మాకు మేమే బలం.. | Against forced land acquisition | Sakshi
Sakshi News home page

మాకు మేమే బలం..

Published Thu, Sep 24 2015 11:37 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

Against forced land acquisition

 బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం
  స్పష్టం చేసిన ఎయిర్‌పోర్టు బాధిత ప్రజలు

 భోగాపురం : మీ అధికారులందరికీ పోలీసులు బలమైతే... ఎయిర్‌పోర్టు బాధిత రైతులమైన మాకు మేమే బలం... మా అందరిదీ ఒకే గ్రామం.. ఎయిర్‌పోర్టు బాధిత గ్రామం.. మాదంతా ఒకేమాట... ఎయిర్‌పోర్టుకి మా భూములు ఇవ్వం... కాదని అధికారులు గ్రామాల్లోకొస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం అని ఎయిర్‌పోర్టు బాధిత రైతులు గ్రామస్తులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు, రైతులు అభిప్రాయాన్ని సేకరించేందుకు ఆర్డీఓ శ్రీనివాసమూర్తి సమావేశం ఏర్పాటు చేశారు.
 
 ఈ సమావేశంలో అధికారులు మోసపూరితంగా ప్రవర్తిస్తున్న తీరును రైతులంతా ఎండగట్టారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిబ్బంది తెల్లమొహం వేశారు. ముందుగా రైతులు చెప్తున్న అభ్యంతరాలని ఆర్‌డీఓ నోట్ చేసుకున్నారు. దీనిపై కలెక్టరుతో చర్చిస్తామన్నారు. మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలే తప్ప గ్రామాల్లోకి వచ్చిన అధికారులను అడ్డుకోవడం తగదని ఆర్డీఓ సూచించారు. ఈనెల1న నోటిఫికేషన్ ఇచ్చారు. మేమ అభ్యంతరాలు చెప్పడానికి 60 రోజుల వ్యవధి ఉంది.
 
  ఇంతలో మీరు ఎందుకు పోలీసుల బలగాలతో గ్రామాల్లోకి వస్తున్నారు. మీరెందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కాకర్లపూడి శ్రీనివాసరాజు ప్రశ్నించారు. అలాగే గూడెపువలసకి చెందిన డి.బి.వి.ఎల్.ఎన్ రాజు అనే రైతు సమాచార హక్కుచట్టం కింద ఎయిర్‌పోర్టు వివరాల కోసం దరఖాస్తు చేస్తే ఎయిర్‌పోర్టు సర్వే వివరాలు గాని, రైట్స్ సంస్థ సాంకేతిక నివేదిక గాని ఇవ్వలేదని, అలాంటప్పుడు ఒకటో తేదీన నోటిఫికేషన్ ఎలా ఇచ్చారన్నారు. అధికారులకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రజలకి ఎందుకు రక్షణ కల్పించడంలేదని  దాట్ల శ్రీదేవి వర్మ ప్రశ్నించారు. మమ్మల్ని చర్చలకి రమ్మని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చోబెట్టి ముగ్గురు ఉప కలెక్టర్లను గ్రామాల్లోకి ఎందుకు పంపించారని ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు.
 
  అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పిన ఆర్డీఓ ఈ సందర్భంగా సారీ చెప్పారు.  రైతులు ఇష్టపడితేనే ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి అశోక్ గతంలో పలుమార్లు చెప్పారని, అలాంటిది ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తున్నా ఎందుకు పనులు చేపడుతున్నారని ఉప్పాడ శివారెడ్డి, తదితరులు ప్రశ్నించారు.  దీనికి ఆర్డీఓ స్పందిస్తూ డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ దీనబంధు, ఉప కలెక్టర్లు శ్రీలత, బాలాత్రిపురసుందరి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement