
వ్యవసాయ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
ఆత్మహత్యకు పాల్పడిన పత్తికొండ ఏడీఏ
కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్
కర్నూలు(అగ్రికల్చర్): ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఓ ఉద్యోగి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పత్తికొండ వ్యవసాయ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్(41) సోమవారం సాయంత్రం కర్నూలు కలెక్టరేట్ పరిసరాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..కర్నూలు నగరంలోని బంగారుపేటకు చెందిన మురళీధర్ పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
అయితే నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మద్యం సేవించి తన బాధను జేడీఏతో చెప్పుకునేందుకు సోమవారం కర్నూలుకు వచ్చాడు. అయితే అతని కండీషన్ బాగలేకపోవడంతో అధికారులు ఇప్పుడు వద్దు.. తర్వాత వచ్చి కలువు... అంటూ వెనక్కి పంపారు. బయటకు వచ్చిన అతను కలెక్టరేట్ మెయిన్‌గేట్ పక్కనే ఉన్న కర్నూలు ఏడీఏ ప్రాంగణంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న మోనోక్రోటోఫాస్ క్రిమీ సంహారక మందు తాగాడు. గమనించిన కార్యాలయ సిబ్బంది మురళీధర్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా క్యాజువాలిటీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మురళీధర్ మృతదేహానికి జేడీఏ ఠాగూర్‌నాయక్, పలువురు వ్యవసాయాధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అధికారుల వేధింపులే కారణమా..?
మురళీధర్ ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో మూడు నెలలుగా సిబ్బంది మధ్య వివాదం నెలకొనడంతో జీతాలు అందడం లేదు. నాటి ఏడీఏ నారాయణ నాయక్, సీనియర్ అసిస్టెంట్ రాంబాబులను జేడీఏకు సరెండర్ చేశారు. ఏడీఏ బాధ్యతలు దేవనకొండ వ్యవసాయాధికారికి అప్పగించారు. సరెండర్ అయిన సీనియర్ అసిస్టెంట్ రాంబాబు మాత్రం ప్రతిరోజు యథావిధిగా కార్యాలయానికి వస్తూ హాజరు పట్టీలో సంతకాలు చేస్తూ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్‌ను వేధింపులకు గురిచేసేవాడు.
దీంతో మానస్తాపానికి గురైన జూనియర్ అసిస్టెంట్ రాంబాబుపై ఇన్‌చార్జ్ ఏడీఏ శేషాద్రితో పాటు జేడీఏ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు సీనియర్ అసిస్టెంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రాంబాబు ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో తనను బదిలీ చేయాలని సోమవారం జేడీఏను కోరగా ఆయన పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హోంగార్డ్ బలవన్మరణం
ఆళ్లగడ్డటౌన్: పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ లక్ష్మికాంతరెడ్డి (29) సోమవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణం పొందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన లక్ష్మికాంతరెడ్డికి ఆరేళ్ల క్రితం యాంగంటిపల్లె గ్రామానికి చెందిన తులశమ్మతో వివాహం చేశారు. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు. అనంతరం పట్టణంలోని రామాలయం వీధిలోని ఓ ఇంటిని బాడుగకు తీసుకుని అమ్మ కర్ణశ్రీదేవితో కలిసి ఉంటున్నాడు.
సోమవారం ఉదయం తల్లి పనిమీద బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న లక్ష్మికాంతరెడ్డి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన కర్ణశ్రీదేవి ఇరుగు పొరుగు వారి సహాయంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించింది. అయితే పరిస్థితి విషమంగా మారడంతో నంద్యాల వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ కోలుకోలేక మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. లక్ష్మికాంతరెడ్డి భార్య బంధువులు పొలం రాసి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.