నేటి నుంచి ఉపాధ్యాయుల సమ్మె
Published Thu, Aug 22 2013 1:37 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజాఉద్యమంలో గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులూ భాగస్వాములు కానున్నారు. 13 జిల్లాల ఉపాధ్యాయ జేఏసీ నిర్ణయం మేరకు విధులు బహిష్కరించి సమైక్య గళం వినిపించేందుకు జిల్లాలో టీచర్లు సన్నద్ధమయ్యారు. దీంతో గురువారం నుంచి కనీసం 50 శాతం ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కో-కన్వీనర్ కేఎస్ జవహర్ మాట్లాడుతూత గురువారం నుంచి ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఉపాధ్యాయులు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో సుమారు 50 శాతం మంది ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, దశలవారీగా ప్రజల ఒత్తిడిమేరకు ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో సుమారు 3వేల ప్రాథమిక పాఠశాలలు, 200 ప్రాథమికోన్నత పాఠశాలలు, 450 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
ఎంసెట్ ఆప్షన్లు వాయిదా
ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పోలీసుల సహకారంతో కొనసాగిస్తున్న ప్రభుత్వం కాలేజీ ఎంపిక షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసింది. ఈనెలాఖరు వరకు సర్టిఫికెట్ల పరిశీలన మాత్రం చేయాలని భావిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకులు కూడా విధులకు హాజరుకాకపోవటం, కొన్ని జిల్లాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ సక్రమంగా జరగకపోవటం తో గత్యంతరం లేనిస్థితిలో గురువారం నుంచి ప్రారంభిం చాల్సిన ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
27నుంచి సెకండరీ ప్రధానోపాధ్యాయుల సమ్మె పెదపాడు, న్యూస్‌లైన్ : సెకండరీ ప్రధానోపాధ్యాయులు ఈనెల 27నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు సెకండరీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దేవినేని వెంకటరమణ, కె.నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలని రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు.
Advertisement
Advertisement