చీమకుర్తి, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టం అందకపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటివాటితో సతమతమవుతున్న జిల్లా రైతాంగంపై విద్యుత్‌శాఖ మరో పిడుగు వేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై రైతుల నుంచి ఏకంగా గత తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలు వసూలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు రైతులకు నోటీసులు కూడా అందిస్తోంది. వేల రూపాయల్లో కస్టమర్ చార్జీలు చెల్లించాలంటూ ఒక్కసారిగా నోటీసులు అందించడంతో రైతులు గొల్లుమంటున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లుల బకాయిలను రద్దు చేశారు. అనంతరం నెలవారీగా తమ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు బిల్లులను రైతులు చెల్లించుకుంటున్నారు.
అయితే, కస్టమర్ చార్జీలు మాత్రం చెల్లించడం లేదు. అప్పట్లో ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుండటంతో విద్యుత్ అధికారులు కూడా వారినుంచి కస్టమర్ చార్జీలు వసూలు చేసేందుకు చర్యలు చేపట్టలేదు. అయితే, కొంతమంది రైతులు మాత్రం ప్రతినెలా విద్యుత్ బిల్లులతో పాటు కస్టమర్ చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. అలా చెల్లించని రైతులను ఇప్పటి వరకూ ప్రశ్నించకుండా చూసీచూడనట్లు వ్యవహరించిన విద్యుత్ శాఖాధికారులు.. ఒక్కసారిగా తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలు వసూలు చేసేందుకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. గత రెండేళ్లుగా అప్పుడప్పుడూ రైతుల గృహాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులకు లింకుపెట్టి వారి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలను వసూలు చేశారు. అయితే, కొన్నిచోట్ల రైతుల నివాసాలు ఒక గ్రామంలో, పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మరో గ్రామం పరిధిలో ఉంటుండటంతో పూర్తిస్థాయిలో వసూలు చేయడం కుదరలేదు. దీంతో తొమ్మిదేళ్లుగా కస్టమర్ చార్జీలు చెల్లించని రైతులందరికీ నోటీసులు అందజేసి వసూలు చేసేందుకు విద్యుత్‌శాఖాధికారులు చర్యలు చేపట్టారు. 2004 నుంచి నెలకు 20 రూపాయల చొప్పున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కస్టమర్ చార్జీలు విధిస్తూ నోటీసులు అందజేస్తున్నారు. దాని ప్రకారం ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలు 2,000 రూపాయలకుపైగా ఉన్నాయి.
జిల్లాలో 1.15 లక్షల కనెక్షన్లకు రూ.6.76 కోట్లు...
జిల్లాలో 1.15 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వాటికి సంబంధించి కస్టమర్ చార్జీల పెండింగ్ బకాయిలు 6.76 కోట్ల రూపాయలున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ తెలిపారు. చీమకుర్తి మండలంలోని 23 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీలో దాదాపు 3 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా, వాటికి సంబంధించిన కస్టమర్ చార్జీలు 30 లక్షల రూపాయల వరకూ ఉన్నాయి. వాటిని వసూలు చేసేందుకు చీమకుర్తి మండలంలో లైన్‌మన్లు శుక్రవారం రైతులకు నోటీసులు జారీ చేశారు. చీమకుర్తి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 1,449 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నుంచి 16 లక్షలు, మర్రిచెట్లపాలెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 1,600 వ్యవసాయ విద్యుత్ క నెక్షన్ల నుంచి 14 లక్షల రూపాయల వరకు కస్టమర్‌చార్జీలు వసూలు చేసేందుకు ఆ శాఖాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ మేరకు చండ్రపాడులో 100 మంది రైతులకు, పల్లామల్లిలో 200 మందికి, నేకునంబాద్‌లో 80 మంది రైతులకు శుక్రవారం లైన్‌మన్లు నోటీసులు జారీ చేశారు. కాగా, ఎప్పటికప్పుడు వసూలు చేయకుండా తొమ్మిదేళ్లకు సంబంధించిన కస్టమర్ చార్జీలను ఒకేసారి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంపై రైతులు మండిపడుతున్నారు.
అన్నదాతపై మరో పిడుగు
Published Sat, Dec 14 2013 5:26 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement