ఒంగోలు : తమకు న్యాయం చేయాలని కోరుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఐదవ నెంబర్ జాతీయ రాహదారిపై అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం ధర్నాకు దిగారు. ఇంత మంది బాధితులను మోసం చేసిన యాజమాన్యానికి ప్రభుత్వం కొమ్ముకాస్తుందని బాధితులు ఆరోపించారు.
తమకు నగదు తిరిగి ఇవ్వకుండా .. వారి భూములను స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. దీంతో జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి బాధితులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.