పౌరాణికం.. చారిత్రకం.. సాంఘికం.. నవల.. చిత్రం ఎలాంటిదైనా ఆ పాత్రల్లో ఒదిగిపోవడం నటసామ్రాట్ అక్కినేనికి మాత్రమే సొంతం.
హైదరాబాద్, న్యూస్‌లైన్: పౌరాణికం.. చారిత్రకం.. సాంఘికం.. నవల.. చిత్రం ఎలాంటిదైనా ఆ పాత్రల్లో ఒదిగిపోవడం నటసామ్రాట్ అక్కినేనికి మాత్రమే సొంతం. తన నటనతో ఎన్నో అపురూపమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారాయన. అందుకే రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి అవార్డులు అక్కినేని సొంతమయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆయనను అవార్డుల అక్కినేనిగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. ఆయనకు వచ్చిన అవార్డులు వేల సంఖ్యలో ఉండడంతో వాటిని భద్రపరిచేందుకు, అభిమానులు తిలకించేందుకు అనువుగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా అక్కినేని అవార్డు గ్యాలరీని 2005లో ఏర్పాటు చేశారు. అక్కినేని అందుకున్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (1991)తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తదితర అవార్డులు, మెమోంటోలు, జ్ఞాపికలు ఈ గ్యాలరీలో భద్రపర్చారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను అందుకున్న అరుదైన బిరుదులు, జ్ఞాపికలకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా ఇక్కడే ఉన్నాయి.
స్టూడియో సందర్శన కోసం వచ్చిన అభిమానులు, ప్రజల కోసం ఈ గ్యాలరీ తెరిచి ఉంచేవారు. ఇప్పటి వరకు ఈ గ్యాలరీని 12 లక్షల 46 వేల మంది సందర్శించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అక్కినేని కూడా తరచూ ఈ గ్యాలరీకి వచ్చి తాను అందుకున్న అవార్డులను మురిపెంగా చూసుకునేవారు. మానసిక ప్రశాంతత కావాల్సినప్పుడు ఆయన ఈ గ్యాలరీలో గడిపేవారని స్టూడియో వర్గాలు తెలిపాయి. అంతేకాదు అక్కినేనిపై పలువురు రాసిన పుస్తకాలు కూడా ఈ గ్యాలరీలో అందుబాటులో ఉంచారు. అక్కినేనికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఆయన పలు పుస్తకాలు రాశారు. రచనల్లో ఆయనది అందె వేసిన చేయి. తన జీవితచరిత్రను ‘నేను నా జీవితం’ అనే పుస్తకంగా రాశారు. అమెరికాలో తన మొదటి పర్యటనను వివరిస్తూ ‘నేను చూసిన అమెరికా’ అనే పుస్తకాన్ని రాశారు. అ, ఆ లు, మనసులోని మాట అనే పుస్తకాలను సైతం ఆయన రచించారు.