అనంతపురం కల్చరల్: రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోతున్న గిరిజనులు రాజ్యాధికారమే లక్ష్యంగా ఐక్యంగా ఉద్యమించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు. జీవీఎస్ ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్ ప్రాంగణంలో శుక్రవారం రాజ్యాధికార భారీ బహిరంగ సభ నిర్వహించారు. జీవీఎస్ రాయలసీమ కన్వీనర్ మల్లికార్జున నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరామ్‌నాయక్, జీవీఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు నాగరాణి, సోనాబాయి, ఎంపీపీ వెంకటమ్మబాయి, ఎస్కేయూ అధ్యక్షులు నారాయణస్వామి, సురేష్‌నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణస్వామి నాయక్ శ్రీనానాయక్, ఎంఆర్‌పిఎస్ నాయకులు శంకర్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్రంగా స్పందించారు. దశాబ్దాలుగా గిరి జనులు ఓట్లువేసేందుకే పరిమితం కాగా ఓట్లు వేయించుకున్న వారు పాలకులుగా మారి పదవుల్లో ఊరేగుతూ తమను అణగదొక్కుతున్నారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలనిచ్చి ఏ ఒక్కదానిని నెరవేర్చకుండా గిరిజనులను మోసం చేసారని వి మర్శించారు.
గిరిజన విద్యార్థులు చాలా చోట్ల కూలీలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 500 జనాభా కల్గిన బంజారా తండాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని తీర్మానించినా అనంతరం వచ్చిన నేతలు దానిని పట్టించుకోలేదన్నారు.రాష్ట్రాలలో పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని, జిల్లాలో గిరిజనులకు 2 ఎమ్మెల్యే, ఒకటి చొప్పున ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ,ఎస్సీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
సదస్సులో ప్రజా కళాకారుడు బిక్షు నాయక్ బృందం బంజారా పాటలతో ఆహూతులను అలరించారు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమ జిల్లాలు, రాష్ట్రాల నుంచి విచ్చేసిన గిరిజన తండాల యువత, మహిళలతో ప్రాంగణం కిటకిటలాడింది. కార్యక్రమంలో మణికంఠనాయక్, గనే నాయక్, ప్రభాకర్ నాయక్, చంద్రానాయక్, సాకే పవన్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
Published Sat, Feb 28 2015 1:24 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement