సాక్షి, గుంటూరు: లాటరీ ద్వారా మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న వ్యాపారులు సిండికేట్లుగా మారి జిల్లాలో దందా కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లాటరీలో దక్కించుకున్న వారి నుంచి షాపులు కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాలలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయకూడదు.
అయితే నిబంధనలను కాదని వ్యాపారాలు చేసేందుకు సిండికేట్లు సిద్ధమవుతున్నారు. గత ఏడాది అనేక ప్రాంతాల్లో జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడం, అక్కడ మహిళలు, ప్రజాసంఘాలు తిరగబడి ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు, పోలీసులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు సిండికేట్లు అనుకున్నచోటే దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు.
ప్రభుత్వ దుకాణాలు ఎక్కడ ?
జిల్లాలో ఈ ఏడాది 35 ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఈ నెల 1వ తేదీ నుంచి వ్యాపారాలు ప్రారంభించగా, జిల్లాలో సగానికి పైగా ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోలేదు.ఇప్పటివరకు మద్యం షాపుల్లో ఉండే ఉద్యోగుల నియామకానికి దరఖాస్తులు కోరకపోవడం చూస్తుంటే ప్రభుత్వ దుకాణాలు కేవలం అలంకార ప్రాయంగా మారనున్నాయనే విషయం స్పష్టమవుతోంది.
దేవుడి పేర్లు పెట్టటం హేయం..
మద్యం దుకాణాలకు అధిక శాతం దేవుడి పేర్లు పెట్టటం హేయమైన చర్య అని ఆధ్యాత్మిక వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే దుకాణాలపై దేవుడి బొమ్మలను సైతం వాడుతున్నారని, ప్రభుత్వం స్పందించి మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకుండా నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నడికుడి దుకాణానికి డిమాండ్ ..
నడికుడి గ్రామంలో సుమారు 17 వేల మంది జనాభా ఉంది. దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణం అద్దంకి-నార్కెట్‌పల్లి స్టేట్ హైవేకు పక్కనే ఉండటం కలిసొచ్చే అంశాలుగా మారాయి. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. టెండర్లు పిలిచినప్పుడు రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 5.20 కోట్లు బిడ్ వేసి ఈ దుకాణాన్ని దక్కించుకున్నారు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడ మరో మద్యం దుకాణం ఏర్పాటు చేయకపోవడం వెనుక అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిడే కారణంగా చెపుతున్నారు. ప్రస్తుతం ఈ దుకాణాన్ని రామారావు అనే వ్యక్తి దక్కించుకున్నారు..
షాపు ఎవరికి వచ్చినా 50 శాతం వాటా ఇవ్వాల్సిందే ...
నడికుడిలో మద్యం షాపు ఎవరు దక్కించుకున్నా 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట డివిజన్‌లో ఓ ముఖ్య నేత తనయుడు, ఓ సీనియర్ ఎమ్మెల్యే మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తమకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. నడికుడి మద్యం దుకాణానికి రూ.1.50 కోట్లు ఇచ్చి కొను గోలు చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ అధికార పార్టీ ముఖ్యనేతకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు పాతర..ఊరూరా మద్యం జాతర
Published Sat, Jul 4 2015 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement