
ఎయిమ్స్ టాపర్‌గా విశాఖ విద్యార్థిని శ్రీవిద్య
* కూకట్‌పల్లి వాసి వశిష్టకు రెండో ర్యాంకు
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏఐఐఎంఎస్-ఎయిమ్స్) ప్రవేశపరీక్ష-2014 ఫలితాల్లో విశాఖపట్నం విద్యార్థిని పి.శ్రీవిద్య జాతీయస్థాయి ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన పోలిశెట్టి వశిష్టకు రెండో ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో వైద్య విద్య కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
శ్రీచైతన్యనారాయణ మెడికల్ అకాడ మీ విద్యార్థిని అయిన శ్రీవిద్య ఇటీవల విడుదలైన ఎంసెట్ మెడిసిన్ ఫలితాల్లో 7వ ర్యాంక్ సాధించింది. వశిష్ట ఈ ఏడాది జరిగిన జిప్‌మర్, ఏఐపీఎండీలలో రెండో ర్యాంకు, మణిపాల్ మెడికల్ టెస్ట్‌లో 9వ ర్యాంకు, ఎంసెట్‌లో 67వ ర్యాంకు సాధించాడు. తాను ఎయిమ్స్‌లోనే ఎంబీబీఎస్ చేస్తానని వశిష్ట తెలిపాడు. బయాలజీ విభాగంలో జూలై 5న ఇండోనేసియాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు భారత్ తరఫున వశిష్ట ప్రాతినిధ్యం వహించనున్నాడు.