అక్కినేని పేరుతో అవార్డులివ్వాలి
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకుఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తి
సాక్షి, సిటీబ్యూరో: దివంగత మహానటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిటఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలని ఎంపీ, నటుడు మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో యువ కళావాహిని ఆధ్వర్యంలో ఎస్. కొండలరావు సారథ్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ నేతృత్వంలో నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మహానటుడు అక్కినేని 91వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల ప్రారంభోత్సవంలో మురళీ మోహన్ మాట్లాడుతూ ఈ విషయమై సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు ఆలోచించాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మహానటులు అక్కినేని, ఎన్టీఆర్‌లు గుర్తుండి పోతారని అన్నారు.
నాటక రచయిత డీఎస్ దీక్షిత్‌లు మాట్లాడుతూ ఏటా నిర్వహించే ఈ నాటిక పోటీల ప్రారంభ, ముగింపు సభలకు వారి వారసులు నాగసుశీల, నాగార్జునలు తప్పక హాజరు కావాలని కోరారు. అంతకుముందు అక్కినేని చిత్రపటానికి ఎంపీ మురళీమోహన్ పూలమాల వేశారు. ఏఎన్‌ఆర్ నాటక కళాపరిషత్‌ను అక్కినేని కుమార్తె నాగసుశీల ప్రారంభించారు. అనంతరం కళాకారులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (ఆకాశవాణి), జి.ఎల్.ఎన్.మూర్తి(థియేటర్ క్రిటిక్), జర్నలిస్టులు మహమ్మద్ రఫీ, పి.అబ్బులు, వి.రాజశేఖర్(దూరదర్శన్), డి.సురేష్ కుమార్, రాధాప్రశాంతి (సినీ నటి), ఎన్.రవికుమార్ తదితరులకు డాక్టర్ అక్కినేని నాటక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి.కృష్ణకుమారి, సినీ నటి గీతాంజలి, నటులు ఎల్.బి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుర్బానీ, నచ్చావోయ్ నారాయణ అనే నాటికలను ప్రదర్శించారు.