
ఏకే-47 మాయం!
మాగజైన్, అందులోని 30 తూటాలు సైతం
గండిపేటలోని {Vేహౌండ్స్ హెడ్-క్వార్టర్స్‌లో ఉదంత
హైదరాబాద్ శివార్లలోని గండిపేట ప్రాంతం.. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన గ్రేహౌండ్స్ హెడ్-క్వార్టర్స్ ఉంది ఇక్కడే.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ప్రదేశమిది. అటువంటి చోటి నుంచి అత్యంత ప్రమాదకరమైన ఏకే-47 రైఫిల్ మాయమైంది. దాంతో పాటు బుల్లెట్లు ఉండే భాగమైన మాగజైన్, అందులోని 30 తూటాలు సైతం కనిపించట్లేదు. నెల రోజుల క్రితం ఈ ఉదంతం చోటు చేసుకోగా.. రహస్యంగా ఉంచిన అధికారులు.. విచారణ చేపట్టారు.
రికార్డుల్లో ఎంట్రీతోనే జారీ చేస్తారు..
రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టుల కూంబింగ్‌తో పాటు ఇతర ఆపరేషన్లకు గ్రేహౌండ్స్ హెడ్-క్వార్టర్స్ నుంచి కంపెనీలుగా పిలిచే బృందాలను తరలిస్తారు. ఒక్కో కంపెనీ ఆపరేషన్‌కు బయలుదేరే ముందు ఇతర వనరులతో పాటు అక్కడ ఉండే ఆయుధాగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్) నుంచి తుపాకులు, తూటాలు అందిస్తారు. ఆ సమయంలో ఏ ఆయుధం ఎవరికి ఇస్తున్నామనేది వారి పేర్లు, తుపాకీ బట్ నంబర్ సహా రికార్డు చేసుకుని సంతకం తీసుకుంటారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి అప్పగించేప్పుడూ మరోసారి రికార్డుల్లో ఎంట్రీ చేసిన తరవాతే డిపాజిట్ చేసుకుంటారు. రెండు నెలల క్రితం ఆంధ్రా-ఛత్తీస్‌గ ఢ్ సరిహద్దుల్లో కూంబింగ్‌కు వెళ్తున్న ఓ కంపెనీకి ఆయుధాలు జారీ చేశారు. వీరు తిరిగి వస్తున్న సమయంలో ఓ ఉద్యోగి అత్యవసరమై మధ్యలోనే ఆగిపోయారు. ఆయన ఏకే-47ను, మాగజైన్, తూటాలు సహా సహచరులకు ఇచ్చి పంపారు. ఇవి బెల్ ఆఫ్ ఆర్మ్స్‌కు చేరినట్లు రికార్డులు సైతం ఉన్నాయి.
ఎన్నికల హడావుడి ప్రారంభమైన తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో కూంబింగ్ చేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు భారీ స్థాయిలో కంపెనీల్ని రంగంలోకి దింపారు. వీరికి ఆయుధాలు కేటాయిస్తున్న సందర్భంలో ఏకే-47తో పాటు మాగజైన్, తూటాలు మిస్ అయిన విషయం వెలుగులోకొచ్చింది. దీంతో విషయాన్ని బయటకు పొక్కకుండా ఉంచిన అధికారులు అంతర్గతంగా ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు. ఇది ‘ఇంటి దొంగలు’ పనిగా నిర్థారిస్తూ ఆ కోణంలో ముందుకెళ్తున్నారు. అయితే నెల రోజులు దాటినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్‌చార్జ్ సహా పలువురిపై బదిలీ వేటు పడింది.