‘రుణ బకాయి మొత్తం వడ్డీతో సహా చెల్లించేసినా మా బంగారు ఆభరణాలు మాకెందుకివ్వరు..? మా సొత్తు మాకివ్వడానికి అడ్డంకేమిటి? ఇలాంటి విడ్డూరం ఎక్కడా చూడలేదు. రైతులంటే మీకు మరీ అంత చులకనా.. లేనిపోని కొర్రీలు పెడుతూ మాతో ఆడుకుంటారా... ఎలా ఇవ్వరో చూస్తాం.. మా బంగారం మాకిచ్చే వరకు ఇక్కడ నుంచి కదలబోం’ అంటూ రైతులు బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాకీ కింద డబ్బు జమ చేసుకుని హామీగా ఉంచిన బంగారం తిరిగిచ్చేందుకు నిబంధనలు సాకు చూపుతున్న మేనేజరుపై నిప్పులు చెరిగారు. బ్యాంకు వద్దే బైఠాయించి, అధికారుల మెడలు వంచి మరీ అనుకున్నది సాధించుకున్నారు.
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన పచ్చల నరేష్ 2012లో తన తండ్రి పట్టాదారు పాస్‌పుస్తకాన్ని ప్రత్తిపాడులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో పెట్టి రూ.1.9 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. బ్యాంకులో పెట్టిన ఆభరణాలు అవసరం కావడంతో శుక్ర వారం రుణ బకాయి చెల్లించి, బంగారం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. వడ్డీతో కలిపి మొత్తం రూ.2,36,178 అయిందని, రుణమాఫీ కింద మీ ఖాతాకు ప్రభుత్వం జమచేసిన రూ.30 వేలు పోను ఇంకను రూ. 2,06,178 చెల్లిస్తే సరిపోతుందని బ్యాంకు ఉద్యోగి కంప్యూటర్‌లో లెక్క చూసి చెప్పాడు.
దీంతో నరేష్ ఆ మొత్తం చెల్లించేశాడు. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. డబ్బు జమ చేసుకున్న తర్వాత ఆభరణాలు ఇప్పడు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పడంతో నరేష్ నోరెళ్లబెట్టాడు. రుణమాఫీ అయినట్లు పట్టాదారు పాస్‌పుస్తకంలో నమోదు చేయాల్సి ఉంటుందని, అదికూడా లేకపోతే ఎల్‌ఈసీ కార్డులో అయినా నమోదు చేసిన తరువాతే ఆభరణాలు ఇస్తామని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. చెప్పినంత నగదును కట్టాంకదా? బంగారం ఇవ్వడానికి మళ్లీ ఇప్పుడు ఈ రూల్సేంటంటూ నరేష్ ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. బాధితుడు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని స్థానిక రైతులకు వివరించాడు.
తప్పు మీది శిక్ష మాకా..?
శనివారం గ్రామానికి చెందిన పలువురు రైతులు నరేష్‌కు మద్దతుగా బ్యాంకుకు వచ్చారు. మేనేజర్‌తో మాట్లాడారు. రుణం చెల్లించినా బంగారం ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఏ బ్యాంకులోనూ లేనివిధంగా రకరకాల కొర్రీలను పెడుతూ రైతులతో ఆటలాడుకుంటారా అని ప్రశ్నించారు. రైతులంటే ఇంత చులకనా.. ఇష్టం వచ్చినట్టు మీ చుట్టూ తిప్పుకుంటున్నారంటూ ఓ రైతు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దీనికి మేనేజర్ బదులిస్తూ అసలు లెక్క ప్రకారం నరేష్‌కు రుణమాఫీకి అర్హతలేదని, మా వాళ్లు డాక్యుమెంటేషన్ సమయంలో తప్పుగా ఎంటర్ చేయడం వలన నరేష్‌కు రుణమాఫీ వర్తించిందని, లేదంటే వాళ్ల నాన్నకు వర్తించేదని సమాధానం చెప్పారు. బంగారం ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదని చెప్పడంతో రైతులు మరింత ఆగ్రహోద్రక్తులయ్యారు.
మీరు చేసిన తప్పుకు మేమెందుకు ఇబ్బందులు పడాలంటూ నిలదీశారు. బంగారం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ భీష్మించి మేనేజర్ గదిలోనే బైఠాయించారు. కొందరు ప్రధాన ద్వారం గేట్లు మూసివేసి బ్యాంకు ఎదుట బైఠాయించారు. పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన మేనేజర్ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. వారి సూచనల మేరకు నరేష్ తండ్రి రామారావు నుంచి భవిష్యత్‌లో నాకు ఎలాంటి రుణమాఫీ అవసరం లేదంటూ లేఖ రాయించుకుని బంగారు ఆభరణాలు నరేష్‌కు ఇచ్చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
అన్నదాతంటే అలుసా..?
Published Sun, Feb 8 2015 4:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement