
పల్లె కంట తడి
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతుల ఆవేద న అనంతం
సీఎం ప్రకటించిన భూ సమీకరణ ప్యాకేజీపై తీవ్ర అసంతృప్తి
చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం
భూ సమీకరణకు మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పూర్తి వ్యతిరేకత
గుంటూరు: పల్లెలు కంటతడి పెడుతున్నాయి. రైతుల ఆవేదన వర్ణనాతీతం. కౌలు రైతుల పరిస్థితి మరీ అగమ్యగోచరం. రైతు కూలీలు రోడ్డుపాలవుతున్నారు. ఇదీ రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో పరిస్థితి. రాజధాని భూ సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీ పట్ల ఆయా గ్రామాల రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవు తోంది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములు లాక్కొని భిక్షం వేసినట్టు వెయ్యి గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రా మాల్లో ప్రభుత్వం భూ సమీకరణ చేయనుంది. మొదటి నుంచి కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని రైతులు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. సెంటు భూమి ఇచ్చేది లేదని, ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అనేక మంది రైతులు కేబినెట్ సబ్ కమిటీ ఎదుట ప్రకటించారు.
తుళ్ళూరు మండలం రాయపూడి, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామ పంచాయతీలు భూ సమీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి పంపాయి. జరీబు భూములు కలిగిన రైతులకు ఎకరాకు వెయ్యి చదరపు గజాల నివాస స్థలం, 300 గజాల వాణిజ్య భూమి ఇస్తామన్నా ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు.
సాగునీటి వసతి తక్కువగా ఉన్న దొండపాడు, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను గ్రామాల రైతులు భూ సమీకరణకు సానుకూలంగా స్పంది ంచారు. వీరికి వెయ్యి చదరపు గజాల స్థలం, 200 గజాల వాణిజ్య భూమి ఇస్తున్నారు. వీరిలో కొం దరు రైతులు ఇంకా ప్యాకేజీ పెంచాలని, వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరుతున్నారు.అసైన్డ్ భూములు కలిగిన రైతులకు ఎకరాకు 800 చదరపు గజాల స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నారు.
మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రైతులు భూ సమీకరణకు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. విజయవాడకు సమీపంలో ఈ మండలాలు ఉండటంతో ఎకరా భూమి రూ.5 కోట్లకుపైగానే ఉంది. రుణమాఫీయే చేయలేని ముఖ్యమంత్రి రాజధాని భూములకు పరిహారం చెల్లిస్తారంటే ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని ఏపీకా..సింగపూర్‌కా..
రాజధానిలో భూములు కోల్పోతున్న రైతులతో సీఎం చంద్రబాబు మరోసారి చర్చిస్తానని చెప్పి మోసం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రైతులతో హైదరాబాద్‌లో సమావేశమైనప్పుడు కూడా చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదని గుర్తుచేసుకుంటున్నారు.
నిన్నటి వరకు ఇక్కడి రైతులతో చర్చిస్తానని చెప్పిన చంద్రబాబు సింగపూర్ నుంచి మంత్రి వచ్చేసరికి హడావుడిగా ప్యాకేజీ ప్రకటించారని రైతులు వాపోతున్నారు. అసలు రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమా, సింగపూర్‌కా అని మండిపడుతున్నారు.
పురుగుల మందుతాగి చస్తే అర్థమవుతుందేమో..
పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో రైతులంతా ఎకరం, అర ఎకరం ఉన్నవాళ్లే. మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు. మాకున్న భూమిని తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకొచ్చాను. ముఖ్యమంత్రి ఇచ్చే ప్యాకేజీతో ఇల్లు గడుపుకోవాలా, పిల్లలను చదివించుకోవాలా? అర్థం కావడం లేదు. రేపో మాపో ఏదో దేశం నుంచి కమిటీ వస్తుందంటా, వారి ముందు పురుగుల మందు తాగి రైతులు చస్తే వారికి మా పరిస్థితి అర్థమవుతుందేమో.?
-అంజిబాబు, రైతు, ఉండవల్లి
బాబుపై నమ్మకం లేదు..
రైతుల రుణమాఫీయే ఇంత వరకు చేయని చంద్రబాబు రాజధాని భూములకు పరిహారం చెల్లిస్తారనే నమ్మకం రైతుల్లో లేదు. అసలు రాజధాని నిర్మాణానికి మా పంట భూములే ఇవ్వబోమంటే పరిహారం విషయం ఎందుకు?
-లేళ్ల అంజియ్య, రైతు, యర్రబాలెం
భూముల కౌలు ఏప్రిల్‌లో చెల్లించాలి...
భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చే కౌలు ప్రతి ఏడాది ఏప్రిల్‌లో పంపిణీ చేయాలి. దీంతో పిల్లల ఫీజులకు, కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఇబ్బందులు తొలగించాలి. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసు కోవాలి. కమర్షియల్ స్థలాన్ని పెంచితే బాగుండేది.
- దొడ్డా వేణు, రైతు, తుళ్లూరు.
విధి విధానాలు మాకొద్దు..
రాజధాని నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధి విధానాలు మాకొద్దు. తాత, ముత్తాతల నుంచి భూములు సాగు చేసుకుంటున్నాం. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. -భీమిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు, నిడమర్రు