ప్చ్.. ట్రిపుల్ ఐటీ
- ఫలితాలు అంతంతే
- 69శాతమేఉత్తీర్ణత
- కొంపముంచిన గణితం
పల్లెలోని పేద విద్యార్థులకు సైతం ప్రతిభావంతమైన విద్యనందించాలనే మహోన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్‌ఐటీల ప్రతిష్ట మసకబారిపోతోంది. ఫలితాలు రానురాను నిరాశాజనకంగా మరింత దిగజారిపోతున్నాయి.
నూజివీడు : ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ఫలితాల శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం ట్రిపుల్‌ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం కేవలం 69.2శాతంగా మాత్రమే ఉంది. అయితే మొదటి సెమిస్టర్ ఫలితాలతో చూస్తే ఉత్తీర్ణతాశాతం కొద్దిగా మెరుగైనట్టున్నా అనుకున్నంతస్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు.
పదోతరగతిలో మండలస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని 24గంటలు తమ దగ్గరే ఉంచుకుని, ఐఐటీల్లో అత్యంత ప్రతిభ కనబరరిచిన వారిని ప్రొఫెసర్లుగా నియమించి విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం సాధారణ ఇంజినీరింగ్‌గు కళాశాలల కంటే ఘోరంగా వస్తున్నాయి. 958మంది ఇంజినీరింగ్ ప్రథమసంవత్సర విద్యార్థులు ఏప్రిల్ నెలలో సెమిస్టర్ పరీక్షలు రాయగా వీరిలో 663మంది మాత్రమే ఉత్తీర్ణులవ్వగా, 295మంది తప్పారు.
వీరిలో అత్యధికంగా 162మంది విద్యార్థులు గణితం-2లో తప్పారు. తరువాత స్థానాల్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీలో 132మంది, భౌతికశాస్త్రంలో 80 మంది తప్పారు. తప్పిన 295 మందిలో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులు 165మంది, రెండు సబ్జెక్టులు తప్పినవారు 75మంది, మూడు సబ్జెక్టులు తప్పిన వారు 41 మంది, 4సబ్జెక్టులు తప్పిన వారు 13మంది, 6సబ్జెక్టులు తప్పిన వారు ఒకరు ఉన్నారు. సబ్జెక్టులు తప్పిన వారందరికీ ఈ నెలాఖరులో రెమీడియల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
లోపం ఎక్కడ...
గత నాలుగేళ్లుగా ఇంజినీరింగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ మెకానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టులలోనే ఎక్కువ మంది తప్పుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై యూనివర్సిటీ అధికారులు దృష్టిసారించి లోపాలు సరిచేసుకోకపోవడం వల్లనే ప్రతి సెమిస్టర్‌లోనూ విద్యార్థులకు గండంగా మారింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లెక్చరర్ల బోధన విద్యార్థులకు అర్థంకాక తప్పుతున్నామని విద్యార్థుల అభిప్రాయం. మరికొంతమంది ఫ్యాకల్టీలు, లెక్చరర్లు రెగ్యులర్‌గా క్లాసులకు రారని తెలుస్తుంది. ఇకనుంచైనా ఉన్న లోపాలను సవరించుకుంటే మంచిఫలితాలు వచ్చి ట్రిపుల్‌ఐటీల ప్రతిష్ట మసకభారకుండా ఉంటుందని మేధావులు పేర్కొంటున్నారు.