జెన్‌కోలో మరోసారి రివర్స్‌ టెండరింగ్‌ | Again Reverse Tendering In GENCO By AP Government | Sakshi
Sakshi News home page

జెన్‌కోలో మరోసారి రివర్స్‌ టెండరింగ్‌

Published Mon, Oct 21 2019 5:07 AM | Last Updated on Mon, Oct 21 2019 5:07 AM

Again Reverse Tendering In GENCO By AP Government - Sakshi

సాక్షి, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌లో ఏపీ జెన్‌కో మరో రికార్డు నమోదు చేసింది. బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషించే సూపర్‌ విజన్‌ కాంట్రాక్టులో రూ.23.30 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయగలిగింది. జెన్‌కో రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టడం ఈ నెలలో ఇది రెండోది. ఇటీవల ఒడిశాలోని తాల్చేరు నుంచి మహానది కోల్‌ ఫీల్డ్స్‌ (ఎంసీఎల్‌) బొగ్గు చేరవేత కాంట్రాక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.164 కోట్లు మిగిల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో సింగరేణి బొగ్గు రవాణా సూపర్‌ విజన్‌ కాంట్రాక్టులో సైతం విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి నుంచి ఏటా 90 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అందుతుంది. దీన్ని కడపలోని ఆర్టీపీపీ, విజయవాడలోని ఎన్‌టీటీపీఎస్‌ ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియలో బొగ్గు లోడింగ్, రవాణా సమాచారం, తూకం, పరీక్ష కోసం శాంపుల్స్‌ కలెక్షన్, రైల్వే వ్యాగన్ల ద్వారా వేగంగా ముందుకెళ్లేందుకు ఓ సంస్థను పర్యవేక్షణ కింద తీసుకుంటారు. ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా పిలిచిన ఈ కాంట్రాక్టుకు టెండర్లు దాఖలు చేసిన వారిలో ఆరు కంపెనీలు మాత్రం అన్ని అర్హతలు సంపాదించాయి. ఇందులో కరమ్‌చంద్‌ తాపర్‌ అండ్‌ బ్రాస్‌కోల్‌ సేల్స్‌ లిమిటెడ్, ఏకెఏ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లోక్‌నాథ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆనంద్‌ ట్రాన్స్‌పోర్ట్స్, నాయర్‌ కోల్‌ సర్వీస్‌ లిమిటెడ్, బీఎస్‌ఎన్‌ జోషి కంపెనీలున్నాయి. ఎన్టీటీపీఎస్‌కు టన్నుకు రూ.32 చొప్పున, ఆర్టీపీపీకి టన్నుకు రూ.34 చొప్పున కోట్‌ చేసిన నాయర్‌ కోల్‌ సర్వీసెస్‌ ఎల్‌–1గా నిలిచింది.

ఎల్‌–1 ధరతో రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టడంతో ఇదే సంస్థ ఎన్టీటీపీఎస్‌కు టన్నుకు రూ.17.50, ఆర్టీపీపీకి టన్నుకు రూ.23తో సరఫరా చేస్తామని దిగి వచ్చింది. ఈ లెక్కన విజయవాడ థర్మల్‌ కేంద్రానికి వచ్చే బొగ్గు సూపర్‌ విజన్‌ చార్జీలు టన్నుకు రూ.14.50 చొప్పున, లక్ష టన్నులకు రెండేళ్ల కాంట్రాక్టు కాలానికి రూ.14.50 కోట్లు ఆదా అయింది. అదే విధంగా ఆర్టీపీపీలో టన్నుకు రూ.11 చొప్పున 80 లక్షల టన్నులకు రెండేళ్లల్లో రూ.8.80 కోట్లు తగ్గాయి. రెండింట్లో కలిపి మొత్తం రూ.23.30 కోట్ల ప్రజాధనం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా అయింది.

పోటీ బాగా పెరుగుతోంది..
జెన్‌కో కాంట్రాక్టుల్లో పోటీ పెరుగుతోంది. ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల తక్కువ లాభాలతో పనులు చేసే వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా జెన్‌కోకు ప్రయోజనం కలుగుతోంది. ఎంసీఎల్‌ బొగ్గు రవాణా విషయంలోనూ ముందుకొచ్చే ప్రతి ఒక్కరికీ సరిపడా అర్హత ఉండేలా చూశాం. ఇప్పుడు సూపర్‌ విజన్‌కు కావాల్సిన వాస్తవ అర్హతలే పొందుపరిచాం. రివర్స్‌ టెండరింగ్‌లోనూ పోటీ బాగా కన్పిస్తోంది. 
– శ్రీధర్, జెన్‌కో ఎండీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement