
కలెక్టర్ అవుతాడనుకుంటే... కానరాని తీరాలకు..
♦ జంఝావతి రిజర్వాయర్‌లో పడి ఏజీబీఎస్సీ విద్యార్థి మృతి
♦ ప్రమాదం నుంచి బయటపడ్డ మరో నలుగురు
♦ కన్నకొడుకు మృతి వార్త విని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
♦ సెలవులకోసం వచ్చి శవమవుతాడను కోలేదని రోదన
చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. ఎప్పటికైనా కలెక్టర్ అవుతానని చెబితే ఎంతో మురిసిపోయారు. తల్లిదండ్రులు లేని ఓ మిత్రుడిని తీసుకొచ్చి అన్నలా ఉంచుకుందామంటే కాదనలేకపోయారు. కుమారుడి ఎదుగుదలతో వారి కలలు తీరుతాయని సంబరపడ్డారు. మరో మూడు రోజుల్లో తాను చదువుకుంటున్న పంజాబ్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంటే తనకు సహకరించారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లి వస్తామంటే సరేనన్నారు. కానీ విధి వారి ఆనందాన్ని ఎంతోకాలం నిలవనీయలేదు. వారి ఆశలు తీర్చకుండానే ఆ కొడుకును మృత్యురూపంలో తీసుకుపోయింది. జంఝావతిలో పడి మృతి చెందాడన్న వార్తతో వారి కలలు కల్లలయ్యాయని గొల్లుమన్నారు.
పార్వతీపురం టౌన్/కొమరాడ: పార్వతీపురం మండలం ములగ గ్రామానికి చెందిన తాన్న రామకృష్ణ, అరుణ దంపతుల కుమారుడు తాన్న ప్రవీణ్‌కుమార్(19) ఏజీబీఎస్సీ నాల్గవ సంవత్సరం పంజాబ్‌లోని లౌలీ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ప్రస్తుతం వీరు పార్వతీపురం జనశక్తి కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ సెలవులకు ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ నెల 10వ తేదీన తిరిగి వెళ్లిపోయేందుకు ఫ్‌లైట్ టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్నాడు. గురువారం సాయంత్రం స్నేహితులతో కలసి అలా తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. స్నేహితులైన గొడబసాయి, అంబటి హరీష్, ఆదిమూలం సాయిభరత్, మజ్జి విశాల్‌తో కలసి కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం వద్ద ఉన్న జంఝావ తి రబ్బర్ డ్యామ్ వద్దకు వెళ్లారు. డ్యామ్ దిగువన ఈత కొట్టేందుకు వెళ్లిన ఆ ఐదుగురు ఓ గుంతలో పడిపోయారు. గుంతలోతుకు కూరుకుపోతున్న వారిలో గొడబ సాయి తోటి మిత్రులైన హరీష్, సాయిభరత్, విశాల్‌లను రక్షించాడు. ఇంతలో ప్రవీణ్ పూర్తిగా మునిగిపోయాడు.
సంఘటనాస్థలానికి అధికారులు
విషయం తెలుసుకున్న ఆర్డీఓ సుదర్శన దొర, అగ్నిమాపక సిబ్బంది, పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. చాలా సేపు అగ్నిమాప శాఖ సిబ్బంది గాలించినా ఫలితం కనిపించలేదు. చివరకు పక్క గ్రామానికి చెందిన ఓ ఈతగాడికి ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. బయటకు తీసి వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కన్నీరు మున్నీరైన కన్నవారు
విషయం తెలుసుకున్న కన్నవారు ఆస్పత్రికి చేరుకుని గొల్లుమన్నారు. బాగా చదువుకోవాలి... ఎలాగైనా కలెక్టర్ కావాలి. మన కుటుంబంలో ఎవరూ కలెక్టర్ అవ్వలేదు. నేను కష్టపడి చదువుతాను... కలెక్టర్ అవుతాను... అని ఎప్పుడూ తల్లిదండ్రులకు చె ప్పే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడంతో వారంతా కన్నీరు మున్నీరై విల పించారు. ప్రవీణ్ అక్క సుధారాణి యూరఫ్‌లో ఉంటున్నారు.
స్నేహితుడినే సోదరునిగా భావించి...
ప్రవీణ్‌కుమార్ పంజాబ్‌లో లౌలీ యూనివర్శిటీలో చదువుతున్న చోట ప్రసన్న అనే స్నేహితుడు పరిచయమయ్యాడు. అతని తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ప్రసన్న తనకు ఎవరూలేరని మనస్తాపం చెంది తిరుపతి కొండకు వెళ్లి అక్కడ వెంకన్నను దర్శించుకుని కొండపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరిసారిగా స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పా డు. అది విన్న ప్రవీణ్ చలించిపోయాడు. తనను చనిపోవద్దని... తనకు అన్నలా ఉండాలనీ... ఒప్పించి ఆత్మహత్యనుంచి విరమింపజేశాడు. ఆ తరువాత ఆ స్నేహితుడిని ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పటినుంచి ప్రసన్న తరచూ పార్వతీపురం వస్తూ పోతున్నాడు. ఆయన ఫీజులు కూడా ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులే కడుతున్నారు. తాను చనిపోతానని ముందే తెలిసి ప్రసన్నను తమకు అప్పగించావా అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు అక్కడివారిని కదిలించేసింది.