సోదరిపై అత్యాచారానికి యత్నించిన అన్న అరెస్టు
Published Sun, Oct 20 2013 2:35 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
భోగాపురం, న్యూస్‌లైన్: అన్నంటే రక్షణకు మారుపేరు. కష్టసుఖాల్లో తోడుగా, రక్షణగా ఉంటాడనేందుకు గుర్తుగా ప్రతి సోదరి తన తోడబుట్టినవాడికి రాఖీ కడుతుంది. అటువంటి అన్నే కీచకుడిగా మారాడు. ఉన్మాదయ్యాడు. బావలేని సమయంలో ఇంట్లో ప్రవేశించి చెల్లెలిపై అఘాయిత్యానికి యత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం గుడివాడకు చెందిన అప్పలరెడ్డి సైన్యంలో పనిచేశాడు. అతనికి మేనమామ కుమార్తెతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు విధుల నుంచి అతన్ని సస్పెండ్ చేయడంతో గుడివాడ చేరుకున్నాడు. విపరీతంగా తాగుతూ నిత్యం వేధిస్తుండడంతో భార్య ఆ ఊరిలోనే ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అప్పల రెడ్డి చెల్లెలు వదినకు అండగా ఉండేది.
దీంతో చెల్లెలు, బావపై కూడా అప్పలరెడ్డి కోపం పెంచుకున్నాడు. బావ కేబుల్ కనెక్షన్లు నిర్వహిస్తుంటాడు. బావ,చెల్లెలి మీద కోపంతో నిత్యం ఆ వైర్లను కత్తిరించేవాడు, తన పిల్లలు కనిపిస్తే వారి పట్ల క్రూరంగా ప్రవరించేవాడు. నిత్యం తాగుతూ ఉన్మాదిగా ప్రవర్తించేవాడు. ఊరిలో వారితో గొడవలు పడేవాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య తరఫువారు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు తీవ్రంగా హెచ్చరించడంతో మరింత కోపం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన గొడవలో చెల్లెలి పట్ల అమానుషంగా మాట్లాడాడు. ఏ అన్నా తన సోదరితో అనని విధంగా మాట్లాడాడు. అయితే గ్రామస్తులు కలుగజేసుకోవడంతో అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది.
కోపం, ఉన్మాదం కారణంగా చెల్లెలిని శారీరకంగా లొంగదీసుకునేందుకు చాలాసార్లు యత్నించాడు. అయితే ఆమె తన అన్నసంగతిని బయటవారికి చెప్పుకోలేక మనస్తాపానికి గురయ్యేది. ఈనెల 17న రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసేసరికి ఇంట్లో చొరబడి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగులుతీసింది. ఈ మేరకు బాధితురాలు అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కృష్ణ కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టుచేసి శనివారం కోర్టుకు తరలించారు.
Advertisement