితో పాటు 6,17,691 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. చాలా పరిశ్రమలు ఫౌండేషన్, అప్రూవల్, సివిల్ వర్క్‌ల దశల్లో ఉన్నాయన్నారు. రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా రానున్న రోజుల్లో లక్ష మందికి ఉపాధి లభించే అవకాశాలు మెరుగయ్యాయన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్, ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి పరుస్తామన్నారు. 400 మిలియన్ యూఎస్ డాలర్ల విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయనీ, ఏర్పేడు కేంద్రంగా స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్ అభివృద్ధి జరుగుతుందని సీఎం అన్నారు.
ట్రై ఇండస్ట్రియల్ సిటీ...
నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల మధ్య ట్రై ఇండస్ట్రీస్ సిటీని అభివృద్ధి పరుస్తామన్నారు. శ్రీసిటీకి దగ్గరలోనే సిరామిక్ పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటికే కజారియా, ప్లోయిరా వంటి పరిశ్రమలు ముందుకొచ్చాయని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో హార్డ్‌వేర్ అంటే తిరుపతి గుర్తు రావాలన్నారు. ఇక్కడి ప్రాంతాన్ని స్పెషల్ ఎంప్లాయిమెంట్ జోన్‌గా అభివృద్ధి పరిచేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. ఈ ఏడాది హంద్రీనీవా నీటిని చిత్తూరు, కుప్పం వరకూ తెస్తామని పునరుద్ఘాటించారు. సొంత జిల్లాలో రూ.150 కోట్లతో సెల్‌కాన్ కంపెనీని నెలకొల్పి వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న సెల్‌కాన్ అధినేత వై. గురుస్వామినాయుడు, రేతినేని మురళిలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కంపెనీలో తయారైన తొలి సెల్‌ఫోన్‌ను ఆవిష్కరించారు.
రేణిగుంట ఈఎంసీలో లక్ష ఉద్యోగాలు...
2019 లోగా రేణిగుంట ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పరిధిలో లక్ష మందికి ఉద్యోగాలొస్తాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 2015 నవంబరులో తిరుపతి సెల్‌కాన్ యూనిట్‌కు శంకుస్థాపన జరిగిందనీ, ప్రభుత్వ సహకారం, సీఎం ప్రత్యేక చొరవ కారణంగా యూనిట్‌ను త్వరగా ఏర్పాటు చేయగలిగామని సెల్‌కాన్ ఛైర్మన్ వై. గురు చెప్పారు. ప్రస్తుతం నెలకు 5 లక్షల సెల్‌ఫోన్లు తయారవుతున్నాయనీ, భవిష్యత్తులో 20 లక్షల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రేణిగుంట సభ ముగిశాక సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్‌లో తొట్టంబేడు మండలం తాటిపర్తి వెళ్లి అక్కడ నూతనంగా ఏర్పాటు చేయనున్న కజారియా, ప్లోయినా, సుధా సిరామిక్ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుగుణమ్మ, ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్రూ పాల్గొన్నారు.