సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బహిర్గతం చేసింది. కాంట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం మంజూరు చేసిన నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.1,051.57 కోట్లు మేరకు పెంచేసి, అనుచిత లబ్ధి చేకూర్చారని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాజెక్టులు పూర్తయినా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాలువ) పనులు చేయనందువల్ల రైతులకు ప్రయోజనం దక్కట్లేదని స్పష్టం చేసింది. భూసేకరణలో జాప్యం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యం.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లలో లోపాలు.. పనులలో అక్రమాలు వెరసి.. పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల పనులు ముందుకు సాగట్లేదంటూ కడిగిపారేసింది. దేశంలో ఏఐబీపీ ప్రాజెక్టుల పనుల తీరుపై అధ్యయనం చేసిన కాగ్ పార్లమెంట్‌కు నివేదికిచ్చింది.
ఏఐబీపీ ప్రాజెక్టుల పనులో ఎక్కడా లేని రీతిలో ఏపీలో భారీగా అక్రమాలు జరుతున్నాయని పేర్కొంది.అడ్డగోలుగా అంచనాల పెంపు..రాష్ట్రంలో తాడిపూడి ఎత్తిపోతల, గుండ్లకమ్మ, తారకరామ తీర్థసాగరం, భవనాసి మినీ రిజర్వాయర్‌లను సత్వరమే పూర్తి చేసేందుకు ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇస్తోంది. ఈ పనుల్లో రాష్ట్రప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది.గుండ్లకమ్మ ప్రాజెక్టు 2008లోనే పూర్తయింది. మొత్తం 32,400 హెక్టార్లకుగాను 27,110 హెక్టార్ల ఆయకట్టుకు అప్పట్లోనే నీటిని విడుదల చేశారు. మిగిలిన 5,290 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 21.06 ఎకరాల భూమిని సేకరించాలి. కానీ రాష్ట్రప్రభుత్వం 2014 నుంచి ఇప్పటిదాకా సేకరించలేదు. ఎకరానికి రూ.1,500 చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. కానీ అంచనా వ్యయాన్ని రూ.165.22 కోట్ల నుంచి రూ.753.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు అనుచితంగా లబ్ధి చేకూర్చింది. ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే గ్రామాలవారికి పునరావాసం కల్పించడంలోనూ విఫలమైందని తేల్చింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం 2008 నాటికే దాదాపుగా పూర్తయింది. 83,609 హెక్టార్లకుగాను 62,138 హెక్టార్ల ఆయకట్టుకు అప్పట్లో నీటిని అందించారు.
మరో 21,471 హెక్టార్లకు నీటిని అందించాలి. కానీ 2014 నుంచి ఇప్పటివరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టనందువల్ల మిగతా ఆయకట్టుకు నీళ్లందించలేదు. అయితే అంచనాల్ని రూ.376.96 కోట్ల నుంచి రూ.568 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్టు కాగ్ ఆక్షేపించింది. తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు కింద పదివేల హెక్టార్లకు నీటిని ఇవ్వాలి. ప్రాజెక్టుకు అవసరమైన 107.53 ఎకరాల భూమిని ఇప్పటిదాకా సేకరించలేదు. పనులు కాంట్రాకర్లకు అప్పగించాక డీపీఆర్‌లో భారీగా మార్పులుచేర్పులు చేశారు. దీంతో అంచనా వ్యయాన్ని రూ.220.11 కోట్ల నుంచి రూ.471.31 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు ప్రయోజనం కల్పించినట్టు కాగ్ వెల్లడించింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో భవనాసి చెరువును మినీ రిజర్వాయర్‌గా చేపట్టే పనులను రూ.27 కోట్లతో చేపట్టారు. మినీ రిజర్వాయర్‌గా మార్చే పనులకు భూసేకరణ చేయలేదు. అంచనా వ్యయాన్ని రూ.27 కోట్ల నుంచి రూ.47.72 కోట్లకు పెంచి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చింది.
వెలిగల్లు రిజర్వాయర్ పూర్తి కాకుండానే...
వెలిగల్లు రిజర్వాయర్‌ను పూర్తి కాకుండానే పూర్తయినట్లు ప్రకటించారు. కానీ రిజర్వాయర్ పనుల్లో పలు లోపాలు బయటపడ్డాయి. ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరించి ప్రాజెక్టు పూర్తయినట్టుగా ప్రకటించకుండా ఉండుంటే.. మరమ్మతులకయ్యే ఖర్చును కాంట్రాక్టరే భరించేవారు. కానీ సర్కారు తీరు వల్ల రూ.16 కోట్ల ప్రజాధనంతో రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్టు కాగ్ తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment