ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి విలయతాండవం | Ajay kallam on Corruption in andhrapradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి విలయతాండవం

Published Sat, Apr 14 2018 3:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Ajay kallam on Corruption in andhrapradesh  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో పెచ్చుమీరుతున్న అవినీతిపై మరో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజేయ కల్లం గళం విప్పారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయిందని, సాగునీటి ప్రాజెక్టులు తదితరాల పేరుతో అవినీతి విశృంఖలంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. మెగా రాజధాని నగరం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తోందని తప్పుపట్టారు. అధికార కేంద్రీకరణ తప్పుడు విధానమని, మెగా నగరాల ఆలోచనే అసంబద్ధమని, ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తప్ప ప్రజలకు ఏవిధంగానూ ఉపయోగం కాదని కుండబద్దలు కొట్టారు.

తామేదో పెద్ద తాజ్‌మహల్‌ను నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోవాలనే పిచ్చితనం నుంచి పాలకులు దూరం కావాలని హితవు పలికారు. వారి పేరు కోసం ప్రజలు ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం మొత్తం ఒకేచోట ఎందుకు కేంద్రీకృతం కావాలి? కేవలం ఒకే నగరంలోనే అన్నీ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకమని చెప్పారు. సింగపూర్‌ ప్రైవేట్‌ సంస్థల కన్సార్టియం ప్రతిపాదన సరికాదని సర్వీసులో ఉండగానే తాను తప్పుపట్టానని, ఫైల్‌లో ఆ మేరకు స్పష్టంగా రాశానని గుర్తుచేశారు.

అజేయ కల్లం కంటే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన ఐవైఆర్‌ కృష్ణారావు కూడా చంద్రబాబు సర్కారుపై ఇలాంటి విమర్శలతోనే పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి అక్రమాలు, ప్రభుత్వ తప్పుడు విధానాలపై అజేయ కల్లం కూడా తాజాగా పుస్తకం రాసి, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ పుస్తకం రాయడానికి నేపథ్యం ఏమిటి? ఇందులో ఏయే అంశాలు ఉన్నాయనే అంశాలపై అజేయ కల్లం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అందులో కొన్ని ఆయన మాటల్లోనే...

పెద్ద నగరాలతో ప్రజలకు భారమే
‘‘పెద్ద పెద్ద నగరాల వల్ల ప్రజలకు అన్ని విధాలా భారం తప్ప లాభం ఉండదు. అనుభవజ్ఞులు ఎవరూ మహా నగరాలను కట్టరు. నగరం పెద్దదయ్యే కొద్దీ రవాణా వ్యయం, నీటి సరఫరా రేటు, విద్య ఖర్చులు, ఇంటి అద్దె లాంటివన్నీ పెరుగుతాయి. జీవన వ్యయం భారీగా పెరుగుతుంది.

నేను సర్వీసులో ఉన్నప్పుడే మెగా నగరాలు, గ్రేటర్‌ నగరాల నిర్మాణ ప్రతిపాదనలను ప్రజా వేదికలపైనే తప్పుపట్టాను. పెద్ద నగరాల్లో ఏముంటుంది? నేరాలు, వ్యభిచారం, చెడు అలవాట్లు పెరుగుతాయి. ప్రజలకు మనశ్శాంతి ఉండదు. అందువల్ల ప్రజలకు కావాల్సింది గ్రామ స్వరాజ్యమేనని జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారు. స్వయం సమృద్ధి, స్వయం పాలన గల చిన్న చిన్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు చౌకగా అందుబాటులోకి వస్తాయి.

అధ్యయనాల్లోనూ తేలింది
నగరాల పరిమాణం పెరిగే కొద్దీ ప్రజలు నివసించడానికి ఉపయోగపడేలా ఉండవని జర్మనీతోపాటు పలు దేశాలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. నగరాలు పెద్దవయ్యే కొద్దీ అన్ని రకాల ఖర్చులూ పెరుగుతాయని జర్మనీలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.  

అతి తెలివి తక్కువ ఆలోచన  
పెద్ద నగరాలుంటేనే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని ప్రజలను భ్రమల్లో ముంచడం తెలివి తక్కువ ఆలోచన. మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? లాస్‌ఏంజెలెస్, షికాగో, న్యూయార్క్‌ లాంటి నగరాల్లో లేదు కదా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో(యూఎస్‌ఏ) మారుమూల ప్రాంతమైన రెడ్‌మాండ్‌లో  మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కేంద్రం ఉంది.

వారెన్‌ బఫెట్‌ అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఒమాహా అనే మారుమూల ప్రాంతం నుంచే నడుపుతున్నారు. పెద్ద నగరాలు కట్టడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే మేలు జరుగుతుంది. స్థిరాస్తి ధరలను పెంచి భారీగా ఆర్జిస్తారు. అందుకే ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ కోసం అంతర్జాతీయ స్థాయి అమరావతి నగరం అంటోందని విమర్శలు ఉన్నాయి.

ఎవరు హీరోలు?   
యువత ఆలోచనా విధానం మారాలి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మేకప్‌లు వేసుకొని, ఎవరో రాసిచ్చిన డైలాగులు చదివేవారు హీరోలా? లేక త్యాగాలు చేసిన, సమాజ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించిన వారు హీరోలా? సినిమాల్లో ఎంత గొప్పనటులైనా అయి ఉండొచ్చు. డబ్బు సంపాదించుకోవచ్చు. సమాజానికి వచ్చేసరికి హీరోలంటే కొన్ని లక్షణాలు కచ్చితంగా ఉండాలి. సినిమాలను నిజజీవితంతో ముడిపెట్టడం సరికాదు.

గ్లామర్, కులం, ప్రాంతం... చూడొద్దు
ప్రజలు ఓట్లు వేసే ముందు ఎవరు మంచివారు? ఎవరికి ఓట్లు వేస్తే సమాజానికి మేలు చేస్తారు? అనే కోణంలోనే ఆలోచించాలి. గ్లామర్, కులం, ప్రాంతం ఆధారంగా ఓటు వేయొద్దు. రాజకీయ పార్టీలు, నేతలు వారి అజెండాతో ముందుకొస్తున్నారు. ప్రజలు తమకు కావాల్సిందేమిటో ఆలోచించుకుని అజెండా రూపొందించుకునే స్థితికి రావాలి. దీనిని బలపరిచే వారికే ఓట్లు వేయాలి. నా పుస్తకం చదివితే రాజకీయ నేతలు, రాజకీయాలపై నా అభిప్రాయం  అర్థమవుతుంది.

ఈ నెల 20వ తేదీలోగా స్వాతంత్య్ర సమరయోధులు, మిత్రులతోనే నిరాడంబరంగా పుస్తకాన్ని ఆవిష్కరిస్తా. నేను ఎవరినీ తప్పుబట్టడం కోసం పుస్తకం రాయలేదు. కేవలం యువతను, ప్రజలను మేల్కొల్పడం ద్వారా సమాజానికి నా వంతు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే రాశాను. పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న నేపథ్యంలో యువతను మేల్కొల్పడం, ప్రజల కళ్లు తెరిపించడం కోసమే 70 పేజీలకు మించకుండా చిన్న పుస్తకం రాశాను. అందుకే దీనికి ‘మేలుకొలుపు’ (ఆంగ్లంలో వేకప్‌ కాల్‌) అని పేరు పెట్టాను’’ అని అజేయ కల్లం పేర్కొన్నారు.

ప్రజలను చైతన్యపరచాలన్నదే నా తపన
‘‘రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయింది. బదిలీలు మొదలు ప్రతి అంశంలోనూ అవినీతి పెరిగిపోయింది. దీనికి పరిష్కారం ఏమిటి? అంతర్గత జవాబుదారీతనం పూర్తిగా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ ప్రయోజనార్థం యువతను, ప్రజలను చైతన్యపరచాలన్నదే నా తపన.

భూ పరిపాలన ఎందుకిలా కుప్పకూలింది? భూ వివాదాలు ఏమిటి? కారణాలు ఏంటి? పరిష్కార మార్గాలు ఏంటి? వ్యవసాయం, విద్య, ఆరోగ్యం.. ఇలాంటి ప్రాథమిక అంశాలకు ప్రాచుర్యం కల్పించడమే నా ఉద్దేశం. ప్రజల ఉద్దేశం కూడా అదే’’ అని అజేయ కల్లం స్పష్టం చేశారు.  

తామేదో పెద్ద తాజ్‌మహల్‌ను నిర్మించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే పిచ్చితనం పాలకుల్లో పోవాలి. ఈ జబ్బు 1600 సంవత్సరంలోనే కొందరు పాలకులకు అంటుకుంది. ఇంకా మన పాలకులు అలాగే పిచ్చిగా ఆలోచించడం అవివేకం. వారి పేరు కోసం ప్రజలు ఎన్నుకోలేదు. తమకు మంచి చేస్తారనే ఆశతోనే ప్రజలు  గెలిపించారని పాలకులు గుర్తించకపోవడం బాధాకరం.

ఒకేచోట ప్రభుత్వం మొత్తం ఎందుకు కేంద్రీకృతం కావాలి? అన్ని విభాగాలు, శాఖలు ఒకే నగరంలో ఎందుకు ఉండాలి? విశాఖపట్నంలో నాలుగు శాఖలు, తిరుపతిలో నాలుగు, కాకినాడలో నాలుగు, కర్నూలులో నాలుగు ప్రభుత్వ విభాగాలను పెట్టడం వల్ల నష్టమేంటి? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటూ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం లేదా? కేంద్రం ఉదయం అడిగితే రాష్ట్రం సాయంత్రానికల్లా సమాచారం పంపుతోంది కదా. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి రోజుల్లో ఇది మరింత సులభం. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకం. అది తప్పుడు విధానం. ప్రపంచంలో పలుచోట్ల చిన్న నగరాల్లోనే రాజధానులు ఉన్నాయి. అయితే, స్వార్థం కోసమే ఇలా(అధికార కేంద్రీకరణ) చేసేవారికి ఎవరేం చెప్పినా చెవికెక్కదు

 ‘‘రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదనను నేను సర్వీసులో ఉండగానే తప్పుపట్టాను. ఫైల్‌లోనే దీనికి వ్యతిరేకంగా ఆరు పేరాలు రాశాను. రాష్ట్రానికి సచివాలయం లేకపోయినా ఫర్వాలేదు. సచివాలయాలు ఉండాల్సింది గ్రామాల్లోనే’’

‘‘ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రశ్నించలేదని ఎవరైనా అడగొచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే అడిగేది, అడగాల్సింది అడిగేశా. ఫైళ్లలో రాయాల్సింది రాశా. సలహాలు ఇచ్చా. అధికారులు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. అధికారులు ఎవరైనా అంతకంటే పాలకులను ప్రశ్నించి ఏమీ చేయలేరు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు పాలకులే కదా. వారి అజెండా ప్రజల అజెండా కాకుండా స్వార్థపూరితం కావడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement