
సాక్షి, అమరావతి: 2018 సంవత్సరం ముగిసిపోయి 2019 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేవేళ పగలూ, రాత్రీ తేడా లేకుండా జనాన్ని మత్తులో ముంచేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమైంది. ఆ మేరకు డిసెంబర్ 31న జనాన్ని కిక్కెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా ఆ రోజున మద్యం అమ్మకాలను రూ.150 కోట్లు దాటించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఒకవైపు మద్యం ఆదాయం తమకు ముఖ్యం కాదని చెబుతూనే.. మరోవైపు మద్యం అమ్మకాలను భారీ ఎత్తున పెంచేందుకు చర్యలు చేపట్టడం గమనార్హం. ఇందులో భాగంగా బార్లు, వైన్ షాపులు, లైసెన్సులిచ్చే ఈవెంట్ పర్మిట్లు, అంతర్గతంగా జరుపుకునే పార్టీల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. దీంతో ఇందుకనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా వెలగపూడిలోని సచివాలయంలో కొత్త ఏడాది మద్యం అమ్మకాలు.. అనుమతులపై ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావులు చర్చించారు. గతేడాది తెల్లవారుజాము 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతించారు. మద్యం అమ్మకాలు మరింత పెంచేందుకుగాను ఈ ఏడాది మరో గంట అదనంగా సమయమివ్వడంపై చర్చించినట్టు సమాచారం. ఆ మేరకు డిసెంబర్ 31, జనవరి 1న రెండురోజులపాటు తెల్లవారు జాము వరకు అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.
గతేడాది రూ.101 కోట్లు దాటిన అమ్మకాలు
సాధారణంగా రాష్ట్రంలో ఒక్కరోజులో సగటున రూ.40 కోట్లపైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. గతేడాది డిసెంబర్ 31న ఒక్కరోజులోనే మద్యం అమ్మకాలు రూ.101 కోట్లు దాటాయి. దీంతో ఈ దఫా రూ.150 కోట్లను దాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై ఇప్పట్నుంచే ప్రత్యేకంగా దృష్టి సారించింది. మద్యం, బీర్ల కొరత లేకుండా డిపోల్లో భారీగా సరుకును అందుబాటులో ఉంచాలని ఏపీబీసీఎల్ అధికారులకు సూచనలందాయి. ప్రతిసారీ బీర్ల కొరత ఏర్పడుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనంగా 90 వేల కేసుల్ని డిపోల్లో ఉంచి మద్యం షాపులు, బార్లకు చేరవేశారు. ఈవెంట్లు, పార్టీలకు అడిగినంత మద్యాన్ని సరఫరా చేసేందుకు బార్లు, వైన్‌షాపులకు అనుమతులిచ్చారు. సాధారణంగా బార్లు, మద్యం షాపులకు సరుకు సరఫరా చేసే మద్యం డిపోల్ని ఆదివారం మూసివేస్తారు. కానీ కొత్త ఏడాది ప్రారంభమవుతున్న సందర్భంగా అన్ని మద్యం డిపోలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. కాగా, క్రిస్మస్ పండుగ రోజున కూడా అమ్మకాలు జరపాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ అవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment